Business

పెరిగిన బంగారం ధర-BusinessNews-Sep 15 2024

పెరిగిన బంగారం ధర-BusinessNews-Sep 15 2024

* గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,01,552.69 కోట్లు పెరిగింది. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ ‘బుల్లిష్’గా ఉండటంతో భారతీ ఎయిర్‌టెల్ భారీగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,707.01 పాయింట్లు (2.10 శాతం) లబ్ధి పొందింది. గురువారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 83,116.19 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.54,282.62 కోట్లు వృద్ధి చెంది రూ.9,30,490.20 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,662.44 కోట్లు పెరిగి రూ.8,80,867.09 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఎం-క్యాప్ రూ.23,427.12 కోట్లు పుంజుకుని రూ.16,36,189.63 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,438.6 కోట్ల వృద్ధితో రూ.6,89,358.33 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.22,093.99 కోట్లు పెరిగి రూ.12,70,035.77 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,480.49 కోట్లు పుంజుకుని రూ.8,07,299.55 కోట్ల వద్ద స్థిర పడింది.

* బంగారం ధరలు మరింత ప్రియమయ్యాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్‌ తులం ధర రూ.440 అధికమై రూ.74,890కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.74,450గా ఉన్నది. అలాగే 22 క్యారెట్‌ ధర రూ.400 ఎగబాకి రూ.68,250 నుంచి రూ.68,650కి చేరుకున్నది. వెండి లక్ష రూపాయల దిశగా పయనిస్తున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.2,000 అధికమై రూ.97 వేలకు చేరుకున్నది. గడిచిన నాలుగు రోజుల్లో బంగారం రూ.2,500 వరకు, వెండి రూ.8 వేల వరకు పెరిగింది.

* సైబర్‌ మోసాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీనే ఆసరాగా తీసుకొని సైబర్‌ నేరగాళ్లు దాడులకు తెగబడుతున్నారు. దీంతో బాధితులకు రక్షణే లేకుండాపోతున్నది. అందుకే ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఇప్పుడు ఈ కోణంలో దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా బీమా సంస్థలు.. సైబర్‌ మోసాలకు రక్షణగా సాషే ప్రోడక్ట్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ఈ రిస్క్‌ కవరేజీలు కేవలం రోజుకు రూ.3కే లభిస్తుండటం విశేషం. వ్యక్తులు, వ్యాపార సంస్థల అవసరాలకు తగ్గట్టుగా ఈ చిన్న ప్లాన్లను ఇన్సూరర్లు రూపొందిస్తున్నారు.

* జీఎస్టీ ఎగవేతలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌(డీజీజీఐ) గుర్తించింది. 2024-25లో 6,084 కేసులు జీఎస్టీ ఎగవేతలకు పాల్పడినట్లు, వీటి విలువ రూ.2.01 లక్షల కోట్లని శనివారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సేవల విభాగంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇనుము, రాగి, తుక్కు వంటి విభాగాల్లో జీఎస్టీ ఎగవేతలు అధికంగా ఉంటాయని పేర్కొంది. 2022-23లో నమోదైన 4,872 కేసుల జీఎస్టీ ఎగవేత రూ.1.01 లక్షల కోట్ల కంటే ఇది రెండింతలు పెరిగింది. జీఎస్టీ ఎగవేతల్లో పన్నుకు సంబంధించినవి 46 శాతంగా ఉండగా, 20 శాతం ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌, 19 శాతం ఐటీసీకి సంబంధించినవని పేర్కొంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగంలో రూ.81 వేల కోట్ల ఎగవేతలు జరిగాయని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z