ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈడీకి సంబంధించిన కేసులో వచ్చే నెల 16న విచారణకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో మంగళవారం కేసు విచారణ జరిగింది. విచారణకు నిందితుడు జెరుసలేం మత్తయ్య హాజరుకాగా.. రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహా, కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరయ్యారు. అయితే, నిందితులు ఎందుకు విచారణకు రావడం లేదంటూ సెషన్స్ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. అయితే, అక్టోబర్ 16న విచారణకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మిగతా నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను టీడీపీకి మద్దతుగా ఓటు వేయాలని డబ్బులను ఇస్తుండగా రేవంత్‌రెడ్డిని ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓటుకు నోటు వ్యవహారంపై ఏసీబీ విచారణ జరుపుతున్నది. తాజాగా ఈ కేసులో సీఎం రేవంత్‌తో పాటు నిందితులను విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z