Business

అమెరికా రేట్ల కోత…పరుగులు పెట్టిన భారత మార్కెట్-BusinessNews-Sep 19 2024

అమెరికా రేట్ల కోత…పరుగులు పెట్టిన భారత మార్కెట్-BusinessNews-Sep 19 2024

* భారత్‌..వచ్చే ఐదేళ్లలో తన లాజిస్టిక్‌(రవాణా) ఖర్చులను సింగిల్‌ డిజిట్‌ శాతానికి తగ్గించుకోనుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం తెలిపారు. ‘డెలాయిట్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌’లో గడ్కరీ మాట్లాడుతూ, రవాణా వ్యయాలు తగ్గించడానికి ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. రవాణా ఖర్చుల తగ్గింపు, భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని పెంపొందించే విషయంలో కీలకమైనదిగా నిపుణులు పరిగణిస్తున్నారు. ఇంకా, భారతదేశ ఆటోమొబైల్‌ పరిశ్రమను ప్రపంచంలోనే అతిపెద్దదిగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని గడ్కరీ తెలిపారు. భారత్‌ ఇటీవల జపాన్‌ను అధిగమించి అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా అవతరించింది. ఆటోమొబైల్‌ పరిశ్రమ విలువ 2014లో రూ.7.50 లక్షల కోట్ల నుంచి 2024 నాటికి రూ.22 లక్షల కోట్లకు పెరిగింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన మన మార్కెట్లు.. రోజంతా లాభాల్లో కొనసాగాయి. ఈ క్రమంలోనే రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ షేర్లు ప్రధానంగా రాణించాయి. సెన్సెక్స్‌ ఉదయం 83,359.17 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 83,773.61 వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సూచీ.. 236.57 పాయింట్ల లాభంతో 83,184.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 38.25 పాయింట్ల లాభంతో 25,415.80 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్టీపీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టైటాన్‌, నెస్లే ఇండియా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 74.39 డాలర్లు వద్ద.. బంగారం ఔన్సు 2615 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* పని ఒత్తిడి కారణంగా యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియాలో (Ernst and Young India) పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. జులైలో ప్రాణాలు కోల్పోయిన అన్నా సెబాస్టియన్‌ పెరియాళి ఉదంతంపై విచారణ జరిపిస్తామని పేర్కొంది. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయిస్తామని కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి శోభా కర్లాంద్లజె పేర్కొన్నారు. అన్నా సెబాస్టియన్‌ మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో పనిచేస్తున్న కోచికి చెందిన అన్నా సెబాస్టియన్‌ ఈ ఏడాది జులై 20న మరణించారు. పుణెలోని సంస్థ కార్యాలయంలో విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికే మరణించారు. పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్‌ తల్లి అనితా తాజాగా ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాశారు. తల్లి లేఖతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై భాజపా నేత, కేంద్ర మాజీమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ స్పందించారు. ఉద్యోగి తల్లి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై శోభ స్పందించారు.

* కుండపోత వర్షాలు, వరదలతో విలవిల్లాడిన ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసేందుకు అదానీ గ్రూప్‌ ముందుకొచ్చింది. అదానీ ఫౌండేషన్‌ రూ. 25 కోట్లు సాయం ప్రకటించింది. ఈ మేరకు గౌతమ్‌ అదానీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. అపార నష్టం చవిచూసిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధిత పత్రాలను అదానీ పోర్ట్స్‌ ఎండీ కరణ్‌ అదానీ అందజేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z