Kids

పిల్లల భవిత కోసం NPS Vatsalya పథకం-BusinessNews-Sep 16 2024

పిల్లల భవిత కోసం NPS Vatsalya పథకం-BusinessNews-Sep 16 2024

* తమ పిల్లల భవిష్యత్‌ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ వాత్సల్యను (NPS Vatsalya) కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్‌ 18న ప్రారంభించనున్నారు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA), కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి, ఆర్థిక శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. పథకం ప్రారంభంతో పాటు విధివిధానాలు తెలియజేయనున్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు/సంరక్షకులు ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్‌ (NPS) ఖాతాగా మారుతుందని జులైలో ప్రకటించిన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో తీసుకొచ్చిన ఎన్‌పీఎస్‌.. పన్ను ప్రయోజనాలతో పాటు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని ఇప్పుడు మరింత విస్తృత పరుస్తూ మైనర్లకూ వాత్సల్యను అందుబాటులోకి తేవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ వంటి మదుపు పథకాలకు ఇది అదనం. ఎన్‌పీఎస్‌ వాత్సల్య వల్ల ముందుగానే పెట్టుబడులు ప్రారంభించడానికి వీలు పడుతుంది. దీనివల్ల చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మైనర్లుగా ఉన్నప్పుడే ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవడం వల్ల రిటైర్మెంట్‌ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్‌ సమకూరుతుంది. ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా వల్ల చిన్నతనంనుంచే తమ పిల్లలకు నుంచే పొదుపు అలవాటు చేయొచ్చు. సాధారణంగా ఎన్‌పీఎస్‌లో టైర్‌-1, టైర్‌-2 ఖాతాలుంటాయి. టైర్‌-1 ప్రాథమిక పింఛను ఖాతా. ఇందులో చేరినప్పుడు ఉపసంహరణలపై కొన్ని పరిమితులు ఉంటాయి. టైర్‌-2లో స్వచ్ఛంద పొదుపు పథకంలాంటిది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై సెక్షన్‌ 80సీసీడీ(1బీ) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000కు అదనం. పదవీ విరమణ తర్వాత (60 ఏళ్లు) ఎన్‌పీఎస్‌ నిధిలో 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పదవీ విరమణ తర్వాత పింఛను పొందేందుకు వీలవుతుంది.

* హైదరాబాద్‌ బ్రాండ్‌ను ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. జినోమ్‌ వ్యాలీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30,40 ఏళ్లుగా కృషి చేస్తున్న ఫార్మా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం, సకల వసతులు కల్పిస్తూ మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తున్నామని చెప్పారు. సోమవారం లారస్‌ ల్యాబ్స్‌, కర్క ల్యాబ్స్‌ సుమారు 300 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో వందల మందికి ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రారంభించాయన్నారు. ప్రపంచ ఫార్మా దృష్టిని ఆకర్షించేందుకు జినోమ్‌ వ్యాలీని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా తయారు చేసి ఉపాధి అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అందుకే, ఫార్మా కంపెనీల దిగ్గజాలతో మరిన్ని పెట్టుబడులు రాబట్టే విషయమై చర్చించామన్నారు. ఈ సమావేశంలో టీజీఐఐసీ ఛైర్మన్‌ నిర్మలా జయప్రకాశ్‌రెడ్డి, ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పోట్రు, పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

* ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) కూడా పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను (Amazon Great Indian Festival 2024) సెప్టెంబర్‌ 27న నిర్వహించనుంది. ప్రైమ్‌ మెంబర్లకు 24 గంటల ముందే సేల్‌ అందుబాటులోకి రానుంది. అంటే సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌ మొదలు కానుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ డేస్‌ సేల్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సేల్‌లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు డిస్కౌంట్‌ లభించనుంది. క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్‌ పే యూపీఐతో చేసే రూ.1000పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. దేనిపై ఎంత డిస్కౌంట్‌ ఇచ్చేది మాత్రం వెల్లడించలేదు.

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో కేంద్రంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) విమర్శలు గుప్పించారు. ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించడంలేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు కలిసి సామాన్యుడి జేబులను కొల్లగొడుతున్నట్లు కనబడుతోందని ఆరోపిస్తూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ‘‘గడిచిన ఆరు నెలల కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 21శాతం మేర తగ్గాయి. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మాత్రం తగ్గించలేదు. చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు కలిసి సామాన్యుడి జేబులను లూటీ చేస్తున్నాయనిపిస్తోంది. తగ్గిన ముడిచమురు ధరల ప్రకారం.. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.8వరకు తగ్గించవచ్చు’’ అని గహ్లోత్‌ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z