Sports

హాకీ ఫైనల్‌కు భారత్-NewsRoundup-Sep 16 2024

హాకీ ఫైనల్‌కు భారత్-NewsRoundup-Sep 16 2024

* జీహెచ్‌ఎంసీ పరిధిలో వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు లక్ష విగ్రహాలను నిమజ్జనానికి తరలి రానున్న నేపథ్యంలో అందుకు సరిపడా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిమజ్జనం బందోబస్తు కోసం 25 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై గత రెండు నెలలుగా కసరత్తు చేసిన పోలీసులు.. కేవలం హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ 3 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాలాపుర్‌ వినాయకుడు హుస్సేన్‌ సాగర్‌ దగ్గరికి చేరుకునే అవకాశముంది. మహిళల భద్రతకు షీటీమ్స్‌ను రంగంలోకి దించుతున్నారు. హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాల్లోనే 12 షీటీమ్స్‌ పహారా కాయనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలను, ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను కూడా నగరంలోని అనుమతించరు.

* మ‌హిళ‌లకు ఎదుర‌వుతున్న సంఘ‌ట‌నల్ని, వాళ్ల విష‌యంలో స‌మాజ ధోర‌ణిని ఎత్తి చూపేలా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’ (Pink). అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ, కృతి కుల్హరి, విజయ్‌ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఆ సినిమాకి 8 ఏళ్లు (8 Years of Pink). 2016 సెప్టెంబరు 16న విడుదలైంది. ఈ సందర్భంగా తాప్సీ (Taapsee Pannu) నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. మహిళల భద్రత విషయంలో పరిస్థితులు ఇప్పటికీ మారలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఇండియన్‌ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ చిత్రాల జాబితాలో మా ‘పింక్‌’ నిలుస్తుందని అప్పుడు మేం ఊహించలేదు. అయితే, 8 సంవత్సరాలు గడిచినా సమాజంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ మహిళలకు సేఫ్టీ లేదు. ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఫీలయ్యే వారికి అదో బాధ’’ అని పేర్కొన్నారు.

* ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపునకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏడోరోజూ బోట్ల వెలికితీత పనుల్లో బెకెమ్‌ సంస్థ ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు అమలు చేసిన నాలుగు వ్యూహాలు విఫలమవడంతో సరికొత్త ప్లాన్‌తో బోట్లను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కోటి 40 టన్నుల బరువుండి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌ చేసే రెండు భారీ ఇసుక బోట్లను ఇనుప గడ్డర్లతో అనుసంధానించిన ఇంజినీర్లు.. వాటిని ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు తీసుకువచ్చారు. ఈ రెండు భారీ బోట్లు 300 టన్నులకు పైగా బరువును అవలీలగా లాగేలా గడ్డర్లను అమర్చారు. కృష్ణా నదిలో బ్యారేజీ 67వ గేటు వద్ద చిక్కుకున్న భారీ బోటును పైకి తీసుకు వచ్చి రెండు పడవల మధ్య భాగంలో గొలుసులు, రోప్‌లతో గట్టిగా కట్టారు. రెండు పడవలను ఒకేసారి నడుపుతూ చిక్కుకున్న పడవను ఒడ్డుకు లాక్కుని వచ్చేలా ప్రణాళికను అమలు చేస్తున్నారు. గత ఆరు రోజులుగా 4 రకాల ప్లాన్లను ఇంజినీర్లు అమలు చేయగా అన్నీ విఫలమయ్యాయి. తొలుత వంద టన్నుల బరువు ఎత్తే రెండు భారీ క్రేన్లతో బోట్లకు కట్టి ఎత్తే ప్రయత్నం చేయగా విఫలమైంది. డైవింగ్ టీంలతో బోట్లను రెండు భాగాలుగా ముక్కలు చేసి బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నమూ ఫలించలేదు.

* ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులపై బ్రిటన్‌ ప్రభుత్వం మరింత భారం మోపింది. చదువు కొనసాగుతున్న సమయంలో విద్యార్థులు తమ నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే నిధుల పరిమితిని పెంచింది. కోర్సు కొనసాగుతున్న సమయంలో నిర్దిష్ట మొత్తం తమవద్ద ఉందని చెప్పడానికి తగు ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. 2020 తర్వాత తొలిసారి బ్రిటన్‌ ఈ మొత్తాన్ని పెంచింది. బ్రిటన్‌లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ఆర్థికంగా ఎటువంటి ఆటంకం కలగకూడదని బ్రిటన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా నూతన నిబంధనలు రూపొందించింది. జనవరి 2025 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. లండన్‌లో ఉన్నత చదువు కోసం ప్రణాళిక చేసుకుంటున్న వారు నెలకు 1483 పౌండ్లు (రూ.1.64లక్షలు) సేవింగ్స్‌ రూపంలో తమ ఖాతాలో ఉన్నట్లు చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1334 పౌండ్లుగా ఉండగా.. దాదాపు 11 శాతం పెంచారు. లండన్‌ వెలుపల చదువుకునే వారికి నెలవారీ ఖర్చుల కోసం 1136 పౌండ్లు (రూ.1.25 లక్షలు)గా నిర్దేశించారు. తొమ్మిది నెలలు అంతకంటే ఎక్కువ కాలం లండన్‌లో చదివేవారు మొత్తంగా సుమారు రూ.14.77 లక్షలు తమ సేవింగ్స్‌ ఖాతాలో ఉన్నట్లు వీసా సమయంలో చూపించాలి. బ్రిటన్‌లో జీవన వ్యయం భారీగా పెరుగుతోంది. ఇలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ విద్యార్థుల నెలవారీ ఖర్చులను అంచనాలను స్థానిక ప్రభుత్వం క్రమంగా మారుస్తుంది.

* ఆసియా ఛాంపియన్స్‌ హాకీ ట్రోఫీలో భారత్‌ జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దూకుడుగా ఆడి వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన సెమీస్‌లోనూ సత్తాచాటింది. హర్మన్‌ప్రీత్‌ సేన 4-1 తేడాతో కొరియాపై విజయం సాధించింది. భారత్‌ తరఫున ఉత్తమ్‌ సింగ్ (13వ), హర్మన్‌ప్రీత్ (19వ, 45వ), జర్మన్‌ప్రీత్ సింగ్ (32వ) స్కోర్‌ చేశారు. కొరియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను జిహున్‌ యంగ్‌ (33వ నిమిషం) సాధించాడు. సెప్టెంబరు 17న జరగనున్న ఫైనల్‌లో చైనాతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌ ఫైనల్‌ చేరడం ఇది ఆరోసారి. నాలుగు సార్లు విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌పరంగా చూస్తే ఫైనల్‌లో ఇండియానే ఫేవరేట్ అని చెప్పొచ్చు. టోర్నీలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్‌కు మరో సెమీస్‌లో చైనా షాక్‌ ఇచ్చింది. తొలుత మ్యాచ్‌ 1-1తో టై అయింది. దీంతో షూటౌట్‌ నిర్వహించారు. ఇందులో చైనా 2-0తో పాక్‌ను ఓడించింది. టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న చైనా ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి.

* నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’’ అని అదితి క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

* ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) కూడా పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను (Amazon Great Indian Festival 2024) సెప్టెంబర్‌ 27న నిర్వహించనుంది. ప్రైమ్‌ మెంబర్లకు 24 గంటల ముందే సేల్‌ అందుబాటులోకి రానుంది. అంటే సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌ మొదలు కానుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ డేస్‌ సేల్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సేల్‌లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు డిస్కౌంట్‌ లభించనుంది. క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్‌ పే యూపీఐతో చేసే రూ.1000పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75శాతం, గృహోపకరణాలపై 50శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. దేనిపై ఎంత డిస్కౌంట్‌ ఇచ్చేది మాత్రం వెల్లడించలేదు.

