Business

క్షీణించిన భారతీయ ఎగుమతులు-BusinessNews-Sep 17 2024

క్షీణించిన భారతీయ ఎగుమతులు-BusinessNews-Sep 17 2024

* దేశం నుంచి వస్తువుల ఎగుమతులు (Exports) ఆగస్టు నెలలో క్షీణించాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 9.3 శాతం మేర పడిపోయాయి. గతేడాది ఇదే సమయంలో 38.28 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది 34.71 బిలియన్‌ డాలర్లకు క్షీణించాయి. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం సంబంధిత డేటాను విడుదల చేసింది. అదే సమయంలో దిగుమతులు 3.3 శాతం మేర పెరిగాయి. గతేడాది ఆగస్టులో 62.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దిగుమతులు ఈ సారి 64.36 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం కారణంగా వాణిజ్య లోటు 29.65 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొనేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశమైన నేపథ్యంలో ఓ వైపు మదుపర్లు అప్రమత్తత పాటించినప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల సంకేతాలకు తోడు భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ షేర్ల అండతో సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ 83 వేల ఎగువన, నిఫ్టీ 25,400 స్థాయి ఎగువన రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 83,084.63 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,988.78) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత కాసేపు నష్టాల్లోకి జారుకున్నా తిరిగి కోలుకుంది. ఇంట్రాడేలో 82,866.68- 83,152.41 మధ్య చలించిన సూచీ.. చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 34.80 పాయింట్ల లాభంతో 25,418.55 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.75గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, టాటా స్టీల్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.26 డాలర్లు, బంగారం ఔన్సు ధర 2601.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో (Bajaj auto) మరో రెండు కొత్త బైకులను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. బ్రిటీష్‌ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌ (Triumph)తో కలిసి గతేడాది ట్రయంఫ్‌ స్పీడ్‌ 400, స్క్రాంబ్లర్‌ 400X బైక్‌లను లాంచ్‌ చేసిన బజాజ్‌.. తాజాగా మరో రెండు బైక్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ట్రయంఫ్‌ స్పీడ్‌ టీ4 (speed T4), స్పీడ్‌ 400 MY25 (Speed 400 MY25) పేరిట వీటిని విడుదల చేసింది. స్పీడ్‌ టీ4 ధర రూ.2.17 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌), స్పీడ్‌ 400 ఎంవై25 ధర రూ.2.40 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌)గా కంపెనీ నిర్ణయించింది.

* ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) సేవల్లో అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్‌ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్‌ సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వినియోగదారులు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా ముంబయి వాసులు ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. డౌన్‌డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. జియో సేవల్లో అంతరాయంపై 10వేల మందికిపైగా యూజర్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నో నెట్‌వర్క్, మొబైల్‌ ఇంటర్నెట్, జియో ఫైబర్‌ సేవల గురించి ప్రధానంగా ఫిర్యాదులు అందాయి. జియో సేవల్లో అంతరాయంపై ఆ కంపెనీ స్పందించింది. చిన్నపాటి సాంకేతిక లోపాల కారణంగా ముంబయి వాసులు సేవల్లో అంతరాయం ఎదుర్కొన్నట్లు తెలిపింది. సమస్యలు పరిష్కరించామని, సేవలు యథాతథంగా అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. సబ్‌స్క్రైబర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని విచారం వ్యక్తంచేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z