* ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనంలో మరో ముందడుగు పడింది. విలీనం నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ వయాకామ్ 18 బోర్డులో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వయాకామ్ 18 అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం. ప్రతిపాదిత విలీనానికి ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఆమోద ముద్ర వేశాయి. సీసీఐ సూచనల మేరకు వ్యాపారంలో చిన్నపాటి మార్పులు మినహా ఇప్పటికే విలీన ప్రక్రియ తుది దశకు చేరింది. ఈ క్రమంలో తల్లీ, కుమారులు బోర్డులో చేరడం గమనార్హం. వీరితో పాటు బోధి ట్రీ సిస్టమ్స్ కో ప్రమోటర్ జేమ్స్ ముర్దోచ్, కతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన మహ్మద్ అహ్మద్ అల్ హర్దన్, రిలయన్స్‌లో మీడియా, కంటెంట్ వ్యాపార విభాగం ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే, శువా మొండల్ తదితరులు వయాకామ్ 18 బోర్డులో నియమితులయ్యారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Markets) గురువారం భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత పుంజుకున్నాయి. ఆటో, మెటల్స్ స్టాక్స్ మద్దతుతో సూచీలు రాణించాయి. నిఫ్టీ, సెన్సెక్స్ తాజా జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. నిఫ్టీ 26,100, సెన్సెక్స్ 85,800 ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 85,167.56 పాయింట్ల వద్ద (85,169.87) ఫ్లాట్‌గా ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాటపట్టింది. ఇంట్రాడేలో 85,106.74 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. తర్వాత 85,930.43 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరికి 666.25 పాయింట్ల లాభంతో 85,836.12 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 26,250.90 పాయింట్లతో సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. చివరకు 211.90 పాయింట్ల లాభంతో 26,216.05 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.65 గా ఉంది.
* ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ ఎం సిరీస్‌లో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. బిగ్ బ్యాటరీతో ఎం 15 5జీ ప్రైమ్ ఎడిషన్ (M15 5G Prime Edition) పేరిట కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో గెలాక్సీ ఎం 15 5జీని శాంసంగ్ తీసుకొచ్చింది. దానికే చిన్నచిన్న మార్పులతో ఇప్పుడు ప్రైమ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్ హామీ ఇస్తోంది. ఎం15 5జీ ప్రైమ్ ఎడిషన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+128జీబీ వేరియంట్ రూ.10,999కు లభిస్తుంది. 6జీబీ+128జీబీ ధర రూ.11,999గానూ, 8జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.13,499గానూ నిర్ణయించారు. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్లు, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. బ్లూ టోపాజ్, సెలిస్టెయిల్ బ్లూ, స్టోన్ గ్రే రంగుల్లో లభిస్తుంది.
* అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశీయంగా ధరలు తగ్గుతాయన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వీటి ధరలు తగ్గొచ్చన్న అంచనాలు ఇప్పటికే వెలువడ్డాయి. తాజాగా ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సైతం ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో చమురు సంస్థ మార్జిన్లు బాగా పెరిగాయంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు రూ.2-3 చొప్పున తగ్గించేందుకు వీలుందని పేర్కొంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు సగటు ధర సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు 74 డాలర్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో ఆ మొత్తం 83-84 డాలర్లుగా ఉందని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇప్పటికే తగ్గిన ముడి చమురు ధరలతో ప్రభుత్వరంగ చమురు సంస్థ మార్జిన్లు మెరుగయ్యాయని, ఇలానే స్థిరంగా కొనసాగితే రిటైల్ చమురు ధరలను తగ్గించొచ్చని రేటింగ్ సంస్థ అభిప్రాయపడింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z