Business

భారత్‌లో కొత్త ఎయిర్‌లైన్స్ Shankh Airకు ఆమోదం-BusinessNews-Sep 24 2024

భారత్‌లో కొత్త ఎయిర్‌లైన్స్ Shankh Airకు ఆమోదం-BusinessNews-Sep 24 2024

* ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ (Tata motors) తన నెక్సాన్‌ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌తో కొత్త ఎస్‌యూవీని తీసుకొచ్చింది. ఈ నెక్సాన్‌ ఐసీఎన్‌జీ (Nexon iCNG) ధర రూ.8.99 (ఎక్స్‌- షోరూమ్) లక్షల నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే నెక్సాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌, ఈవీ వేరియంట్లు ఉన్నాయి. తాజాగా అత్యాధునిక ఫీచర్లతో సీఎన్‌జీ వేరియంట్‌ను జోడించినట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో నెక్సాన్‌ ఐసీఎన్‌జీ తీసుకొచ్చింది. ఇది 98 bhp, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అత్యంత శక్తిమంతమైన వాహనాల్లో ఇదీ ఒకటి. డ్యూయల్‌ సిలిండర్‌ సదుపాయంతో ఈ ఐసీఎన్‌జీని లాంచ్‌ చేశారు. రెండు స్లిమ్‌ సిలిండర్లు ఉండడంతో కార్గో ఏరియా విశాలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 6 ఎయిర్‌ బ్యాగ్‌లు భద్రతా ఫీచర్లను జోడించినట్లు కంపెనీ చెబుతోంది. హారియర్‌, సఫారితో ఎంతో ఆదరణ పొందిన రెడ్‌ డార్క్‌ ఎడిషన్‌ను దీంట్లోనూ తీసుకొచ్చారు.

* దేశ విమానయాన రంగంలోకి మరో కొత్త సంస్థ ప్రవేశించబోతోంది. దేశీయంగా విమాన సర్వీసులు నడిపేందుకు శంఖ్‌ ఎయిర్‌కు (Shankh Air ) పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నుంచి (DGCA) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించనున్నట్లు శంఖ్ ఎయిర్‌ పేర్కొంది. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలతో పాటు డైరెక్ట్‌ సర్వీసులు తక్కువగా ఉన్న మార్గాల్లో సేవలు అందించనున్నట్లు పేర్కొంది. ఎఫ్‌డీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థల నుంచి కూడా ఆమోదం పొందాల్సి ఉంటుందని పౌర విమానయాన శాఖ తెలిపింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సరికొత్త మైలురాళ్లను అందుకున్నాయి. సెన్సెక్స్‌ తొలిసారి 85 వేల మార్కును దాటగా.. నిఫ్టీ సైతం తొలిసారి 26 వేల స్థాయిని దాటింది. గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడితో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయం 84,860.73 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,928.61) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభాల్లోకి వచ్చింది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 85,163.23 వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 14.57 పాయింట్ల నష్టంతో 84,914.04 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 26,011.55 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి కేవలం ఒక్క పాయింట్‌ లాభంతో 25,940.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.66గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్లు వద్ద, బంగారం ఔన్సు 2657 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI).. అధునాతన సాంకేతికత వినియోగం సంచలనంగా మారింది. పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలే కాకుండా రోజువారీ జీవితంలో చాలామంది ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ వినియోగంపై ఓపెన్‌ఏఐ (OpenAI) సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) స్పందించారు. జాబ్‌ మార్కెట్లో ఏఐ అనేక మార్పులను తీసుకొస్తుందన్నారు. జాబ్‌ మార్కెట్‌లలో ఏఐ రాకతో మొదలయ్యే అనుకూల, ప్రతికూల అంశాలపై ఆల్ట్‌మన్‌ తాజాగా తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించారు. ‘‘ చాలా ఉద్యోగాల్లో నెమ్మదిగా మార్పులు వస్తాయి. అయితే మనకు పని ఉండదేమో.. అనే ఆలోచనపై నాకు భయం లేదు. ఎందుకంటే.. ఏఐ కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. దీంతోపాటు మానవులు మరింత సృజనాత్మకతక, అర్థవంతమైన పనిపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. మన సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఈ రోజు చేసే అనేక ఉద్యోగాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం వారికి సమయం వృథా చేసేవిలా అనిపించవచ్చు. అలానే.. భవిష్యత్‌ తరాలు మన ప్రస్తుత పనిని పాతవి లేదా అనవసరంగా భావించొచ్చు. అయితే గతంలో వచ్చిన సాంకేతికను ప్రజలు ఏవిధంగా అందిపుచ్చుకున్నారో.. ఏఐ తీసుకొచ్చే మార్పులకు అలానే మారతారు’’ అని ఆయన అన్నారు. కేవలం ఉద్యోగాల పరంగానే కాకుండా సమాజంపై కూడా ఏఐ ఎటువంటి ప్రభావం చూపనుందో వివరించారు.

* ‘చాట్‌ జీపీటీ’ సృష్టికర్త ఓపెన్‌ ఏఐ సంస్థ ఇప్పుడు హ్యాకర్లతో ఇబ్బంది పడుతోంది. దానికి సంబంధించిన ఒక ఎక్స్‌ ఖాతా నుంచి గుర్తుతెలియని వ్యక్తి క్రిప్టో కరెన్సీ ప్రకటన పోస్టు చేశారు. అంతేకాదు.. ఆ క్రిప్టో టోకెన్లు ఓపెన్‌ ఏఐకి చెందినవి పేర్కొన్నాడు. ఈ విషయాన్ని తమ సంస్థ గమనించిందని ఓపెన్‌ ఏఐ సంస్థ ప్రకటించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన @OpenAINewsroom అనే ఖాతా నుంచి సాయంత్రం 7 గంటల సమయంలో ఈ పోస్టులు వచ్చినట్లు వెల్లడించింది. ఇవి న్యూయార్క్‌ సహా కొన్నిచోట్ల కనిపిస్తున్నట్లు పేర్కొంది.

* ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,000 (22 క్యారెట్స్), రూ.76,360 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.210 పెరిగింది. మే నెలలో 24 క్యారెట్ల బంగారం గరిష్ఠంగా రూ.76,450కు చేరింది. తిరిగి ఆ ధరను అందుకునేలా కనిపిస్తోంది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.210 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.76,360 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z