WorldWonders

బాలికను వేధించిన రైల్వే ఉద్యోగి. కొట్టి చంపిన ప్రయాణీకులు-CrimeNews-Sep 13 2024

బాలికను వేధించిన రైల్వే ఉద్యోగి. కొట్టి చంపిన ప్రయాణీకులు-CrimeNews-Sep 13 2024

* రైలులో ప్రయాణించిన బాలిక పట్ల రైల్వే ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులపై తన కుటుంబానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఆ వ్యక్తిని కొట్టి చంపారు. బీహార్‌లోని బరౌని నుంచి ఢిల్లీకి వెళ్లే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని సివాన్‌కు చెందిన ఒక కుటుంబం ఈ రైలులోని థర్డ్‌ ఏసీ కోచ్‌లో బుధవారం ప్రయాణించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా సమస్త్‌పూర్ గ్రామానికి చెందిన గ్రూప్ డీ రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్‌ కూడా ఆ కోచ్‌లో ప్రయాణించాడు. ఆ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలికను తన సీటు వద్ద కూర్చొబెట్టుకున్నాడు. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బాలిక తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. కాగా, వాష్‌రూమ్‌ నుంచి తిరిగి వచ్చిన తల్లిని పట్టుకుని ఆ బాలిక బోరున ఏడ్చింది. తల్లిని వాష్‌రూమ్‌ వద్దకు తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో రైల్వే ఉద్యోగి ప్రశాంత్ కుమార్‌ ప్రవర్తనపై ఆ మహిళ తన భర్త, మామతోపాటు కోచ్‌లోని ఇతర ప్రయాణికులకు చెప్పింది. దీంతో అతడ్ని ఆ కోచ్ డోర్‌ వద్దకు తీసుకెళ్లారు. కదులుతున్న రైలులో పలు గంటలపాటు కొట్టారు. మరోవైపు గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ సెంట్రల్‌ స్టేషన్‌కు ఆ రైలు చేరింది. దీంతో కోచ్‌ వద్దకు చేరకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు ప్రశాంత్‌ కుమార్‌ను అప్పగించారు. బాలికను వేధించినట్లు అతడిపై ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

* తెదేపా కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. సురేష్‌ను రెండు రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ మంగళగిరి కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. సెప్టెంబరు 5న సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. కార్యాలయం వద్ద వాహనాలు, అద్దాలు, కార్యాలయం లోపల ఫర్నిచర్‌ ధ్వంసం చేశాయి. అడ్డుకున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినా.. వైకాపా పాలనలో విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దాడికి పాల్పడిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి 23మందిని అరెస్టు చేశారు. వారిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా ఉన్నారు. ఈనెల 5వ తేదిన సురేష్ ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14రోజులు రిమాండ్ విధించింది.

* అమెరికాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ స‌ర‌స్సులో మునిగి ఇద్దరు తెలుగు చిన్నారులు మృత్యువాత ప‌డ్డారు. గ‌త శ‌నివారం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌లోని హోల్ట్స్‌విల్లేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డేవిడ్‌, సుధా గాలి అనే తెలుగు దంప‌తులు నివ‌సిస్తున్నారు. ఈ దంప‌తుల‌కు రూత్ ఎవాంజెలిన్ గాలి, సెలాహ్ గ్రేస్ గాలి అనే 7, 5 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ‌నివారం రోజు వారిద్దరూ ఆడుకునేందుకు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లారు. కానీ ఎంత‌సేప‌టికి ఆ చిన్నారులు తిరిగి ఇంటికి రాలేదు. దాంతో త‌ల్లి వారి కోసం ఇంటి చుట్టుప‌క్కలంతా వెతికింది. క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ప్పిపోయి ఉంటార‌ని భావించి వెంట‌నే 911కి కాల్ చేసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. ఆమె స‌మాచారం మేర‌కు పోలీసులు రెస్క్యూ సిబ్బందితో అక్క‌డికి చేరుకున్నారు. అనంత‌రం తెలుగు దంప‌తులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ స‌మీప ప్రాంతాల‌లో వెతికారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు చిన్నారులు అపార్ట్‌మెంట్ స‌మీపంలోని స‌ర‌స్సులోని నీటిపై తేలియాడుతూ క‌నిపించారు. వెంట‌నే వారిని బ‌య‌ట‌కుతీసి ద‌గ్గరిలోని స్టోనీబ్రూక్ యూనివ‌ర్సిటీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ వారిని ప‌రీక్షించిన వైద్యులు అప్పటికే పిల్లలు చనిపోయిన‌ట్లు నిర్ధారించారు. ఇద్దరు కుమార్తెల‌ను పోగొట్టుకున్న త‌ల్లి సుధా గాలి గుండెల‌విసెలా రోదించడం అక్కడివారిని క‌లిచివేసింది. చిన్నారుల తండ్రి డేవిడ్‌ వీసా స‌మ‌స్య కార‌ణంగా స్వదేశంలోనే ఉన్నట్లు తెలిసింది. అత్యవ‌స‌ర వీసాపై అమెరికా వెళ్లాల్సి ఉన్నా అది కుద‌ర‌క‌పోవ‌డంతో ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. క్రిస్ట్‌ఫ‌ర్‌ లైఫ్ చ‌ర్చ్ అనే నిధుల సేక‌ర‌ణ సంస్థ స‌మాచారం ప్రకారం డేవిడ్‌ను ఎమ‌ర్జెన్సీ వీసాపై అమెరికాకు పంపించే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఆయ‌న యూఎస్ వెళ్లిన త‌ర్వాతే చిన్నారుల అంత్యక్రియ‌లు నిర్వహించ‌నున్నార‌ని స‌మాచారం.

* చిత్తూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం మొగలి కనుమరహదారిలో బస్సు, రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్ధలంలోనే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్‌ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చేసుకుంది. కనుమ రహదారిలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ అదుపు తప్పి పక్క రోడ్డులో ఎదురుగా వస్తున్న బస్సు పైకి దూసుకెళ్లింది. ఘటనలో ఆర్టీసీ డ్రైవర్‍ తో పాటు ఎనిమిది మంది మృత్యవాత పడ్డారు. మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎస్పీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z