* ఇటీవల స్పేస్‌ఎక్స్‌ (SpaceX) ఆధ్వర్యంలో నిర్వహించిన స్పేస్‌ వాక్‌ ప్రాజెక్టు పోలారిస్‌ డాన్‌ (Polaris Dawn)లో భాగంగా బిలియనీర్‌ జేర్డ్‌ ఇస్సాక్‌మన్‌(Jared Isaacman) బృందం అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ చేశారు. ఐదు రోజులపాటు స్పేస్‌లో గడిపిన ఈ బృందం దాదాపు 40 రకాల ప్రయోగాల్లో పాల్గొంది. అయితే ఇందులో భాగమైన బిలియనీర్‌ జేర్డ్‌ ఇస్సాక్‌మన్‌ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాపారవేత్తగా రాణించాలనే ఇష్టంతో తాను పాఠశాల విద్యను మధ్యలోనే మానేశానని ఆయన పేర్కొన్నారు.

* హైదరాబాద్ మహానగరం పరిధిలో గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జనం సందర్భంగా మంగళవారం నుంచి మూడు రోజుల పాటు 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది మూడు షిప్టుల్లో పనిచేస్తారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 465 క్రేన్లు, హుస్సేన్‌సాగర్‌ వద్ద 38 క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం వేళ.. భక్తులు పార్టీ పేపర్లు, పూలు, చెత్త రోడ్లపై వేయకుండా సిబ్బందికి సహకరించాలని ఆమ్రపాలి కోరారు.

* సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళా డాన్సర్‌ రెండు రోజుల క్రితం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపారు. కేసును నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు చెప్పారు. నార్సింగి పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.

* చాలామంది కష్టమొచ్చినప్పుడు చేతులు జోడించి దేవుడికి దండం పెట్టుకోవడం, ఆ గండం గడిచి గట్టెక్కితే ఫలానాది చేస్తానని మొక్కుకోవడం చూస్తుంటాం. దానికి తగ్గట్టుగా ఇష్టదైవానికి పొంగళ్లు చేయడం, తలనీలాలు సమర్పించడం, తులాభారం వంటివెన్నో చేస్తుంటారు. తమిళనాడులోని తంజావూర్‌ దగ్గరున్న వళంగైమాన్‌లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే- చనిపోయినవారిని శ్మశానవాటికకు తీసుకెళ్లేప్పుడు పాడె కడతారు కదా. దానిమీద ఊరేగిస్తూ అంతిమ సంస్కారాలకు తీసుకెళతారు. అందుకే ఆ పేరును కూడా చాలామంది తలచుకోరు. కానీ వళంగైమాన్‌లోని మారియమ్మన్‌ ఆలయానికి వెళ్లిన వాళ్లు- కోరిన కోరికలు తీరాక పాడె ఎక్కాల్సిందే. మొక్కు చెల్లించాల్సిన వారెవరైనా చనిపోయినవారి మాదిరి పాడె కట్టించుకుని ఊరంతా ఊరేగిన తరవాత ఆలయానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లాక పూజారి తులసితీర్థం చల్లాక మొక్కుతీరిపోతుంది. ఇలా చేయడం వల్ల మారియమ్మన్‌ ఆయురారోగ్యాలనీ అష్టైశ్వర్యాలనీ ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.

* నగరంలో గణేశ్ నిమజ్జనం దృష్ట్యా మెట్రోరైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 17న అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. ఖైరతాబాద్, లక్డికాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేటు భద్రతా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని, నిమజ్జనాలను వీక్షించేందుకు తరలివచ్చే భక్తులు మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.

