Politics

తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దు-NewsRoundup-Sep 17 2024

తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దు-NewsRoundup-Sep 17 2024

* ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది. వేలాది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య.. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద బడా గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

* తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దని వైకాపా అధ్యక్షుడు జగన్‌ను మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) హెచ్చరించారు. విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిగినట్టు ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

* మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని, క్యాబినెట్‌లో తమ నివేదికలను సమర్పిస్తామని మంత్రులు తెలిపారు. ఏపీలో నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.

* బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీ ఈ సారి ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. 2018-19, 2020-21 మధ్య ఆస్ట్రేలియా వేదికగా జరిగిన (BGT) సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. ఈసారి కూడా సిరీస్‌ను చేజిక్కించుకుని హ్యాట్రిక్‌ సాధించాలని టీమ్‌ఇండియా పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు నవంబర్ 22 – 26 మధ్య పెర్త్ వేదికగా జరగనుంది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్‌ల సిరీస్‌గా కొనసాగిన ఈ ట్రోఫీకి మరో టెస్టును చేర్చారు. 1991-92 తర్వాత భారత్‌, ఆసీస్‌ అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడటం ఇదే తొలిసారి. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) చరిత్రలోనే అత్యధిక వికెట్ల తీసి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా స్పిన్నర్‌ నాథన్‌ లైయన్ బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ గురించి మాట్లాడాడు. ఈ సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు.

* నీరు- చెట్టు పెండింగ్‌ నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నీరు- చెట్టు పెండింగ్‌ బిల్లులపై మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్‌ సీఎంను కలిశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు బిల్లుల విడుదలపై ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు దశల వారీగా నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖను సీఎం ఆదేశించారు. తొలి విడతలో రూ.259 కోట్లు విడుదల చేయాలని సూచించారు.

* కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amit Shah) విరుచుకుపడ్డారు. అగ్నివీర్‌ పథకంపై ఆయన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌ ఏ భాషలోనైనా అబద్ధాలు చెప్పగలరని వ్యంగ్యోక్తి విసిరారు. జమ్మూకశ్మీర్‌లో ఒకవేళ కాంగ్రెస్‌ కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ, ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లాలు ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తారని, పాకిస్థాన్‌తో చర్చలు జరపడమే వారి లక్ష్యమని ఆరోపణలు చేశారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోహారులో నిర్వహించిన తన తొలి ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్‌ షా ఈమేరకు ప్రసంగించారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు.. అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తో పాటు తమపై అక్రమ కేసు పెట్టారని సీఎం దృష్టికి తెచ్చారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని కోరారు. రాంసింగ్‌పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు తేవాలని కోరారు. సునీత విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలుసని.. విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు.

* దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయనతో పాటు ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ, ఇతర మంత్రులు సైతం ఉన్నారు. కేజ్రీవాల్‌ రాజీనామాను ఎల్జీ ఆమోదించాక.. త్వరలోనే ఆతిశీ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

* దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేశారు. ఈ సాయంత్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు. తనతో పాటు ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆతిశీ, ఇతర మంత్రులను తీసుకెళ్లారు.

* ఇప్పటికిప్పుడు ‘బుల్డోజర్‌ న్యాయం’ చేయడంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లను నడిపించే విషయంలో బాధితులకు ఉపశమనం ఇవ్వడం, దేశస్థాయిలో మార్గదర్శకాల తయారీపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది.

* అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామాతో.. తదుపరి సీఎంగా దిల్లీ మంత్రి ఆతిశీ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎన్నికైన అనంతరం ఆమె తొలి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘నాపై ఎంతో నమ్మకంతో ఆ బాధ్యతను అప్పగించారు. ఇలాంటి అవకాశం ఆప్‌లోనే సాధ్యం అవుతుంది’’ అని అన్నారు.

* దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాల వెనక ఏదైనా కుతంత్రాలు దాగి ఉంటే వెలికి తీస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. కుట్రలు ఎక్కువ రోజులు దాగి ఉండవని వ్యాఖ్యానించారు. 1.10 లక్షల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ పరిరక్షణకు ప్రభుత్వం అతి త్వరలోనే కీలక చర్యలు తీసుకొంటుందని వెల్లడించారు.

* అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్ర (Maharashtra Assembly elections) సిద్ధం అవుతోన్న తరుణంలో ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ (Ajit Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిపై మౌనం వీడారు. తనకు సీఎం కావాలని ఉందంటూ తన ఆసక్తిని బయటపెట్టారు.

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. దీని గురించి విపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. దేశాన్ని విభజించేవారు గణపతి పూజను అంగీకరించలేకపోతున్నారని ఆక్షేపించారు. ఒడిశాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.

* అమెరికాకు చెందిన 11 ఏళ్ల బాలుడు తన వద్ద ఉన్న ఆయుధాలను చూపుతూ ఓ వీడియో తీశాడు. అందులో తను హతమర్చాలనుకున్న రెండు వేర్వేరు పాఠశాలల్లోని కొందరు వ్యక్తుల పేర్లను రాసుకున్నట్లు తెలిపాడు. ఈ వీడియోతో తోటి విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇక, ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో పోలీసులకు తెలిసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ బాలుడిని అరెస్టు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z