NRI-NRT

Breaking: తానాకు నిరంజన్ లీగల్ నోటీసులు

Breaking: తానాకు నిరంజన్ లీగల్ నోటీసులు

2025 తానా మహాసభల సమన్వయకర్త నియామక ప్రక్రియ చెల్లదని ప్రస్తుత తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, తానా కార్యదర్శి కసుకుర్తి రాజాలకు నోటీసులు పంపించారు. ఆగష్టు 25వ తేదీన జరిగిన ఆయన నియామకం సంస్థ రాజ్యాంగానికి లోబడి జరగలేదని అందులో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమని తెలిపారు.

తానా రాజ్యాంగం ఆర్టికల్ 13, సెక్షన్ 1డి ప్రకారం ప్రతి రేండేళ్లకు ఒకసారి నిర్వహించే తానా సభల సమన్వయకర్తను అధ్యక్షుడి ప్రతిపాదనతో కార్యవర్గ ఆమోదంతో నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని నిరంజన్ అన్నారు. కానీ తన అనుమతి, ప్రమేయం లేకుండా ఆగష్టు 25వ తేదీన తాను గైర్హాజరైన కార్యవర్గ సమావేశంలో, అజెండాలో సైతం పొందుపరచకుండా డెట్రాయిట్‌లో 2025 జులైలో జరిగే తానా సభల సమన్వయకర్తగా నియమించడాన్ని ఆయన సవాల్ చేశారు. ఇది అధికార దుర్వినియోగమని పేర్కొంటూ నిరంజన్ తాఖీదులు పంపారు. తానా 2025 సభలకు సంబంధించిన ప్రచారాలు, ప్రకటనలు, వార్తా ప్రకటనలనతో పాటు, కమిటీల ఏర్పాటు, ఇతర కార్యకర్తల నియామకాలు వంటివాటిని కూడా నిలుపుదల చేయాలని ఆయన తన నోటీసుల్లో కోరారు.

సోమవారం సాయంత్రం 5 గంటల లోగా తానా బోర్డు స్వచ్ఛందంగా సదరు సమన్వయకర్త నియామకం చెల్లదని ప్రకటన వెలువరించాలని, లేని పక్షంలో సంస్థ రాజ్యాంగానికి లోబడి, తనకున్న అధికారాలను, హక్కులను పరిరక్షించుకునేందుకు కోర్టు ద్వారా పోరాడతానని నిరంజన్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z