* దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 పార్టీలు ప్రముఖ న్యాయమూర్తులు దీనిని సమర్థించారు. 18 రాజ్యాంగ సవరణలను ప్యానల్ సిఫార్సు చేసింది. అదేవిధంగా చంద్రయాన్- 4కు, గగన్‌యాన్, చంద్రయాన్ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’’ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని ప్యానల్ పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయతీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల వలస కార్మికులు పలుమార్లు ఓటేయడం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని..దీనివల్ల ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. దానిని నివారించాలంటే జమిలి ఎన్నికలే ఏకైక పరిష్కారమని పేర్కొంది. ప్రస్తుత ఎన్డీయే సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టంచేశారు. గతనెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదోఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనినుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
* ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని సీఎం విడుదల చేశారు. ‘‘విద్యార్థుల్లో స్కిల్ అప్‌గ్రెడేషన్ చేయడానికి కృషి చేస్తున్నాం. పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలను చెల్లిస్తాం’’ అని చెప్పారు.
* ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినేట్ సమావేశంలో చర్చించారు. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు. ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని.. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. రెండేళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు. వాలంటీర్లు, సచివాలయాలకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ.200 రద్దు చేశారు.
* భారత క్రికెట్ చరిత్రలో ఈ ఏడాది సెప్టెంబర్ 23 మరుపురాని జ్ఞాపకంగా మిగలనుంది. ఈనెల 19 నుంచి 23 వరకు బంగ్లాదేశ్-భారత్ మధ్య ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధిస్తే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా అవతరిస్తుంది.
* ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఏలూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. పోలీసుశాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పోలీసులు ధైర్యంగా పనిచేసేలా సంసిద్ధం చేస్తున్నామని చెప్పారు.
* పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీబీఐ చేపట్టిన ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. హత్యాచార ఘటనలో పోలీసుల తీరుపై దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను ఆలస్యంగా స్వాధీనం చేసుకోవడమే అందుకు కారణం.
* ఆప్ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇంటితో పాటు అన్నిరకాల సౌకర్యాలను వదులుకునేందుకు సిద్ధమయ్యారని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ (Sanjay Singh) వెల్లడించారు.
* రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల అప్పు.. రూ.లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ… గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసింది, కేంద్రం నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
* నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో అనుబంధం గురించి ఎదురైన ప్రశ్నపై అలీ (Ali) స్పందించారు. మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉందని పేర్కొన్నారు. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానన్నారు. ‘ఉత్సవం’ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. సినీ రంగంలోనే ఉంటారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మీరు సినిమా తీస్తానంటే చెప్పండి. రేపే వచ్చేస్తా’ అని అన్నారు. పవన్ కల్యాణ్- అలీ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. పవన్ నటించిన చాలా సినిమాల్లో అలీ సందడి చేశారు. అయితే, రాజకీయ పరిణామాలతో వీరిద్దరి మధ్య కొంత దూరం వచ్చిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పవన్‌తో అనుబంధం ఎలా కొనసాగతోందని అడగ్గా బాగుందని అలీ బదులిచ్చారు.
* జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించిన నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ “ఎక్స్” వేదికగా స్పందించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఈ విధానం ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు.
* సీఎం చంద్రబాబు దార్శనికుడు.. అను నిత్యం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ‘‘100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం. పింఛన్ పెంచేందుకు ఖజానాలో డబ్బులు లేవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచాం. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావు. నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం రూ.1,452 కోట్లు ఇచ్చారు. వైకాపా సర్పంచ్‌లు ఉన్న పంచాయతీలకు కూడా నిధులు ఇస్తాం. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు లాభం జరుగుతుంది. గత ప్రభుత్వానికి అన్న క్యాంటీన్లను ఎలా మూసివేయాలనిపించింది? ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎంకు కృతజ్ఞతలు. చంద్రబాబు ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. పాతికేళ్ల యువకుడు కూడా చంద్రబాబులా కష్టపడలేరు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే.. వైకాపా విమర్శలు చేస్తుంది. ఆయన చేసే మంచి పనులను గుర్తించి అండగా ఉంటాం’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
* పెళ్లిపై తన అభిప్రాయాన్ని మరోసారి బయటపెట్టారు బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut). తనకు పెళ్లిపై సదుద్దేశమే ఉందని చెప్పారు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని ఉందని చెప్పిన ఆమె.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. ‘‘ఎంపీగా పదవీకాలం ముగిసే నాటికైనా పెళ్లి చేసుకుంటారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘ఈ పదవిలో ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా. దేవుడి దయ వల్ల అదే జరుగుతుందని భావిస్తున్నా. ఈ పదవీకాలం ముగిసిన తర్వాత పెళ్లి చేసుకుని ఏం లాభం’’ అని ఆమె బదులిచ్చారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి కంగన ఎంపీగా విజయాన్ని అందుకున్నారు. 2029 వరకూ ఆమె ఆ పదవిలో కొనసాగనున్నారు. కంగన పెళ్లి గురించి మాట్లాడటం ఇది తొలిసారి కాదు. గతంలో ఓసారి ఇదే విషయంపై ఆమె మాట్లాడారు. ‘‘ప్రతీ అమ్మాయి తన పెళ్లి, కుటుంబం గురించి కలలు కంటుంది. నేను కుటుంబవ్యవస్థను ఎంతో గౌరవిస్తాను. పెళ్లి చేసుకొని నాకంటూ ఓ కుటుంబం ఉండాలని కోరుకుంటాను. అది కూడా పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమైతే బాగుంటుంది’’ అని చెప్పారు. నెగిటివ్ పబ్లిసిటీ కారణంగానే తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టాలంటే భయపడుతున్నానని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z