Business

తెలుగు రాష్ట్రాల నుండి భారీగా స్టాక్ ఇన్వెస్టర్లు-BusinessNews-Sep 14 2024

తెలుగు రాష్ట్రాల నుండి భారీగా స్టాక్ ఇన్వెస్టర్లు-BusinessNews-Sep 14 2024

* సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌ని (Madhabi Puri Buch) కాంగ్రెస్‌ పార్టీ (Congress) మరోసారి లక్ష్యంగా చేసుకుంది. గతంలో చేసిన ఆరోపణలకు ఆమె, ఆమె భర్త శుక్రవారం సుదీర్ఘ వివరణ ఇచ్చిన వేళ.. మరోసారి కొత్త ఆరోపణలతో ముందుకొచ్చింది. సెబీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఉంటూ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారంటూ ఆ పార్టీ నేత పవన్‌ ఖేరా మరోసారి ఆరోపణలు గుప్పించారు. సెబీలో ఉంటూ 2017 నుంచి 2023 మధ్య లిస్టెడ్‌ సెక్యూరిటీల్లో రూ.36.9 కోట్లు ట్రేడింగ్‌ చేశారంటూ ఆరోపించారు. 2018-19 పెద్ద మొత్తంలో ట్రేడింగ్‌ నిర్వహించారని పేర్కొన్నారు. విదేశీ ఫండ్స్‌లోనూ మదుపు చేశారని పవన్‌ ఖేరా ఆరోపించారు. ఇందులో చైనాకు చెందిన పెట్టుబడులూ ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం నాలుగు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఆమె మదుపు చేయగా.. అందులో చైనాకు చెందిన గ్లోబల్‌ X MSCI చైనా కన్జూమర్‌, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఈటీఎఫ్‌లో ఆమె పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. ఈ పెట్టుబడుల గురించి ఆమె ఎప్పుడు ప్రకటించారు? ఈ విషయం ప్రభుత్వ ఏజెన్సీలకు తెలుసా? అని నిలదీశారు. అలాగే సెబీ ఛైర్‌పర్సన్‌ ఇచ్చిన వివరణనూ తోసిపుచ్చారు. ముఖ్యంగా ఐసీఐసీఐ, మహీంద్రా గ్రూప్‌ విషయంలో ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు.

* స్థిరమైన ఆదాయం పొందాలనుకొనే వారికి వెంటనే గుర్తుకు వచ్చే పథకం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD). ఎన్ని పెట్టుబడి అవకాశాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్‌ లేకుండా మదుపు చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఎఫ్‌డీలపైనే మక్కువ చూపుతుంటారు. దీంతో బ్యాంకులు కూడా వీరిని ఆకర్షించేందుకు వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. అలా కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులైతే ఏకంగా 9శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి.

నార్త్ ఈస్ట్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మూడేళ్ల పాటు చేసే ఎఫ్‌డీపై ఈ బ్యాంక్‌ 9శాతం వడ్డీని ఇస్తోంది.

సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 60ఏళ్ల లోపు వారికి చేసే ఎఫ్‌డీపై గరిష్ఠంగా 8.6శాతం వడ్డీని అందిస్తోంది.

ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్ కూడా ఎఫ్‌డీలపై 8.50శాతం వడ్డీని ఇస్తోంది.

జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మూడేళ్ల పాటు చేసే ఎఫ్‌డీపై 8.25శాతం వడ్డీ ఇస్తోంది.

యునిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 60ఏళ్లలోపు మూడేళ్లపాటు చేసే ఎఫ్‌డీపై 8.15శాతం వడ్డీ పొందొచ్చు.

* ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న వేళ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోమారు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. 2024 డిసెంబర్‌ 14 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఆధార్‌ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే లభిస్తాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

* ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్‌ మ్యాగజైన్‌ తాజాగా విడుదల చేసింది. ‘టైమ్‌ బెస్ట్‌ కంపెనీస్‌ 2024’ పేరిట విడుదల చేసిన ఈ లిస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1000 కంపెనీలు ఉండగా.. వీటిలో భారత్‌కు చెందిన 22 సంస్థలు చోటుదక్కించుకున్నాయి. ఇందులో దేశీయ కంపెనీల జాబితాలో తొలి స్థానంలో ఏ అదానీ సంస్థనో, అంబానీకి చెందిన సంస్థనో చోటు దక్కించుకుందనుకుంటే పొరపాటే. ప్రముఖ టెక్‌ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. టైమ్‌ విడుదల చేసిన అత్యుత్తమ భారతీయ కంపెనీల జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 112 ర్యాంక్‌తో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 119 ర్యాంక్‌తో ఇన్ఫోసిస్‌, 134 ర్యాంక్‌తో విప్రో, 187 ర్యాంక్‌తో మహీంద్రా గ్రూప్‌ నిలిచాయి. బ్యాంకుల విభాగంలో 504 ర్యాంక్‌తో యాక్సిస్‌ బ్యాంక్‌ ముందంజలో ఉంది. ఆ తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 518 ర్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ 525 ర్యాంక్‌తో, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 551 ర్యాంక్‌ దక్కించుకున్నాయి. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 646 ర్యాంక్‌, అదానీ గ్రూప్‌ 736 ర్యాంక్‌ సంపాదించుకున్నాయి.

* పండగల సీజన్‌ ప్రారంభం కానున్న వేళ సామాన్యుల నెత్తిన మరో భారం పడేలా కన్పిస్తోంది. వంట నూనెల (Edible Oil)పై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ముడి పామాయిల్‌, సోయా బీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెపై ఇప్పటివరకు ఎలాంటి దిగుమతి సుంకం (Import Tax) లేదు. తాజాగా దీన్ని 20శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక, రిఫైన్డ్‌ పామాయిల్‌, సోయా బీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 32.5శాతానికి పెంచారు. వీటికి అగ్రికల్చర్‌ సెస్‌ అదనంగా వర్తిస్తుంది. ఈ పెంపుతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ‘‘దేశీయంగా సోయా, ఇతర నూనెగింజల సాగు రైతులకు ప్రయోజనం కల్పించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రైతులకు లబ్ధి చేకూరనుంది. మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం పడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేలా ఈ చర్యలు దోహదం చేస్తాయి’’ అని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి వెల్లడించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, రాజస్థాన్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు ఎక్కువగా ఉంటుంది.

* స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న తెలుగు రాష్ట్రాల మదుపర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈనెల 12 వరకు చూసుకుంటే, దేశం మొత్తంమీద శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఆధారితంగా ఇచ్చే యునీక్‌ క్లయింట్‌ కోడ్‌ (యూసీసీ)ల సంఖ్య 19,63,98,644. అంటే ఇంతమంది స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) వెబ్‌సైట్‌ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 87,08,753 మంది, తెలంగాణ నుంచి 43,28,231 మంది (మొత్తం 1,30,36,984) ఉన్నారు. అంటే దేశీయ మదుపర్లలో 6.8% మంది మన తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z