Business

స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు-BusinessNews-Sep 18 2024

స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు-BusinessNews-Sep 18 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకొనేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశమైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తం కావడంతో సూచీలు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పెట్టుబడులు పెరగడంతో సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. అయితే మధ్యాహ్నం నుంచి ఐటీ, ఎనర్జీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ ఉదయం 83,037.13 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,700.63) స్వల్ప లాభంతో ప్రారంభమైంది. కాసేపట్లోనే సూచీలు రాణించడంతో సరికొత్త గరిష్ఠాలను తాకింది. గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణతో చివరకు నష్టాల్లో ముగిసింది. ఇంట్రాడేలో 83,326.38 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. చివరికి 131.43 పాయింట్ల నష్టంతో 82,948.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 25,482.20 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 41 పాయింట్లు కోల్పోయి 25,377.55 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌-30లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, టాటాస్టీల్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, రిలయన్స్‌, మారుతీ సుజుకీ, ఎన్‌టీపీసీ, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి. బజాజ్‌ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.66 డాలర్లు, బంగారం ఔన్సు ధర 2,598.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం రూ.10 వేల కోట్ల రుణం పొందడానికి..ప్రభుత్వ యాజమాన్యలోని REC(రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌) లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సన్‌షూర్‌ ఎనర్జీ ఈ రోజు(బుధవారం) తెలిపింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మినిస్ట్రీ ఆఫ్‌ న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ(MNRE) నిర్వహించిన 4వ గ్లోబల్‌ రీ-ఇన్వెస్ట్‌ మీట్‌ & ఎక్స్‌పో సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత్‌లో 3 గిగావాట్ల సౌర, పవన, హైబ్రిడ్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ ఒప్పందంపై సన్‌షూర్‌ ఎనర్జీ డైరెక్టర్‌ & సీఈఓ శంతను ఫౌగాత్‌, ఆర్‌ఈసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(రెన్యూవబుల్‌ ఎనర్జీ & బిజినెస్‌ డెవలప్‌మెంట్‌) సౌరభ్‌ రస్తోగి సంతకం చేశారు. ఈ భాగస్వామ్యంతో సన్‌షూర్‌ ఎనర్జీకి..సోలార్‌, పవన, హైబ్రిడ్‌ ప్రాజెక్ట్‌లతో భారత్‌ అంతటా గణనీయంగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది.

* అనిల్ అంబానీ (Anil Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ స్టాండలోన్‌ రుణాల (standalone external debt)ను భారీగా తగ్గించుకుంది. మొత్తం రుణాలను రూ.3,831 కోట్ల నుంచి రూ.475 కోట్లకు తగ్గించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో కంపెనీ షేర్లు రాణిస్తున్నాయి. ఉదయం 10:15 గంటల సమయంలో షేరు బీఎస్‌ఈలో 7శాతం పెరిగి రూ.252.15 వద్ద గరిష్ఠాన్ని తాకింది. బకాయిలు తగ్గించుకున్న తర్వాత రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీ నికర విలువ రూ.9,041 కోట్లుగా ఉందని కంపెనీ తన ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో తెలిపింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ఎడెల్‌వీస్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌తో పాటు ఇతర రుణదాతల బకాయిలు క్లియర్ చేసినట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా స్పష్టంచేసింది. దీంతో తన స్టాండలోన్‌ మొత్తం రుణాలు 87శాతం తగ్గి రూ.475 కోట్లకు చేరాయి.

* అమెజాన్‌ ఇండియా అధిపతిగా సమీర్‌కుమార్‌ (Samir Kumar) నియమితులయ్యారు. ఈవిషయాన్ని ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ బుధవారం ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. మనీశ్‌ తివారీ (Manish Tiwary) రాజీనామా అనంతరం ఆ స్థానంలో సమీర్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారని వెల్లడించింది. సమీర్‌కుమార్‌ 1999లో అమెజాన్‌లో చేరారు. 2013లో Amazon.in ను తీసుకొచ్చిన బృంద సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. ‘‘అమెజాన్‌ వ్యాపార విభాగంలో భారత్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. భారత్‌లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆసక్తిగా ఉన్నాం. Amazon.in తీసుకురావడంలో సమీర్‌కుమార్‌ కీలకపాత్ర పోషించారు’’ అని అమెజాన్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ అన్నారు. అమెజాన్‌ ఇండియా అధిపతిగా ఉన్న మనీశ్‌ తివారీ (Manish Tiwary) ఆగస్టు 6న తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీకి వెలుపల ఇతరత్రా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తివారీ రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో తాజాగా సమీర్‌ కుమార్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z