Business

జీవితకాల గరిష్ఠానికి భారత స్టాక్ మార్కెట్-BusinessNews-Sep 12 2024

జీవితకాల గరిష్ఠానికి భారత స్టాక్ మార్కెట్-BusinessNews-Sep 12 2024

* దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్ ఉందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని సంకేతాలు వస్తుండటంతో.. మళ్లీ బంగారం, వెండికి డిమాండ్ పెరగవచ్చునని వారి భావన. అమెరికా కార్మికశాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం 2.5 శాతంగా ఉంది. గడిచిన ఏడాదితో పోలిస్తే 1 శాతం మాత్రమే పెరిగింది. గత మూడేళ్లలో ఇంత స్వల్పంగా పెరగడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను కూడా తగ్గించే ఛాన్స్ ఉండటంతో.. దీని ప్రభావం బంగారం, వెండిపై పడుతుంది.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు పరుగులు పెట్టాయి. ముఖ్యంగా రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్‌ తొలిసారి 83 స్థాయిని అందుకుంది. తర్వాత స్వల్పంగా క్షీణించింది. నిఫ్టీ సైతం 450కి పైగా పాయింట్లు లాభపడింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.7 లక్షల కోట్లు పెరిగి రూ.466 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 81,930.18 పాయింట్ల (క్రితం ముగింపు 81,523.16) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో మరింత దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే 83,116.19 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. చివరికి 1439.55 పాయింట్ల లాభంతో 82,962.71 వద్ద ముగిసింది. నిఫ్టీ 470.45 పాయింట్ల లాభంతో 25,388.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.97 డాలర్లుగా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే ఇండియా మినహా అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

* ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ బడ్జెట్‌ ధరలో మరో మొబైల్‌ను లాంచ్‌ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం05 (Samsung Galaxy M05)పేరుతో దేశీయ మార్కెట్‌ల్లోకి తీసుకొచ్చింది. రెండేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో దీన్ని ఆవిష్కరించింది. 5,000mAh బ్యాటరీ,25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో తీసుకొచ్చిన ఈ మొబైల్‌ ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేయండి. శాంసంగ్ కొత్త ఫోన్‌ ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్‌ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. మింట్‌ గ్రీన్‌ రంగులో ఈ ఫోన్‌ లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ ప్లాట్‌ఫామ్‌తోపాటు ఇతర రిటైల్‌ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. మొబైల్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌ యూఐతో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఉపయోగించారు. డ్యూయల్‌ నానో సిమ్‌కు సపోర్ట్‌ చేసేలా దీన్ని రూపొందించారు. మైక్రోఎస్‌డీ కార్డ్‌ సాయంతో 1టీబీ వరకు స్టోరేజ్‌ పెంచుకొనే సదుపాయం ఉంది. వెనకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా ఇచ్చారు. 4జీ, 3.5mm హెచ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

* అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌ చమురు ధర 80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్‌ ధరల (Petrol, diesel prices) భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర మూడేళ్ల కనిష్ఠానికి చేరింది. 2021 డిసెంబర్‌ తర్వాత బ్యారెల్‌ చమురు ధర మంగళవారం 70 డాలర్ల దిగువకు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండడమే దీనికి కారణం. క్రూడ్‌ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌+ దేశాలు భావిస్తుండగా.. ఉత్పత్తిని పెంచాలని భారత్‌ కోరుతోంది. మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్‌ ఆయిల్‌ను వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z