Business

భారత్ ఆర్థికవృద్ధి బాగుంటుంది-BusinessNews-Sep 23 2024

భారత్ ఆర్థికవృద్ధి బాగుంటుంది-BusinessNews-Sep 23 2024

* వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. తాజాగా ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం కొత్తగా సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకరాబోతున్నది. దాంతో యూజర్లకు మరింత భద్రత పెరగనున్నది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకువస్తుంది. అదే సమయంలోనూ భద్రతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వాస్తవానికి మనకు తెలిసిన వారితో పాటు తెలియనివారి నుంచి సైతం సందేశాలు వస్తుంటాయి. అయితే, తెలియనివారి అకౌంట్స్‌ని బ్లాక్‌ చేసేలా వాట్సాప్‌ ఫీచర్‌ని తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ‘బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్‌నౌన్‌ అకౌంట్స్’ అనే ఆప్షన్‌తో రానున్నది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ని ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.20.16 వెర్షన్‌లో అందులోకి తెచ్చింది. త్వరలోనే వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను మిగతా అన్ని వెర్షన్లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ సెట్టింగ్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్‌ సెట్టింగ్‌ ట్యాబ్‌లో కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేయడానికి పక్కనే కనిపించే టోగుల్‌ని ఆన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ ఐపీ ప్రొటెక్షన్‌ ఫీచర్‌పై కనిపిస్తుంది. దీన్ని ఆన్‌ చేసుకున్న తర్వాత.. తెలియనివారి నుంచి వచ్చే మెసేజెస్‌ ఆటోమెటిక్‌గా బ్లాక్‌ అవుతాయి. ప్రస్తుతం బీటా యూజర్లు సైతం ఈ ఫీచర్‌ని వాడుకునేందుకు అవకాశం ఉంది. మీరు బీటా యూజర్లు అయితే, మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ప్రైవసీ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అడ్వాన్స్‌డ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఐపీ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ ఆన్‌ చేస్తే తెలియని అకౌంట్స్‌ని నుంచి వచ్చే సందేశాలను బ్లాక్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌ స్పామ్‌, స్కామ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ఫీచర్‌ని తీసుకువస్తున్నది.

* కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్‌ నోటీసులు పంపింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్‌కు పంపింది. ఇందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో నోటీసులు చేసింది. అయితే, తమిళనాడులో ఏఆర్‌ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

* దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ (Samsung) తన శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ (Samsung Galaxy M55s 5G) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతోపాటు స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ సెట్ తో వస్తోంది. 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటుంది. డ్యుయల్ టెక్చర్ ఫినిష్ కోసం రేర్ ప్యానెల్ మీద ఫుషన్ డిజైన్ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ (Samsung Galaxy M55s 5G) ఫోన్ రూ.19,999లకు లభిస్తుంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్, సెలెక్టెడ్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ నెల 26 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ (Samsung Galaxy M55s 5G) ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఒకేసారి బ్యాక్, ఫ్రంట్ కెమెరాలతో ఫోటోలు, వీడియోల రికార్డింగ్ చేయొచ్చు. 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటది.

* టైగన్ అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అరుదైన మైలురాయిని చేరుకుంది. మూడేళ్ళ క్రితం భారతీయ విఫణిలో అడుగెట్టిన ఈ కారు ఏకంగా 100000 యూనిట్ల సేల్స్ పొందగలిగింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్ (SIAM) గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో మాత్రమే 67140 మంది ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 32742 కార్లను కంపెనీ ఎగుమతి చేసింది.ఆగష్టు చివరి నాటికి టైగన్ అమ్మకాలు మొత్తం 99882 యూనిట్లు మాత్రమే. అయితే సెప్టెంబర్ నెల ప్రారంభంలో అమ్ముడైన కార్లను కలుపుకుంటే లక్ష యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ వెల్లడించింది.2023 ఆర్ధిక సంవత్సరంలో టైగన్ కారు ఎక్కువగా అమ్ముడైనట్లు (21,736 యూనిట్లు) తెలుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 20,485 యూనిట్ల టైగన్ కార్లను కొనుగోలుదారులు కొనుగోలు చేశారు. ఎగుమతుల విషయానికి వస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో 12,621యూనిట్లు ఎగుమతయ్యాయి.

* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం వృద్ధి సాధిస్తుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈఓ ‘రోమల్ శెట్టి’ (Romal Shetty) అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం సహేతుకంగా నియంత్రణలో ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్దితో ఇది మరింత ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వాహన విక్రయాలు మెరుగుపడుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి 7 నుంచి 7.1 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయ పరిణామాలు, ఉక్రెయిన్‌లో ఏర్పడ్డ సంక్షోభం వంటివి చాలా దేశాల జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే, ఇప్పటికే భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని శెట్టి పేర్కొన్నారు.డెలాయిట్ అంచనాల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత్ వృద్ధి 6.7 శాతంగా ఉండవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. మోదీ 3.0 ప్రభుత్వం ఇదే వేగంతో కొనసాగాలని తాను ఆశిస్తున్నానని, ప్రభుత్వ శాఖలలో పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తవ్వాలని రోమల్ అన్నారు.

* సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 384.30 పాయింట్ల లాభంతో 84,928.61 వద్ద, నిఫ్టీ 148.00 పాయింట్ల లాభంతో 25939.00 వద్ద నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), హీరో మోటోకార్ప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీ నష్టాలను చవి చూశాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z