* దేశంలో గత నెలకు సంబంధించిన వస్తు, సేవల పన్ను (GST) వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ మాసానికి మొత్తంగా రూ.1.73 లక్షల కోట్లు వసూళ్లు (GST collection) జరిగినట్లు తెలిపింది. గతేడాది ఇదే నెలలో రూ.1.62 లక్షల కోట్ల వసూళ్లు నమోదవ్వగా.. అప్పటితో పోలిస్తే ఈసారి 6.5 శాతం మేర పెరగడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆగస్టులో 1.75 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో దేశీయ వ్యాపార కార్యకలాపాల ద్వారా ఆదాయం 5.9శాతం పెరిగి రూ.1.27 లక్షల కోట్లకు చేరగా.. వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 8 శాతం పెరిగి రూ.45,390 కోట్లకు చేరింది. అలాగే, గత నెలలో రూ.20,458 కోట్ల విలువైన రీఫండ్‌లు జారీ కాగా.. గతేడాది ఇదే మాసంతో పోలిస్తే ఇది 31 శాతం పెరిగింది. రిఫండ్‌లను సర్దుబాటు చేసిన అనంతరం సెప్టెంబర్‌లో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.53లక్షల కోట్లుగా ఉంది.
* స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్లలో కొత్తగా ఏఐ ఫీచర్లను (AI Features) జోడిస్తున్నాయి. శాంసంగ్, యాపిల్, మోటోరొలా.. ఇలా ప్రతి కంపెనీ కూడా స్మార్ట్‌ఫోన్లలో తమదైన ఏఐ ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నాయి. అయితే, వీటిని కొంతకాలం పాటు మాత్రమే ఉచితంగా అందిస్తామని, ఆపై డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అంటోంది శాంసంగ్ (Samsung). వచ్చే ఏడాది నుంచి కొంత రుసుము వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలో శాంసంగ్ తన ఎస్24 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. అందులో తొలిసారి ఏఐ ఫీచర్లు జోడించింది. అప్పట్లో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనే 2025 చివరి వరకు కొన్ని ఫీచర్లను ఉచితంగా అందిస్తామని శాంసంగ్ పేర్కొంది. ఇటీవల గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ (S23 FE) లాంచ్ సందర్భంలోనూ 2025 చివరి నుంచి కొన్ని ఏఐ ఫీచర్లకు ఫీజు ఉంటుందని తెలిపింది. దీంతో మరో ఏడాది మాత్రమే ఏఐ ఫీచర్లు ఉచితంగా అందించబోతున్నట్లు స్పష్టంచేసింది. మున్ముందు ఏ సిరీస్ ఫోన్లకు కూడా ఏఐ ఫీచర్లను తీసుకురానున్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచగా.. ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 84,257.17 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,299.78) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 84,648.40 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి 33.49 పాయింట్ల నష్టంతో 84,266.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 13.95 పాయింట్ల నష్టంతో 25,796.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.82గా ఉంది.
* టాటా గ్రూపునకు (Tata group) చెందిన విమానయాన సంస్థలైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్- ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిరేషియా ఇండియా) విలీన ప్రక్రియ పూర్తయ్యింది. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈవిషయాన్ని మంగళవారం వెల్లడించింది. విలీనానికి కావాల్సిన నియంత్రణపరమైన ఆమోదాన్ని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి ఏఐఎక్స్ కనెక్ట్ కింద నమోదైన విమానాలన్నీ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పేరుతో నడవనున్నాయి. విలీనం అనంతరం కార్యకలాపాలను పరిశీలిస్తామని డీజీసీఏ తెలిపింది.
* అమెరికా కనెక్టికట్‌లోని గ్రీన్‌విచ్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.5 కోట్లతో గతేడాదిలో ఫెరారీ కారును కొనుగోలు చేశాడు. ఎంతో ఇష్టంగా కొన్న కారును సెప్టెంబర్ 16న ఓ వ్యక్తి దొంగిలించాడు. దీంతో బాధితుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. హఠాత్తుగా యాపిల్ ఇయర్‌పాడ్స్‌ను కూడా కారులోనే వదిలేశానని గుర్తుకువచ్చింది. అలా మరిచిపోయిన ఇయర్‌పాడ్స్‌యే తనకు కారు దొరికేలా చేసింది. వాటి సాయంతో కారును కనిపెట్టొచ్చుగా అనే ఆలోచన వచ్చింది. అంతే తన ఐఫోన్‌లోని ‘‘ఫైండ్ మై డివైజ్’’ అనే ఫీచర్ సాయంతో పాడ్స్‌ను ట్రాక్ చేయడం మొదలుపెట్టాడు. అవి సౌత్ మెయిన్ స్ట్రీట్ వాటర్‌బరీలో ఓ గ్యాస్ స్టేషన్ వద్ద ఉన్నట్లు చూపించింది. ఈ సంఘటనంతా పోలీసులకు వివరించి వారి సాయం తీసుకున్నారు. ఇయర్ పాడ్స్ చూపిస్తున్న లొకేషన్‌కు చేరుకున్నారు. అయితే అదే సమయంలో కారు దొంగిలించిన వ్యక్తి కారులోనే ఉన్నాడు. పోలీసులు దగ్గరగా వస్తుండటం చూసి కారు వదిలేసి పరారయ్యాడు. పోలీసుల సాయంతో ఫెరీరాని సురక్షితంగా చేజిక్కించుకున్నాడు. రూ.5 కోట్ల ఫెరారీ తిరిగి దొరకడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అయితే తప్పించుకొనే ప్రయత్నంలో తన ఐఫోన్‌ను కారులోనే విడిచిపెట్టిపోయాడు. మొబైల్ సాయంతో నిందితుడు డియోన్ స్కోంటెన్ (22)గా గుర్తించారు. గాలింపుచర్యలు చేపట్టి చిట్టచివరకు అతడిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. ఫైండ్ మై డివైజ్ సాయంతో స్మార్ట్‌ఫోన్లు, ఇయర్ పాడ్స్ కనిపెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z