NRI-NRT

స్వర్ణోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు – TNIతో అధ్యక్షుడు లాం కృష్ణ ముఖాముఖి

స్వర్ణోత్సవాలకు శరవేగంగా ఏర్పాట్లు – TNIతో అధ్యక్షుడు లాం కృష్ణ ముఖాముఖి

అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన, 1974 నుండి ఆ దేశ రాజధాని వాషింగ్టన్ డీసీతో పాటు పరిసర రాష్ట్రాలైన వర్జీనియా, మేరీల్యాండ్ ప్రవాసులకు తెలుగు సంస్కృతి, కళ, సాహితీ, సాంప్రదాయాల వారధిగా భాసిల్లుతున్న బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangham – GWTCS) స్వర్ణోత్సవాల ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు లాం కృష్ణ TNIకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో పేర్కొన్నారు.

సంస్థ ఏర్పడి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ భారీ వేడుకలను సమన్వయం చేసే అవకాశం తనకు, తన కార్యవర్గ సభ్యులకు, సంస్థ సభ్యులకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని కృష్ణ వెల్లడించారు. ఎందరో ప్రవాస ప్రముఖులు ఈ సంస్థను పలు విధాలుగా బలోపేతం చేశారని, స్థానికంగా పెరుగుతున్న తెలుగువారి సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సంస్థను మరింత మందికి చేరువ చేసేందుకు తన హయాంలో కృషి చేశానని ఆయన తెలిపారు.

12 బృందాల్లో 180 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు ఈ స్వర్ణోత్సవాల కోసం తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని వచ్చే శుక్రవారం (27వ తేదీ) బ్యాంక్వెట్‌తో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు సేవా పురస్కారాలతో పాటు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించనున్నట్లు కృష్ణ వెల్లడించారు. శనివారం నాడు (28వ తేదీ) ఉదయం 8గంటలకు శ్రీనివాస కళ్యాణంతో వేడుక ప్రారంభమవుతుందని, అనంతరం స్థానిక చిన్నారులు తమ ప్రతిభా ప్రదర్శనలతో అతిథులను అలరిస్తారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు అయ్యన్నపాత్రుడు, గౌరు చరితా రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, వంగలపూడి అనిత, నటులు శర్వానంద్, అలీ, అంజలి, అడివి సేష్, సత్య, సత్యం రాజేష్, దర్శకులు సందీప్ రెడ్డి, కొరటాల శివ, సంగీత దర్శకుడు మణిశర్మ, కవి జొన్నవిత్తుల, రంగస్థల నటులు గుమ్మడి గోపాల్కృష్ణలు పాల్గొంటున్నారని తెలిపారు. తెలుగు బాల వైభవం పేరిట స్థానిక చిన్నారులకు వ్యాస రచన పోటీలు నిర్వహించామని వీటిని జొన్నవిత్తుల ఆధ్వర్యంలో నిర్వహించే సాహితీ సమావేశంలో విశ్లేషిస్తామని అన్నారు. యోగా, వాణిజ్య, వ్యాపార, సినీ, సంగీత, సాహిత్య, నాటక, అవధాన కార్యక్రమాలు ఈ వేడుకల్లో ఏర్పాటు చేశామని కృష్ణ తెలిపారు.

ఇప్పటికీ పలు క్రీడా పోటీలు, టెస్లా కార్ల డ్యాన్స్ షో వంటి వినూత్న ప్రయత్నాల ద్వారా GWTCS స్వర్ణోత్సవాలకు ప్రచారాన్ని కల్పించామన్న కృష్ణ, మరిన్ని వివరాలకు https://www.gwtcs50.org/ సందర్శించాలని, కుటుంబసమేతంగా అమెరికావ్యాప్తంగా ఉన్న ప్రవాసులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z