Agriculture

తెలంగాణాలో పామాయిల్ రైతులకు శుభవార్త-NewsRoundup-Sep 14 2024

తెలంగాణాలో పామాయిల్ రైతులకు శుభవార్త-NewsRoundup-Sep 14 2024

* తెలంగాణ పామాయిల్‌ రైతులకు భారీ ఊరట లభించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తిపై ముడి పామాయిల్‌ దిగుమతిపై 5.5 నుంచి 27.5 పన్ను శాతం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు రాష్ట్ర పామాయిల్‌ రైతుల తరఫున మంత్రి తుమ్మల కృతజ్ఙతలు తెలిపారు. గతంలో ముడి పామాయిల్‌ దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ఆయిల్‌పామ్ గెలల ధర తగ్గడంతో రైతులు నిరాశ చెందారు. దీంతో కొత్తగా పంట సాగు చేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపిందని మంత్రి అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులకు అధిక ధర అందించి రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు లాభసాటిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి చెప్పారు. కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం తిరిగి విధించి దేశీయ పామాయిల్‌ రైతులను ఆదుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు మంత్రి తుమ్మలతోపాటు ఆయిల్‌పామ్‌ రైతులు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి చొరవతో ఈనెల13న కేంద్రం ముడి పామాయిల్‌ దిగుమతిపై సుంకం 5.5 నుంచి 27.5 శాతం పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

* రజనీకాంత్‌ (Rajinikanth) కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ (Coolie Movie). నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో జరుగుతోంది. శనివారం కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద షూటింగ్‌ ప్రాంతానికి అతి సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లిథియం బ్యాటరీల లోడ్‌తో వచ్చిన కంటైనర్‌ షిప్‌ వద్ద మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

* తన నటన, డ్యాన్స్‌తో బాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ సొంతం చేసుకున్నారు నటుడు గోవిందా (Govinda). హీరో, సహాయ నటుడు, కమెడియన్‌గా ఆయన ఎన్నో చిత్రాల్లో యాక్ట్‌ చేశారు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఒకానొక సమయంలో గోవిందా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను ఉద్దేశించి ఆయన సతీమణి సునీత తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఆయన్ని కలిసేందుకు అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారని చెప్పారు. ‘‘కెరీర్‌ పరంగా ఉన్నత దశలో ఉన్నప్పుడు ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉండేవారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ చూసి నేను ఆనందించేదాన్ని. ఆయన్ని చూసేందుకు, కలిసేందుకు ఫ్యాన్స్‌ విచిత్రమైన పనులు చేసేవారు. అలా, జరిగిన ఓ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మాకు పెళ్లైన కొత్తలో మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. ఇంటి పనుల్లో సాయం చేస్తానని చెప్పి.. పనిమనిషిగా చేరింది. దాదాపు 20 రోజులు మాతోనే ఉంది. ఆమెకు గిన్నెలు శుభ్రం చేయడమే కాదు.. కనీసం ఇల్లు క్లీన్‌ చేయడం కూడా రాదు. షూటింగ్స్ నుంచి ఆలస్యంగా వచ్చే ఆయన్ని చూడటం కోసం ఆమె నిద్ర మానుకునేది. ఆమె రూపురేఖలు, ప్రవర్తన చూస్తే ధనవంతుల అమ్మాయిలా అనిపించింది. ఇదే విషయాన్ని మా అత్తయ్యతో చెప్పా. చివరకు ఆమె ఒక మంత్రి కుమార్తె అని తెలిసింది. ఆమెను ప్రశ్నించగా.. కన్నీళ్లు పెట్టుకుని.. నా భర్తకు తాను వీరాభిమానిని అని చెప్పింది. ఆమె ఇంట్లో వాళ్లకు సమాచారం ఇచ్చాం. ఆమె తండ్రి నాలుగు ఖరీదైన కార్లతో మా ఇంటికి వచ్చారు. మేము షాకయ్యాం’’ అని సునీత తెలిపారు.

* అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) శనివారం జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని దోడా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. ఆ తరహా పార్టీలు ఈ ప్రాంతంలో అభివృద్ధిని దెబ్బతీశాయని విమర్శించారు.

* జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది చట్టబద్ధమైనదే. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్‌ నెల లోపు ఆర్డినెన్స్‌ రానుంది. విశేష అధికారాలు కూడా రాబోతున్నాయి. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం. గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తరహాలో హైడ్రా పనిచేస్తుంది’’ అని రంగనాథ్‌ తెలిపారు.

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన (Kolkata Doctor Rape and Murder)కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న జూనియర్‌ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈక్రమంలో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మాట్లాడారు. స్వయంగా ఆమె నిరసన శిబిరానికి వెళ్లి.. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని కోరారు. ఈ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ‘స్వస్థ్‌ భవన్‌’ ఎదుట జూనియర్‌ వైద్యులు గత నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యాహ్నం నిరసన శిబిరానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Bengal CM Mamata Banerjee) వెళ్లారు. ఆమెను చూడగానే ‘న్యాయం కావాలి’ అంటూ జూనియర్‌ వైద్యులు నినాదాలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం అని అన్నారు.

* దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నిన్న రాత్రి తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎంకు టపాసులతో స్వాగతం పలికారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాణసంచా (Fire Crackers) వినియోగంపై దిల్లీలో నిషేధం ఉండటమే ఇందుక్కారణం.

* ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఖైరతాబాద్ గణేశుడికి భక్తుల తాకిడి పెరిగింది.

* బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటన సందర్భంంగా.. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై స్పందించారు. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందన్నారు.

* కర్ణాటకలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిపై కేసు పెట్టడంతో గ్రామంలోని దళితులను వెలివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గిర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా బాలిక గర్భవతి అని తేలింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z