Health

భారత్‌లో మంకీపాక్స్ కేసుల నిర్ధారణ-NewsRoundup-Sep 12 2024

భారత్‌లో మంకీపాక్స్ కేసుల నిర్ధారణ-NewsRoundup-Sep 12 2024

* సీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీ కార్యాలయం ముందు భారాస నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. పీఏసీ ఛైర్మన్‌ అరెకపూడి గాంధీని విడుదల చేయడంపై భారాస నేతలు అభ్యంతరం తెలిపారు. అరెకపూడిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

* పశ్చిమ బెంగాల్‌ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్‌ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందన్నారు.

* సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, గనులు,ఎక్సైజ్‌ శాఖమంత్రి కొల్లు రవీంద్ర, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌లు సభ్యులుగా ఉంటారు.

* తన తండ్రి నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ సుధీర్‌ బాబు (Sudheer Babu) భావోద్వేగానికి గురయ్యారు. చిత్ర పరిశ్రమలోకి వెళ్తానని చెప్పినప్పుడు ఆయన గుండె ముక్కలైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ‘మా నాన్న సూపర్‌ హీరో’ (maa nanna super hero) టీజర్ లాంచ్‌ ఈవెంట్‌లో మాట్లాడారు. ఆయన ప్రధాన పాత్రలో అభిలాష్‌ రెడ్డి కంకర తెరకెక్కించిన చిత్రమది. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన సినిమా అక్టోబరు 11న విడుదల కానుంది.

* పీఏసీ ఛైర్మన్‌ అరెకపూడి గాంధీ స్టేషన్‌ బెయిల్‌పై నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌ తదితరులు గాంధీకి సంఘీభావం తెలిపారు. పోలీసులు ఇచ్చిన 41 నోటీసుకు వివరణ ఇచ్చినట్టు గాంధీ తెలిపారు. ‘‘నన్ను ఆహ్వానిస్తేనే కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లా. కానీ, మాపై దాడి చేశారు. కౌశిక్‌ భార్య విల్లాపై నుంచి కుండీ, మొక్కలు మా కార్యకర్తలపై విసిరేశారు. 40 మంది నన్ను అడ్డుకున్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కౌశిక్‌ ప్రయత్నించారు. నన్ను ఆంధ్రా వాడు అన్నారు. అదే భారాస విధానమైతే ఆ పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పార్టీ అధినేత కేసీఆర్‌.. కౌశిక్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలి’’ అని గాంధీ డిమాండ్‌ చేశారు.

* ఏపీలో వరద నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం సచివాలయానికి చేరుకుని సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. రెండ్రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. వరద నష్టంపై చేపడుతోన్న ఎన్యూమరేషన్‌ గురించి సీఎంకు వివరించింది. ప్రాథమికంగా రూ.6,882 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాలను కోరారు. పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగిందనే విషయాన్ని కేంద్ర బృందాలకు సీఎం వివరించారు.

* ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా గుర్తింపు పొందిన ఏచూరి.. 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

* చైనా బారి నుంచి తైవాన్‌ను రక్షించేందుకు అమెరికా రహస్యంగా ఏర్పాట్లు చేస్తోంది. చైనా ఆక్రమణను ఎదుర్కోవడంపై తన అత్యున్నత నేవీ సీల్స్‌ బృందానికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. 2011లో పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి అల్‌ఖైదా నేత బిన్‌ లాడెన్‌ను ఈ బృంద సభ్యులే అంతం చేశారు. తాజాగా చైనా దురాక్రమణ చేస్తుందన్న అనుమానాలతో తైవాన్‌కు సాయం చేసేలా.. దీనికి శిక్షణ ఇస్తున్నట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక కథనంలో పేర్కొంది. అమెరికా దళాల్లో అత్యంత సున్నితమైన సైనిక ఆపరేషన్లను ఈ బృందమే నిర్వహిస్తుందన్న పేరుంది. దాదాపు ఏడాది నుంచి ఈ దశ సభ్యులు వర్జీనియా బీచ్‌లోని ప్రధాన స్థావరం డామ్‌నెక్‌ వద్ద శిక్షణ పొందుతున్నారు. దేశ రాజధాని వాషింగ్టన్‌కు ఇది 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాతో ఘర్షణ తప్పదని అమెరికా వ్యూహకర్తలు చెబుతున్న వేళ ఈ దానిని అడ్డుకోవడానికి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

* ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కో-ఛైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

* ఇండియ‌న్‌ స్టాండప్ కమెడియన్, బాలీవుడ్ నటుడు వీర్‌ దాస్‌ (Vir Das) అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. హాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డుల (Emmy Awards) వేడుకకు హోస్ట్‌గా నిర్వ‌హించే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. దీంతో ఈ వేడుక‌లో హోస్ట్‌గా నిర్వ‌హించే తొలి భార‌తీయ న‌టుడిగా వీర్ దాస్ రికార్డు క్రీయేట్ చేయ‌నున్నాడు. ఈ వేడుక న‌వంబ‌ర్‌లో న్యూయార్క్ వేదిక‌గా జ‌రుగ‌నుండ‌గా.. ఈ వేడుక‌కు హోస్ట్‌గా వీర్ దాస్ వ్యవహరించనున్నారు. అయితే వీర్ దాస్ ఎంపిక కావ‌డంపై ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

* హర్యానాలో ఒక యువకుడికి లక్షణాలుంటే మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలో మరో ఇద్దరికి మంకీపాక్స్ సంకేతాలున్నట్టు గ్రహించి.. వీళ్లను ఐసొలేషన్‌లో ఉంచారు. పరీక్షల తర్వాత ఇది వెస్ట్-ఆఫ్రికన్ క్లేడ్‌-2 మంకీపాక్స్ వైరస్‌గా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన క్లేడ్‌-1 రకం వైరస్‌ కాదు కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. పైగా క్లేడ్ -2 వైరస్ కొత్త రకం వేరియంట్ కాదు. గత రెండేళ్లలో దేశంలో ఇటువంటివి 30 దాకా నమోదయ్యాయి. ఇప్పుడు వైరస్ సోకిన వాళ్లు విదేశాలకు వెళ్లి అక్కడే మంకీపాక్స్ సోకిన తర్వాత భారత్‌కు వచ్చారు. వేగంగా వ్యాప్తి చెందే వైరస్ కానప్పటికీ.. ఛాన్స్ ఇవ్వొద్దనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. మంకీపాక్స్ కేసులు పెరగకుండా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే మంకీ పాక్స్ అలర్ట్‌తో విశాఖలో అప్రమత్తమయ్యారు వైద్యాధికారులు. విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రత్యేక మెడికల్ టీం ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ పాసింజర్లపై ప్రత్యేక నిఘా పెంచారు. ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను పరిశీలించారు DMHO డాక్టర్ జగదీశ్వర్ రావు. అంతేకాకుండా కింగ్ జార్జ్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రిలోనూ ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశారు . మంకీపాక్స్ పై విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్రం రాష్ట్రాల సూచనలతో.. ప్రత్యేక వైద్యుల కమిటీని నియమించారు. మంకీ‌పాక్స్ పై ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తమయ్యామన్నారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వర్ రావు. ఎయిర్‌పోర్టులో హెల్త్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్సు ఆఫీసర్ తో కూడిన వైద్య బృందాన్ని నియమించామన్నారు. గతంలో ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ సమయంలో పనిచేసిన సిబ్బందిని టీం లో చేర్చి పర్యవేక్షిస్తున్నారు. స్క్రీ్నింగ్ చేసి.. సస్పెక్ట్ ఉంటే ఆసుపత్రికి తరలించి ఐసోలేట్ చేస్తున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీని చెక్ చేస్తున్నారు. విశాఖలో చెస్ట్ ఆసుపత్రి కేజీహెచ్ లో ప్రత్యేక బెడ్స్ సిద్ధం చేశామని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z