* విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బీహెచ్ఎల్ డిపో నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు కొత్తగా రెండు ఈ -గరుడ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈనెల 30న ఈ-గరుడ బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ బస్సులు రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియన్ టౌన్ షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాంనగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడకు ప్రయాణిస్తాయని చెప్పారు.
* సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన 33 జిల్లాల తహశీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
* అమృత్ టెండర్ల అంశంపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. ‘‘ సీఎం బావమరిది శోధ కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం. అవినీతి నిరోధక చట్టంలోని 7, 11, 13 సెక్షన్లను సీఎం ఉల్లంఘించారు. బావమరిదితో లీగల్ నోటీసు పంపితే భయపడతాననుకున్నారా? నోటీసులు పంపితే నీ అక్రమదందాల గురించి మాట్లాడనని అనుకున్నారా? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం. రెండేళ్లలో రూ.2కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన చిన్న కంపెనీ శోధ. రూ.2కోట్ల కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ ఎలా కట్టబెట్టారు. దిల్లీలో ఉన్న నీ భాజపా దోస్తులు కూడా నిన్ను కాపాడటం కష్టమే. ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నది. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్‌చవాన్ వలే .. నువ్వు దొరికావు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
* తిరుమలలో 14 అడుగుల కొండ చిలువ భక్తులను భయాందోళనకు గురి చేసింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఎస్వీ మూజియం వద్ద ఉన్న శృంగేరి శంకర మఠంలోకి భారీ కొండ చిలువ ప్రవేశించింది. మఠం నిర్వాహకులు తితిదే ఉద్యోగి భాస్కర నాయుడికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న భాస్కర నాయుడు చాకచక్యంగా కొండ చిలువను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అవ్వాచ్చారి కోనలో వదిలిపెట్టారు.
* రోజులో కనీసం పదివేల అడుగులు (health benefits walking) తప్పనిసరిగా వేస్తేకానీ ఆరోగ్యం సొంతంకాదు అనేది పాతమాట. కనీసం నాలుగువేల అడుగులయినా చాలు. ఆపై మనం వేసే ప్రతి అడుగూ ఆరోగ్య ప్రయోజనాలని పెంచుతూ వెళ్తుందని అంటున్నారు లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. కుర్చీలకే పరిమితం అయిపోతున్నాం… పదివేల అడుగులు వేయలేకపోతున్నామే అని బాధపడేవారికి ఇదో రకం ఓదార్పే. సుమారు రెండున్నర లక్షలమందిపైన పరిశోధన చేసి శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలివి. ప్రతిరోజూ రెండున్నరవేల అడుగులు వేసే వారిలో గుండెజబ్బులు దూరంగా ఉంటాయట. అదే నాలుగువేల అడుగులు వేయగలిగితే అన్నిరకాల జీవనశైలి జబ్బుల నుంచీ దూరంగా ఉండొచ్చట. ఆపైన వెయ్యి అడుగులు వేస్తే ఈ ప్రయోజనాలు మరో 15 శాతం పెరుగుతాయట. ఇంకో 500 అడుగులు వేయగలిగితే దాదాపుగా గుండెజబ్బుల నుంచి రక్షణ ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే నడక- ఎంత తక్కువగా ఉన్నాసరే- సర్వరోగ నివారిణి అన్నమాట!
* తిరుమల లడ్డూ మహా ప్రసాదం (Tirupati laddu) కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu), నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj)ల మధ్య ఎక్స్ (ట్విటర్) వేదికగా తీవ్ర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై మంచు విష్ణు తాజాగా స్పందించారు. తన అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమే తాను పోస్ట్ పెట్టానని.. అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని మీడియాతో చెప్పారు.
* సముద్రంలో ఒక విలాసవంతమైన నౌకలో ఓ మహిళ సాహసమే చేసింది. ఎన్నో అడుగుల ఎత్తు నుంచి నీటిలో దూకింది. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. కొన్ని పనులు ప్రయత్నించడం కంటే గమనించడమే మేలంటూ రాసుకొచ్చారు. ‘‘నేను ఈ రోజు ఓ కల కన్నాను. ఓ విలాసవంతమైన నౌకలో ఈ రకమైన డైవ్‌ని ఎలా చేయాలో నేర్చుకోవాలని భావించాను. అయితే.. కొన్నిసార్లు కలలు.. కలలుగానే ఉంటేనే బాగుంటుంది. వాటిని దూరం నుంచే గమనించడమే మేలు’’ అని పోస్టు చేశారు.
* మూసీ ప్రక్షాలనపై భారాస నేతల విమర్శలను మంత్రి శ్రీధర్‌బాబు తిప్పికొట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్న ఆయన.. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని పేర్కొన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా.. హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు.
* తమ ప్రభుత్వానిది ప్రజాపాలనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ నుంచి 33 విద్యుత్ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు.
* కాంగ్రెస్ సభల్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. హరియాణా (Haryana) అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభల్లో ఈ నినాదాలు లేవనెత్తుతున్నారని ఆయన అన్నారు.
* ఓ జంట వెయ్యి డాలర్ల(రూ.83వేలు)డబ్బు, బీర్ కోసం తమ పిల్లాడిని అమ్మడానికి ప్రయత్నించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యూఎస్‌లోని నార్త్‌వెస్ట్ అర్కాన్సాస్‌కు చెందిన డేరియన్ అర్బన్, షాలీన్ ఎహ్లర్స్ దంపతులకు మూడు నెలల పిల్లాడు ఉన్నాడు. ఇటీవల వారు డబ్బు, బీరు కోసం తమ బిడ్డను అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఓ వ్యక్తి అధికారులకు సమాచారం ఇచ్చారు. చిన్నారి శరీరంలోని వివిధ భాగాలలో దద్దుర్లు, బొబ్బలతో బాధపడుతున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. వైద్యం అందించడానికి దగ్గరలోని పిల్లల ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని విక్రయించినట్లుగా వారు రాసుకున్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులిద్దరూ లేఖపై సంతకం చేసిన సెల్‌ఫోన్ వీడియోను కూడా అధికారులు గుర్తించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z