* ప్రాణాంతక మంకీపాక్స్ (Monkeypox)కు సంబంధించి భారత్‌లో మరో కేసు నమోదైంది. ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ రకంగా దీన్ని గుర్తించారు. కేరళకు చెందిన యువకుడిలో గతవారం ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి ఇటీవల వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లేడ్ 1గా నిర్ధరణ అయ్యింది. ప్రపంచ ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ రకంగా దీన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
* గత 50 ఏళ్లుగా తనతో స్నేహం కొనసాగించిన ఏడుగురు స్నేహితులు 70వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారిని సన్మానించారు. 1972, 1973 సంవత్సరాల్లో ఏర్పడిన స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ‘సప్తతి’ పేరుతో వెంకయ్యనాయుడు దంపతులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇందులో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, అట్లూరి అశోక్, తుమ్మల రంగారావు, వీరమాచినేని రంగప్రసాద్, తిపురనేని జేజీ ప్రసాద్, బిక్కిన లక్ష్మణరావు, సూర్యదేవర జోగేంద్రదేవ్ ఉన్నారు. అందరూ తమ మధ్య ఉన్న అనుబంధాలను పంచుకొన్నారు. ఈ కార్యక్రమానికి అనుకోని అతిథిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. రాడిసన్‌బ్లూ హోటల్‌లో బసచేసేందుకు వెళ్లిన ఆయన.. వెంకయ్యనాయుడు అక్కడే ఉన్నారని తెలుసుకొని ఆయన వద్దకు వెళ్లారు. స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వెంకయ్యనాయుడుని కలిసి అభినందించి వెళ్లారు.
* హైదారాబాద్ మహా నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, కోఠి, చాంద్రయణగుట్ట, మాదాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి.. ఆ మొత్తాన్ని సోనియా గాంధీ (Sonia Gandhi)కి సమరిస్తున్నాయని భాజపా ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. కంగనా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని.. లేదంటే నిరాధార ఆరోపణలు చేసినందుకు సోనియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ‘‘కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఆమెకు పెద్దగా జ్ఞానం లేదని ఆమె వ్యాఖ్యల్లోనే తెలుస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి, ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పిస్తున్నాయని చెప్పడం కంటే తెలివితక్కువ ప్రకటన మరొకటి ఉండదు. కనీసం ఒక్క రూపాయి దారి మళ్లించినట్లు నిరూపించాలి. లేదా ఇటువంటి నిరాధారమైన, అనవసరమైన ఆరోపణలు చేసినందుకు సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలి. లేదంటే కంగనాపై పరువునష్టం దావా వేస్తాం’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ సవాల్ విసిరారు. ‘ఎమర్జెన్సీ’ సినిమాకు సెన్సార్ బోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో బాధలో ఉన్న ఆమె.. ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
* దిల్లీలో రెండేళ్ల క్రితం జరిగిన శ్రద్ధా వాకర్ హత్యోదంతం తరహాలో ఇటీవల బెంగళూరు (Bengaluru)లో వెలుగుచూసిన దారుణం అక్కడి ప్రజల్ని వణికిస్తోంది. మహాలక్ష్మి (29) అనే మహిళను చంపి.. 30కి పైగా ముక్కలుగా కోసి, ఇంట్లో ఫ్రిజ్‌లో కుక్కిన కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానితుడు బెంగాల్‌కు చెందినవాడని.. అతడు అక్కడే ఉన్నట్లు భావిస్తున్నట్లు కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర్ వెల్లడించారు. అతడిని త్వరగా అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినైనా కస్టడీలోకి తీసుకున్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. కొందరు అనుమానితులను మాత్రం పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
* న్యూయార్క్‌లోని నస్సావ్ వెటరన్స్ కొలస్సియంలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఎదుట ప్రదర్శన ఇవ్వడంపై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devisri Prasad) స్పందించారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన ఆయన తన ఆనందాన్ని తెలియజేశారు. ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని తెలిపారు.
* తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను సేకరించిన కేంద్రం.. నాణ్యత పరీక్షలో ఒక కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు వెల్లడించింది.
* న్యాయస్థానం, దేవుడి కోర్టులో శిక్షలకు వైకాపా అధినేత జగన్ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. జగన్ పాపం పండిందని విమర్శించారు. తిరుమల శ్రీవారి విషయంలో చేయకూడని పనులన్నీ చేశారని మండిపడ్డారు. ఇప్పటికే ప్రజా కోర్టులో శిక్ష పడిందన్నారు. అధికారం అండగా ఉందనే అహంకారంతో జగన్ కమీషన్ల కక్కుర్తితో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కల్తీ పనులు చేశారని దుయ్యబట్టారు. అడ్డంగా దొరికిపోయేసరికి జగన్ తన ఫేక్ ముఠాలను దించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ధ్వజమెత్తారు. జంతువుల కొవ్వు కలిపిన నాలుగు ఏఆర్ డెయిరీ నెయ్యి లారీలను తితిదే తిప్పి పంపిందన్నారు. నివేదిక ఈ విషయం స్పష్టం చేసిందని.. సీఎం, ఈవో కూడా అదే చెప్పారన్నారు.
