Editorials

ముగ్గురు IPSల సస్పెన్షన్ – NewsRoundup – Sep 15 2024

ముగ్గురు IPSల సస్పెన్షన్ – NewsRoundup – Sep 15 2024

* ఏపీలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా (Kanti Rana), ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నిని (Vishal Gunni) సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై ముంబయి నటి వ్యవహారంతోపాటు పలు అభియోగాలున్నాయి.

* దిల్లీ రాజకీయాల్లో (Delhi Politics) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్‌ (AAP) అధినేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) మరో రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా (kejriwal resignation) చేస్తానని ప్రకటించారు. ఎన్నికలు జరిగేంత వరకు వేరొకరు సీఎంగా బాధ్యతలు చేపడతారని, ప్రజా కోర్టులో గెలిచిన తర్వాతే మళ్లీ సీఎం పీఠంపై కూర్చుంటానని ఆయన ప్రతినబూనారు. కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణమేంటి? దిల్లీ రాజకీయాలపై దీని ప్రభావం ఉంటుందా? కేజ్రీవాల్‌ వ్యూహాలు ఫలిస్తాయా? ఇప్పుడు యావత్‌ భారతదేశం దృష్టి దిల్లీ రాజకీయాలపైనే పడింది. మద్యం విధానం కేసులో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్‌.. బయటకు వచ్చిన రెండు రోజుల్లోనే రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీని వెనక పెద్ద వ్యూహమే ఉంది. దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పుడు కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే ఆయన స్థానంలో ఆప్‌కు చెందిన మరొకరు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. అయితే ఒక వేళ ముందస్తు ఎన్నికలకు వెళితే నవంబరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇక్కడా ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఆప్‌ కూడా ఇదే డిమాండ్‌తో ముందుకెళ్లనుంది.

* గణేశ్‌ నిమజ్జనం దృష్ట్యా మెట్రోరైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సంస్థ వెల్లడించింది. చివరి స్టేషన్‌లో నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుందని పేర్కొంది. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడుపుతామని తెలిపింది. మరో వైపు ఆదివారం ఖైరతాబాద్‌ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ను 94వేల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు.

* తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందలు తెలిపారు. ఈ సందర్బంగా గాంధీభవన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్ఠానం ఎంతో నమ్మకంతో మహేశ్‌కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను 38 నెలలపాటు ప్రజల తరఫున పోరాడినట్లు చెప్పారు. ‘‘రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్‌ డిక్లరేషన్‌లో రాహుల్‌ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే.. తప్పక జరిగితీరుతుందని నిరూపించాం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించాం. ఆర్టీసీలో ఇప్పటివరకు 85 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు. మోదీ ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచి మహిళలకు భారంగా మార్చింది. మేం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నాం. వ్యవసాయ రుణం రూ.2లక్షలకు పైగా ఉన్న రైతులు భయపడొద్దు. రూ.2లక్షలకుపైగా ఉన్న మొత్తాన్ని రైతులు బ్యాంకుల్లో చెల్లిస్తే రూ.2లక్షల రుణమాఫీ పూర్తవుతుంది.” అని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

* తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికో దేశంలో న్యూవోలియోన్‌లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా భట్టి విక్రమార్కకు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది.

* ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం (NDA Govt) మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. రాజకీయ పరిణామాల వల్ల, వివిధ పార్టీలు కూటమిలో భాగమైనప్పటికీ.. అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ దేశ పురోభివృద్ధి కోసం ‘మోదీ 3.0’ (Modi 3.0) ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో గడిచిన 100 రోజుల్లో దేశాభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఓ సారి పరిశీలిస్తే..!

3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది.

ఉద్యోగ కల్పన కోసం రూ.11.11 లక్ష కోట్లు ఖర్చు చేసింది

వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధికి 17వ విడతగా రూ.20 వేల కోట్ల మొత్తాన్ని 9.3 కోట్ల మంది రైతులకు పంపిణీ చేసింది.

వివిధ రూపాల్లో ఇప్పటి వరకు 12.33 కోట్ల మంది రైతులకు రూ.3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది.

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్‌ పెట్టుబడుల కోసం సుమారు 12 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లు జమ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు రూ.12,100 కోట్లు కేటాయించింది.

డిజిటల్‌ అగ్రికల్చర్‌కి సంబంధించిన 7 పథకాలకు రూ.14,200 కోట్లు మంజూరు చేసింది.

అంతరిక్ష రంగంలో అంకురాల కోసం రూ.1000 కోట్లతో వెంచర్‌ కేపిటల్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.