* ఖైరతాబాద్‌ మహాగణపతి హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. మొత్తం రూ.70 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. తొలిసారిగా ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు చేపట్టారు. గత పదిరోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు కమిటీ పేర్కొంది. మరోవైపు బాలాపూర్‌ గణేశ్‌ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. వేలంపాట ప్రక్రియలో ఉత్సవకమిటీ తాజాగా కొత్త నిబంధన తీసుకొచ్చింది. పోటీదారులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది.

* ఆప్‌ (AAP) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal) అనూహ్య నిర్ణయంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కేజ్రీవాల్‌ మంగళవారం తన సీఎం పదవికి రాజీనామా చేస్తే తదుపరి సీఎం ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవైపు కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరగా.. ఆయన మంగళవారం సాయంత్రం 4.30గంటలకు సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆప్‌ శాసనసభాపక్షం రేపు ఉదయం 11.30 గంటలకు కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో సమావేశం కానుంది. కొత్త సీఎంగా ఎవరిని పెట్టాలో ప్రతిపాదించి చర్చించే అవకాశం ఉంది.

* భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్‌(Sakshi Malik), గీతా ఫొగాట్‌(Geeta Phogat), అమన్ సహ్రావత్‌ (Aman Sehrawat) సరికొత్త ప్రకటన చేశారు. త్వరలో తాము రెజ్లింగ్ ఛాంపియన్స్ సూపర్ లీగ్‌ (WCSL)ను ఆవిష్కరిస్తామని తెలిపారు. వర్ధమాన క్రీడాకారుల కోసం దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే దీనికి జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ నుంచి మద్దతు కావాల్సి ఉంది. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేస్తూ గత ఏడాది దేశ రాజధాని దిల్లీలో నిరసన దిగిన కుస్తీ యోధుల్లో సాక్షి మాలిక్ కూడా ఉంది. వారిలో వినేశ్‌ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఫొగాట్‌కు హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. అయితే వారితో కలిసి సాక్షి రాజకీయాల్లో చేరలేదు. ఆమె 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో 58 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. 2012లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌ షిప్‌లో 55 కేజీల విభాగంలో గీత కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఇటీవల జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో అమన్.. 57 కిలోల విభాగంలో ఉడుంపట్టు పట్టి కంచు మోగించాడు.

* చైనా(China)ను బెబింకా(Typhoon Bebinca) వణికిస్తోంది. సోమవారం ఉదయం డ్రాగన్ ఆర్థిక నగరమైన షాంఘైను ఈ టైఫూన్ తాకి, విజృంభిస్తోంది. గత ఏడు దశాబ్దాల కాలంలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది. గంటకు 151 కి.మీ. వేగంతో ఈరోజు తుపాను షాంఘై (Shanghai)ను తాకిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అరుదు. 1949లో టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుపాను ఇదే. దీంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు.

* మీరు పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? అయితే, సీబీఎస్‌ఈ ప్రకటించిన ఈ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(CBSE Merit Scholarship) మీ కోసమే. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ(CBSE) స్కాలర్‌షిప్‌ను అందజేస్తోంది. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సీబీఎస్‌ఈ(CBSE) పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అక్టోబర్‌ 31వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ను అమలు చేస్తున్నారు. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు నెలకు ₹500ల చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తుండాలి. పదో తరగతి పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులు (ఐదు సబ్జెక్టుల్లో) సాధించిన వారు ఈ స్కాలర్‌షిప్‌ అవార్డుకు అర్హులు. విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.1500 కన్నా మించి ఉండరాదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 31వరకు వరకు కొనసాగుతుంది. దరఖాస్తులను ఆయా పాఠశాలలు నవంబర్‌ 7 వరకు వెరిఫికేషన్‌ చేయనున్నాయి. ఈ స్కాలర్‌షిప్‌నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్‌ చేయించుకోవాలంటే సదరు విద్యార్థినులు కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. రెన్యువల్‌కు కూడా అక్టోబర్‌ 31 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సీబీఎస్‌ఈ ఓ ప్రకటనలో పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z