* అమృత్ పథకం టెండర్ల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ధ్వజమెత్తారు. సృజన్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సతీమణికి సొంత తమ్ముడు కాదని, బాబాయ్ కొడుకు అవుతాడని, ఈ విషయంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆన్‌లైన్‌లో టెండర్లు వేసిన అమృత్ పథకంలో ఆయన.. తన కంపెనీకి జాయింట్ వెంచర్‌లో కాంట్రాక్టు పొందారని, అక్కడ అక్రమాలకు తావులేదని మల్లు రవి తెలిపారు. భాజపా ప్రభుత్వం ఉన్న కేంద్రంలో టెండర్లలో సీఎంకు ఎలాంటి సంబంధం లేదనే విషయం ఆలోచించకుండా కేటీఆర్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
* బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని అడగాల్సిన విషయాలపై ప్రధానికి లేఖ రాస్తే ఉపయోగమేంటని వైకాపా అధ్యక్షుడు జగన్‌ను వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. సుబ్బారెడ్డికి స్వామి పట్ల ఎంత భక్తి ఉందో సేవల ధరల పెంపుతో దేశం మొత్తం చూసిందని ఎద్దేవా చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి ఎంతటి స్వామి భక్తుడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వైకాపా హయాంలో తితిదేలో దొంగల ముఠాను పెట్టి లడ్డూల నుంచి అన్నప్రసాదాల వరకు దోపిడీ చేశారని మండిపడ్డారు.
* ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ సమీక్షలో.. 2024-25 వానా కాలం మార్కెటింగ్ సీజన్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గింజా కొనుగోలు చేస్తుందన్నారు. అందుకు 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బదిలీలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు తన పేషీ అధికారులతో సమీక్షించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓ, డీఎల్‌డీఓ బదిలీల ప్రక్రియలో మాతృశాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇచ్చామన్నారు. బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు, నిబంధనలు పాటించడంతో ఇప్పటి వరకూ ప్రాధాన్యత లేని స్థానాల్లో ఉన్నవారికి ఇప్పుడు సరైన పోస్టింగ్ లభించినట్లు పవన్ తెలిపారు. దీనికోసం పారదర్శకంగా కసరత్తు చేసిన ఉన్నతాధికారులను అభినందించారు. అదే విధంగా బదిలీల ప్రక్రియపై వచ్చిన స్పందన, వార్తా కథనాలను అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
* తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. ‘‘మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం. అపచారం. ఆలయంలో అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డు విషయంలో కళంకితమైనది అని కలుషిత రాజకీయ మనష్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను గాని తప్పు చేసి ఉంటే.. నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోవాలి. నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతాము. నేను ఏ ఒక్క రాజకీయ మాట మాట్లాడలేదు. గోవిందా..గోవిందా’’…అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణానికి ముందు శ్రీవారి పవిత్ర పుష్కరిణీలో స్నానం చేసి, శ్రీవారి ఆలయం మహా ద్వారం వద్ద స్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అఖిలాండం కర్పూర హారతి వెలిగించి భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ప్రమాణ సమయంలో భూమన వెంట ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి ఉన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పదవీ కాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని నిరూపించుకునేందుకు భూమన సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం ముందు భూమన ప్రమాణం చేశారు.
* తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్‌రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.సెక్యులరిజంఅనే భావన యూరప్‌లో ఉందని, అది భారత దేశానికి సంబంధంలేనిదన్నారు. సోమవారం(సెప్టెంబర్23) ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్.ఎన్ రవి ఈ మేరకు వ్యాఖ్యానించారు. చర్చికి,రాజుకు మధ్య గొడవ జరిగి వారిద్దరూ దానిని ఆపేయాలనుకోవడం నుంచి యూరప్‌లో సెక్యులరిజం పుట్టిందన్నారు.ఇక భారత్‌లోకి సెక్యులరిజాన్ని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బుజ్జగింపు రాజకీయాల కోసం తీసుకువచ్చారని ఆరోపించారు.తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి తీవ్రస్థాయిలో విభేదాలున్న విషయం తెలిసిందే. తమిళనాడు ప్రజలకు రాముడంటే తెలియదని రవి ఇటీవలే వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు.
* శ్రీవారి లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ వచ్చే శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాశం రానుంది. ఈ తరుణంలో తిరుమల లడ్డుపై రాజకీయం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి గతంలో లేనిపోని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఈ కేసులో దోషులెవరో తేలాలి. ఈ కేసును తేల్చాల్సింది న్యాయస్థానంలోనే. చంద్రబాబు నియమించిన సిట్‌తో కాదు. శ్రీవారి భక్తులెవరూ చంద్రబాబు మాటలను నమ్మొద్దు. ఈ అంశంపై సుప్రీంకోర్టు త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. తన రాజకీయ స్వార్థం కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం చంద్రబాబు చేస్తున్న మహా పాపం. శ్రీవారిపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఓటమి తప్పదు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు. కల్తీ జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ తేలుస్తుంది’ అని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు.
* రుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం(Mankameshwar temple) కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి తీసుకువచ్చే ప్రసాదాలపై నిషేధం విధిస్తూ ఆ ఆలయం నిర్ణయం తీసుకున్నది. కేవలం ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలను కానీ, పండ్లను మాత్రమే ఆలయంలో నైవేద్యంగా సమర్పించాలని మంకామేశ్వర్ ఆలయ మహంతి దేవ్య గిరి తెలిపారు. తిరుపతిలో కలుషిత ప్రసాదాన్ని సరఫరా చేయడం క్షమించరాని నేరమని మహంతి పేర్కొన్నారు.
* కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, ఆ పార్టీ దళిత నాయకురాలు కుమారి షెల్జాను అవమానించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దుయ్యబట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించారు. దళిత నేతలను అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో ‘దేశం అభివృద్ధి జరిగిన తర్వాత రిజర్వేషన్‌లు అవసరం లేదు. వాటిని తొలగిస్తాం’ అని అన్నారని, రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆయన మాటలే చెబుతున్నాయని షా అన్నారు. కేవలం మోదీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన రిజర్వేషన్లను కాపాడగలరని అమిత్ షా చెప్పుకొచ్చారు. జమ్మూకాశ్మీర్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని, ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తామని చెప్పారని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z