ఇన్నోవేషన్‌ రంగంలో అంకురాల ఏర్పాటుకు విరివిగా అనుమతులు మంజూరు చేసింది.

వచ్చే ఐదేళ్లలో 41 మిలియన్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా.. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన కోసం పీఎం ప్యాకేజీ కింద తొలి వంద రోజుల్లోనే రూ.2 లక్షల కోట్లు కేటాయించింది.

మహిళా సాధికారతకు మోదీ 3.0 ప్రభుత్వం పెద్దపీట వేసింది.

మహిళల ఉపాధికి చర్యలు తీసుకుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏడాదికి సుమారు రూ.1 లక్ష సంపాదిస్తున్నారు.

చిన్నతరహా వ్యాపారాల కోసం ఇచ్చే ముద్ర లోన్‌ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది.

* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ రెండో వారంలో జరిగే అవకాశం ఉందని సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) తెలిపారు. వచ్చే 8 – 10 రోజుల్లో మహాయుతి కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని తెలిపారు. మొత్తం 288 సీట్లు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఆదివారం తన అధికారిక నివాసం వర్షలో విలేకర్లతో మాట్లాడారు. కూటమిలోని సీట్ల కేటయింపునకు మెరిట్‌, మంచి స్ట్రైక్‌ రేట్‌ ప్రామాణికమని స్పష్టం చేశారు.

* భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన పోటీలో అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటెను విసిరిన నీరజ్‌ కేవలం ఒక్క సెంటీమీటర్‌ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. అయితే ఆ సమయంలో చేయిగాయంతోనే పోటీలో పాల్గొన్నానని నీరజ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపాడు. గాయానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దాంట్లో ఎడమ చేతి ఉంగరపు వేలుపై పగులు ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఈ సంవత్సరం ఎన్నో అనుభవ పాఠాలను నేర్చుకున్నానని నీరజ్‌ వెల్లడించాడు.

* భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమ దేశం రప్పించేందుకు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఆమెపై అనేక కేసులు కూడా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ హత్య అభియోగాలపై మరో కేసు నమోదయ్యింది. దీంతో షేక్‌ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కి చేరింది. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో 22 ఏళ్ల విద్యార్థి హత్యకు సంబంధించి హసీనాతోపాటు మరో 58 మందిపై హత్య కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇలా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచి హసీనాపై ఇప్పటివరకు 155 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి. మారణహోమం, ఇతర నేరాలకు సంబంధించి ఏడు, మూడు అపహరణ, ఎనిమిది హత్యాయత్నంతోపాటు బీఎన్‌పీ పార్టీ ఊరేగింపుపై దాడికి సంబంధించిన కేసులున్నాయి.

* కరీంనగర్‌ జిల్లాలో మరో వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే మంకీపాక్స్ భయం కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్తగా ఓ చర్మ వ్యాధి భయపెడుతోంది. ప్రస్తుతం మంకీపాక్స్ అనే వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. దీని కారణంగా మరణాలు కూడా భారీగానే సంభవిస్తున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఇటీవల ఇండియాలోనూ ఒక మంకీ పాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఓ కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. ఈ వ్యాధి మొదట దురదతో మొదలై క్రమంగా గాయంగా మారుతున్నది. ఇప్పటికే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి.

* ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటన మురళీగూడ సమీపంలోని ఇట్కల్‌ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబం చేతబడి చేస్తున్నట్లుగా అనుమానించిన గ్రామస్తులు.. ఒక్కసారిగా ఆగ్రహించి దారుణానికి పాల్పడ్డారు. హత్య కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ కుటుంబ చేతబడి చేయడంతో తమ కుటుంబ సభ్యుడు ఒకరు అనారోగ్యానికి గురయ్యారని ఓ కుటుంబం గ్రామస్తులతో కలిసి కుటుంబంపై దారుణం దాడి చేసింది. కర్రలతో దాడికి పాల్పడడంతో ఐదుగురు మృతి చెందారు. ఘటనను జిల్లా ఎస్పీ చౌహాన్‌ కిరణ్‌ గంగారాం ధ్రువీకరించారు. గ్రామస్తులు చేతబడి చేస్తున్నారనే అనుమానం ఉందని.. వారిని హత్య చేసేందుకు గ్రామస్తులు సైతం ఏకమయ్యారని తెలిపారు.

* తిరుపతి (Tirupati ) గోవిందరాజస్వామి (Govindarajaswamy,) వారి పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవింద‌రాజ‌స్వామివారి ఉత్సవర్లను యాగశాలకు తీసుకు వచ్చి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z