ScienceAndTech

చైనా డ్యామ్ కారణంగా ఆలస్యమవుతున్న భూభ్రమణం

చైనా డ్యామ్ కారణంగా ఆలస్యమవుతున్న భూభ్రమణం

ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీగోర్జెస్‌ డ్యామ్‌ (Three Gorges Dam) వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల భూ గమనంలో మార్పులు సంభవిస్తున్నాయని, ఇది శ్రేయస్కరం కాదని హెచ్చరిస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను నిర్మించారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. దీని ప్రభావం ప్రస్తుతం ఇంకా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావం భూ గమనంపై పడుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతోంది. 2004లో హిందూ మహా సముద్రంలో భూ కంపం సంభవించి సునామీ వచ్చినప్పుడు భూ గమనంలో మార్పు స్పష్టంగా కనిపించింది. దీని ప్రభావంతో రోజు నిడివి సుమారు 2.68 మైక్రోసెకెన్లు తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితి త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ వల్ల కూడా కలుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

త్రీగోర్జెస్‌ డ్యామ్‌కు మూడు నదుల నుంచి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్‌ గ్యాలన్ల నీరు డ్యామ్‌లో నిల్వ ఉంటోంది. అంతభారీ మొత్తంలో ఒకేచోట నీరు చేరడం భూమిపై ప్రభావం చూపిస్తోంది. అంతరిక్షం నుంచి సాధారణ కంటికి కనిపించే అతితక్కువ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. ఈ డ్యామ్‌లో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు 22,500 మెగావాట్లు.. అంటే ప్రపంచంలోనే అతిపెద్దవైన మూడు అణువిద్యుత్తు కేంద్రాల ఉత్పత్తికి దాదాపు సమానం. ఈ డ్యామ్‌ నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశముంది. ఈ ప్రాజెక్టు పనులను 1994లో ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. డ్యామ్‌ నిర్మాణం కోసమే 114 పట్టణాలను, 1,680 గ్రామాలను చైనా నేల మట్టం చేసింది. ఫలితంగా 14 లక్షల మందికి పునరావసం కల్పించింది. యాంగ్జీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ లక్షల మంది నిరాశ్రయులు అవుతూనే ఉన్నారు. వరద తీవ్రత పెరిగి ఈ డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం జరిగినా దిగువ ప్రాంతాలకు వినాశనం తప్పదు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z