* ‘లులు’ సంస్థను ఏపీకి ఆహ్వానించినందుకు ఆ సంస్థ ఛైర్మన్ యూసుఫ్ అలీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుతో 18 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆయనతో శనివారం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయయని అన్నారు. విశాఖలో అంతర్జాతీయస్థాయి షాపింగ్ మాల్ నిర్మిస్తామన్నారు. ‘‘ షాపింగ్ మాల్‌లో 8 స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ నిర్మిస్తాం. విజయవాడ, తిరుపతిలో హైపర్‌మార్ట్‌లు నిర్మిస్తాం. ఏపీలో ఆధునిక ఆహారశుద్ధి కేంద్రాలు, లాజిస్టిక్ హబ్‌లు నిర్మిస్తాం’’ అని ఎక్స్ వేదిగా వెల్లడించారు.
* హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రోరైలు రెండోదశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్‌రెడ్డి తెలిపారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులు చేపట్టనున్నారు. ఈ దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకీ మెట్రో రైలు అందుబాటులోకి రానుందని ఎన్‌వీఎస్‌ఎస్ రెడ్డి వెల్లడించారు. అంతేకాకుండా ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్-బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైనును ఖరారు చేసింది. కారిడార్-4లో నాగోల్- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కి.మీ మార్గానికి ఆమోదం తెలిపింది. ఎయిర్‌పోర్టు కారిడార్‌లో 1.6కిలోమీటర్ల మేర మెట్రో రైలు భూగర్భ మార్గంలో వెళ్లనుంది.రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
* రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధినేత అనిల్ అంబానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ)తో వివాదంలో ఉపశమనం లభించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ.780 కోట్లను డీవీసీ చెల్లించాలని ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కల్‌కత్తా హైకోర్టు సమర్థించింది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇన్‌ఫ్రా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. పదేళ్ల క్రితం అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పే కాంట్రాక్టును రూ.3,750 కోట్లకు దక్కించుకుంది. అయితే కొన్ని కారణాలతో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దీనిపై ప్రభుత్వ సంస్థ డీవీసీ అభ్యంతరం తెలిపింది. దీంతో నష్టపరిహారం కింద తమకు కొంత చెల్లించాలని కోరింది.
* బ్రిటిష్ రాక్ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి బ్లాక్‌లో టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు రావడంతో బుక్ మై షో (BookMyShow) సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అశీష్ హేమరాజని (Ashish Hemrajani)కి ముంబయి పోలీసులు శనివారం సమన్లు జారీ చేశారు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై తాజాగా బుక్‌మై షో స్పందించింది. అనధికారంగా టికెట్లు విక్రయించిన వారితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై బుక్‌మై షో అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. ‘‘కోల్డ్ ప్లే కన్సర్ట్ కోసం సెప్టెంబర్ 22న బుక్‌మైషోలో టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు ఏకంగా 1.2 మిలియన్ల మంది టికెట్ బుకింగ్ కోసం లాగిన్ అయ్యారు. ప్రతి అభిమానికి టికెట్లు అందాలనే ఉద్దేశంతో ఒక్కో వినియోగదారుడు 4 టికెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు పరిమితి విధించాం’’ అని ఆయన అన్నారు. అభిమానుల కోరిక మేరకు మూడో షోను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
* భారత్‌కు ముడి చమురుకు విడదీయరాని సంబంధం ఉంది. ప్రపంచంలోని దిగ్గజ దేశాల కంటే ఎక్కువగా ఇక్కడ గిరాకీ ఉంటోంది. అమెరికా, చైనా, బ్రెజిల్, కొరియా, ఇరాన్‌ల కంటే కూడా ఈ ఏడాది అధిక గిరాకీ ఉంటోంది. 2024 మొత్తం మీద అంతర్జాతీయ చమురు గిరాకీలో అతిపెద్ద వాటాదారుగా భారత్ నిలవబోతోందని విశ్లేషకులు అంటున్నారు. విచిత్రం ఏమిటంటే అంతర్జాతీయ జీడీపీకి భారత్ అందిస్తున్న వాటా 8 శాతమే. అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిలో మన వాటా మాత్రం 22 శాతంగా ఉంది. ప్రపంచ జీడీపీకి అయిదో వంతునందించే చైనా మాత్రం 20 శాతం మాత్రమే వాడుకోనుంది. అంటే ప్రపంచ దేశాలకు వాటి జీడీపీకి మధ్య చమురు పెద్దగా ప్రాధాన్య అంశంగా ఉండడం లేదు. మనకు మాత్రం అలా కాదు. డీజిల్, పెట్రోలు, ఎల్‌పీజీ.. దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్రను పోషించనున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z