* దేశంలో బంగారం ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడో రోజూ ధరలు ఊపందుకోవడంతో పసిడి నేడు (సెప్టెంబర్ 25) మరో కొత్త మార్కును తాకింది. దీంతో తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు నిరాశే ఎదరైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ఎంత మేర పెరిగిందన్నది పరిశీలిస్తే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.70,600 వద్దకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.660 పెరిగి రూ. 77,020 లను తాకింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బంగారం రేట్లు పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.70,750 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.660 పెరిగి రూ.77,170 లకు ఎగిశాయి.
* ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ యూలర్ మోటార్స్(Euler Motors) ఈ రోజు(బుధవారం) బహుళ అవసరాలకు ఉపయోగపడే రెండు ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లతో తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను విక్రయిస్తున్న సంస్థ, ఇంటర్/ఇంట్రా సిటీ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన రెండు స్టార్మ్ ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేసింది. కంపెనీ, ఎలక్ట్రిక్ చిన్న వాణిజ్య వాహనాల(SCV) సెగ్మెంట్ వాటాను ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విభాగంలో ఉన్నటువంటి మార్కెట్ వాటాకు సమానంగా తీసుకెళ్లాలని యోచిస్తోందని యూలర్ మోటార్స్ సీఈఓ సౌరవ్ కుమార్ తెలిపారు. యూలర్ సంస్థ ఈ రెండు కొత్త మోడళ్లను దిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి ఏడు ప్రధాన నగరాల్లో మొదట పరిచయం చేయనుందని, ఆ తర్వాత ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక ఇతర నగరాల్లో ఈ వాహన ఉత్పత్తులను ప్రవేశపెడతామని సౌరవ్ కుమార్ తెలిపారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. దాదాపు రోజంతా స్తబ్దుగానే కదలాడాయి. ఆఖరి అరగంటలో బ్యాంకింగ్, పవర్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు సరికొత్త గరిష్ఠాలను అందుకున్నప్పటికీ.. బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 85 వేలు, నిఫ్టీ 26వేల ఎగువన ముగియడం గమనార్హం. సెన్సెక్స్ ఉదయం 84,836.45 పాయింట్ల వద్ద (84,914.04) నష్టాల్లో ప్రారంభమైంది. చాలా సేపటి వరకు ఫ్లాట్‌గా ట్రేడయ్యింది. ఇంట్రాడేలో 84,743.04 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో ఒక్కసారిగా పుంజుకుని 85,247.42 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 255.83 పాయింట్ల లాభంతో 85,169.87 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 63.75 పాయింట్ల లాభంతో 26,004.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.60గా ఉంది.
* చైనా మొబైల్ తయారీ కంపెనీ వివో (Vivo) ‘వీ’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తాజాగా తీసుకొచ్చిన వివో వీ40, వివో వీ40 ప్రోకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో.. వివో వీ40ఈ (Vivo V40e) పేరిట మరో ఫోన్‌ను లాంచ్ చేసింది. 50ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆకర్షణీయమైన డిజైన్‌తో దీన్ని ఆవిష్కరించింది. వెట్ టచ్ ఫీచర్‌తో పాటు అనేక సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చింది. వివో కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ +128జీబీ వేరియంట్ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.30,999గా కంపెనీ పేర్కొంది. మింట్‌గ్రీన్, రాయల్ బ్రాంజ్ రంగుల్లో లభిస్తుంది. అక్టోబర్ 2 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇ- స్టోర్‌తోపాటు వివో ప్రధాన స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేసేవారికి 6 నెలల పాటు నో- కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ ద్వారా కొనుగోలు చేసేవారికి 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.
* అవాంఛిత కాల్స్, మెసేజ్ ల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) సిద్ధమైంది. కొన్నేళ్లుగా టెలికాం యూజర్లను తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో అడ్డుకునేందుకు కొత్త టెక్నాలజీని రూపొందించామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విత్తల్ తెలిపారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. స్పామ్ కాల్స్, మెసేజ్‌ల గురించి ఈ సదుపాయం యూజర్లను అలెర్ట్ చేస్తుందని తెలిపారు. స్పామ్ కాల్స్‌పై చర్యలు తీసుకుంటున్న తొలి నెట్‌వర్క్ తమదేనని ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ పేర్కొంది. దేశంలో 60 శాతం మంది భారతీయులు సగటున రోజుకు మూడు స్పామ్ కాల్స్ అందుకున్నారని ఎయిర్‌టెల్ పేర్కొంది. వీటివల్ల టెలికాం యూజర్ల సమయం వృథా కావడంతో పాటు కొన్నిసార్లు స్కాములకు కూడా దారితీస్తున్నాయని తెలిపింది. వీటిని అడ్డుకొనే దిశగా ఎయిర్‌టెల్ ఈ ప్రయత్నం మొదలుపెట్టిందని గోపాల్ విత్తల్ తెలిపారు. తమ ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్ కేవలం 2 మిల్లీ సెకన్లలోనే స్పామ్‌ను గుర్తించి యూజర్‌ను డైలర్‌పై అలర్ట్ చేస్తుందని తెలిపారు. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వాడే స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికీ ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందించనున్నట్లు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z