Politics

ఆ ప్రాజెక్టుకు హైడ్రాకు సంబంధం లేదు-NewsRoundup-Sep 30 2024

ఆ ప్రాజెక్టుకు హైడ్రాకు సంబంధం లేదు-NewsRoundup-Sep 30 2024

* హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనడానికి లడ్డూ అంశం క్లైమాక్స్‌ లాంటిదని జనసేన జాతీయ కార్యదర్శి నాగబాబు అన్నారు. సనాతన ధర్మం బతకడం నేర్పించిందని, దానికి అన్యాయం జరుగుతోందనే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పవన్‌ కల్యాణ్‌ మాటలను పూర్తిగా సమర్థిస్తున్నా. హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే నిర్వహించాలి. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయనేదే పవన్‌ కల్యాణ్‌ బాధ. అన్ని మతాలతో కలిసి ఉండే వ్యక్తి పవన్‌ కల్యాణ్. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.’’ అని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దోషులెవరున్నా బయటకు వస్తారని తెలిపారు. వైకాపా నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

* మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన చేశారు. నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్నవారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదన్నారు. నదీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్‌ చేయడం లేదని, మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్టని చెప్పారు. దానిని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చేపడుతోందని వెల్లడించారు.

* ఏపీ మాజీ మంత్రి సుచరిత మరిది వేధిస్తున్నారని ఓ మహిళ గుంటూరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 500 గజాల స్థలం అద్దెకు తీసుకుని.. ఐదేళ్లుగా ఖాళీ చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నించిన తన భర్త, కుటుంబసభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టారని వాపోయారు. ఈ విషయాన్ని సుచరిత దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని సదరు మహిళ ఫిర్యాదులో తెలిపారు. ఖాళీ చేయకపోగా.. దొంగ పత్రాలు సృష్టించి తమ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

* ప్రయాణికులకు హైదరాబాద్‌ మెట్రో రైలు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2025 మార్చి 31 వరకు ఆఫర్లను పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది. అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత కోసమే ఈ రుసుము వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.

* భారత్‌, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. మైదానం తడిగా ఉండటం వల్ల రెండు, మూడు రోజుల్లో ఆట సాధ్యం కాలేదు. ఎట్టకేలకు నాలుగో రోజు మ్యాచ్‌ సజావుగా సాగగా.. మొత్తం 18 వికెట్లు నేలకూలాయి. సోమవారం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 26/2 స్కోరుతో నిలిచి 26 పరుగుల వెనుకంజలో ఉంది. అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. షాద్మాన్ ఇస్లాం (7*), మోమినుల్ హక్ (0*) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు 107/3తో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాదేశ్‌ 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (107) శతకం బాదగా.. నజ్ముల్ హొస్సేన్ శాంటో (31), మెహిదీ హసన్‌ మిరాజ్‌ (20) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్‌, అశ్విన్‌, ఆకాశ్ దీప్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.

* మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరగడంపై ఆయన స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరని అన్నారు. ‘‘ భారాస అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్‌ మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నా. సోషల్‌ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నా’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

* తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. అయితే డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మంగళవారం ప్రారంభంకానుంది. అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ నరసింహారెడ్డి ప్రకటించారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు చరవాణిలో (ఎస్ఎంఎస్) రూపంలో సమాచారం అందించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితా డీఈఓలు ప్రకటిస్తారని తెలిపారు. అభ్యర్థులు డీఈఓలు గుర్తించిన కేంద్రాల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటో కాపీలతో హాజరుకావాలని స్ఫష్టం చేశారు.

* కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో ముడా స్కామ్ (MUDA scam) కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో చిక్కుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)ను మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ స్కామ్‌కు సంబంధించి తాజాగా ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మనీలాండరింగ్‌ కేసు (money laundering case) నమోదు చేసింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భూముల వ్యవహారంలో సిద్ధరామయ్య అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించడంతో ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా పేర్కొంది. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్‌ స్వామితో పాటు మరో వ్యక్తి పేర్లను జాబితాలో చేర్చింది.

* ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగు పర్చేందుకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలని మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్షణ ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ నెలాఖరులోగా స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలకు (ఎస్‌ఎంసీ) శిక్షణ పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, ఫలితాల మెరుగు కోసం ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని కోరారు. స్కూళ్ల నిర్వహణపై ఫీడ్ బ్యాక్ కోసం రూపొందించిన యాప్‌లలో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనులను ప్రధానోపాధ్యాయులు చేయవద్దని తెలిపారు. ఎస్ఎంసీ సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.

* కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి.. కాశీకి పోయినట్లుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదని భాజపా నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ‘‘రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా.. గత పదేళ్లలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే నికర ఆదాయం పెరగని వాళ్లందరి సమాచారం మీ దగ్గర ఉందా? స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేసి.. రైతులను ఆదుకోవాలంటూ రాజధాని వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న వారి విజ్ఞప్తులను ఎప్పుడైనా పట్టించుకున్నారా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా? రూ. లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల నుంచి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబద్ధత మీకుందా? కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు భరోసా కల్పించే బాధ్యత మాది. ఇప్పటికే సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌ ప్రకటించాం. పంటలన్నింటినీ మద్దతు ధరకే కొనుగోలు చేసేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని తుమ్మల పేర్కొన్నారు.

* ధృవ వాయు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన హారర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ‘కళింగ’ (Kalinga Movie). సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెల రోజులు తిరగక్కుండానే ఓటీటీలో వచ్చేస్తోంది. తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో అక్టోబరు 4వ తేదీ (kalinga ott release) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అక్కడికి పోవడమే గానీ, రావడం ఉండదు’ అంటూ పోస్టర్‌ పంచుకుంది. ప్రజ్ఞా నయన్‌ కథానాయికగా నటించిన ఈ మూవీని దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ సంయుక్తంగా నిర్మించారు.

* దేశాన్ని, మతాన్ని కించపరిచేలా వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. భక్తుల మనోభావాలు గౌరవించి డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం, హిందూయిజం మీద దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన మతం, మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది క్రూరత్వమని విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక ఈ విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని, రీసర్వే సమస్యల పరిష్కారంపై మళ్లీ దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z