NRI-NRT

అమెరికా పర్యటనకు భట్టి-NewsRoundup-Sep 21 2024

అమెరికా పర్యటనకు భట్టి-NewsRoundup-Sep 21 2024

* తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ (tirupati laddu) ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని వార్తలు తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయానని సీనియర్‌ నటుడు మోహన్‌బాబు (Mohan babu) అన్నారు. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపమని, ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

* తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: చంద్రబాబు
తిరుమల పవిత్రతకు పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మీడియాతో చిట్‌చాట్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

* శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

* త్రివిధ దళాల్లో ఒకటైన వాయుసేనకు తదుపరి అధిపతిగా ఎయిర్‌ మార్షల్ అమర్‌ప్రీత్‌ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వాయు సేనకు వైస్‌ చీఫ్‌గా కొనసాగుతున్నారు. వాయుసేన అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమర్‌ప్రీత్‌ సింగ్ సెప్టెంబరు 30న వాయు దళ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

* లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని భాజపా నేతలు రాహుల్‌ గాంధీపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని హై గ్రౌండ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

* జమ్మూకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈసందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూలో మూడు కుటుంబాల (గాంధీ, ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా కుటుంబం) హింసను ప్రేరేపించాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

* ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అమెరికా (USA) పర్యటన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అధికారికంగా ఎన్నోసార్లు యూఎస్ వెళ్లిన ఆయన.. 1993లో తొలిసారి ఆ దేశంలో పర్యటించారు. ఆనాటి సంగతులను పలువురు ప్రవాస భారతీయులు మీడియాతో పంచుకున్నారు.

* కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలు హత్యాచారానికి (Kolkara Doctor Murder Case)గురైన ఆర్జీకర్‌ మెడికల్‌ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే కళాశాల ఆర్థిక అవకతవకలపై సీబీఐ చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

* ఈ ఏడాది ఆరంభంలో సంభవించిన భారీ భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జపాన్‌ (Japan)పై మరోసారి ప్రకృతి ప్రకోపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడటంతో పాటు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా వరదల (Floods) ముప్పు పొంచి ఉందని వాతావరణకేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

* అమెరికాలో శాశ్వత నివాసం పొందుతున్న గ్రీన్‌కార్డుదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డుల (Green Card) వ్యాలిడిటీ కాలాన్ని మరింత పొడిగించింది. గతంలో గ్రీన్‌కార్డు గడువు తీరినప్పటికీ .. మరో 24 నెలల పాటు దాని వ్యాలిడిటీ పొడిగించేవారు. ఇప్పుడు దీన్ని 36 నెలలకు పెంచినట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) వెల్లడించింది.

* దిల్లీ (Delhi)కి నూతన ముఖ్యమంత్రి వచ్చారు. సీఎంగా ఆతిశీ (Atishi) ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదించగా.. ఆప్‌ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అంగీకరించడంతో.. తాజాగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఆమెతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్‌ అహ్లావత్‌, గోపాల్‌ రాయ్‌, ఇమ్రాన్ హుస్సేన్‌, కైలాశ్‌ గహ్లోత్, సౌరభ్‌ భరద్వాజ్ కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముందు వారంతా కేజ్రీవాల్‌ను కలిశారు.

* నటి ప్రీతి జింగ్యానీ భర్త, బాలీవుడ్‌ నటుడు పర్విన్ దాబాస్‌కు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆయన కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన టీమ్‌ తెలిపింది.

* ట్రాపిక్‌ నిబంధనలను ఉల్లంఘించి తప్పుడు మార్గాల్లో వాహనాలు ప్రయాణించడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు మహారాష్ట్రలోని థానే (Thane)పురపాలక సంఘం ఆలోచన చేసింది. రోడ్లపై టైర్‌ కిల్లర్స్‌ (Tyre killers)ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చర్య వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్‌ నిబంధనల పరిరక్షణకు సహకరిస్తుందని స్థానిక అధికారులు వెల్లడించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు లేదా రాంగ్‌ రూట్‌లో వాహనాలు నడుస్తున్న చోట్ల రోడ్లపై వీటిని బిగించనుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే ధమని ఘోడ్‌బందర్ రోడ్‌లో వీటిని ఏర్పాటు చేయనుంది. టైర్‌ కిల్లర్లు ఉన్నట్లు 100 మీటర్ల నుంచి 200 మీటర్లు ముందుగానే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఏ ఏ ప్రాంతాల్లో బిగించారనే సమాచారం పౌరులకు అందుబాటులో ఉంచుతారు. రాంగ్‌ రూట్‌లో వస్తున్న వాహనాల టైర్స్‌ను కిల్‌ చేయడం వల్ల ప్రమాదాలను కొంతవరకైన తగ్గించొచ్చనే ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

* అమెరికాలో అధ్యక్ష పోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. డెమొక్రటిక్‌ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌; రిపబ్లికన్‌ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌-ఎన్‌వోఆర్‌సీ సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ రీసెర్చ్‌’ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఇద్దరు అభ్యర్థులూ దాదాపు ఒకే స్థాయిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారని, ఎవ్వరికీ స్పష్టమైన ఆధిక్యం లేదని అందులో తేలడం గమనార్హం. ఆర్థికం సహా పలు కీలక రంగాలను సమర్థంగా నిర్వహించే విషయంలో ఓటర్లు ఇరువురికీ ఒకే రకమైన మార్కులు వేశారు. ఇటీవలి వరకూ ముందంజలో ఉన్నట్లు కనిపించిన ట్రంప్‌నకు ఓ రకంగా ఇది హెచ్చరిక లాంటిదని సర్వే నివేదిక పేర్కొంది.

* తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం అమెరికా, జపాన్ దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లింది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఆధునిక పద్ధతులు, లోతైన అధ్యయనంతోపాటు పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం ఈ రోజు హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరింది. ఈనెల 21 నుంచి అక్టోబర్ 4 వరకు పర్యటన కొనసాగనుంది. మైనింగ్, గ్రీన్ పవర్ విభాగాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎక్స్-పోతోపాటు, ప్రముఖ కంపెనీల ప్రధాన కార్యాలయాల సందర్శన, పెట్టుబడిదారులతో డిప్యూటీ సీఎం సమావేశం కానున్నారు. ఈనెల 24,25 తేదీల్లో అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరగనున్న అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొంటారు. అక్కడ వివిధ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఈనెల 26న లాస్‌ ఏంజెల్స్‌కు చేరుకుంటారు. ఈనెల 27న ఎడ్ వార్డ్స్, సన్ బోర్న్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ విధానాన్ని పరిశీలిస్తారు. ఈనెల 28వ తేదీన పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. ఈ నెల 29న టోక్యోకి చేరుకుంటారు. ఈనెల 30న స్థానిక పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న పెట్టుబడిదారులతో వ్యక్తిగతంగా (వన్ టు వన్) సమావేశమవుతారు. యామాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శిస్తారు. అక్టోబర్ 2న తోషిబా, కవాసాకి, అక్టోబర్ 3న పానసోనిక్ ప్రధాన కార్యాలయాలను సందర్శిస్తారు, అక్టోబర్ 4న హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తదితరులు వెళ్లారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z