ScienceAndTech

India’s Super Computer: ఏంటీ పరమ్‌ రుద్ర?

India’s Super Computer: ఏంటీ పరమ్‌ రుద్ర?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మూడు పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటర్లను జాతికి అంకితం చేశారు. వీటితో దేశ అత్యధిక నైపుణ్య కంప్యూటింగ్‌ సామర్థ్యాలకు మరింత బలం చేకూరినట్టయ్యింది. బహుముఖ శాస్త్ర అభివృద్ధికి కొత్త ఊతం లభించింది. ఈ సూపర్‌ కంప్యూటర్లతో ఖగోళ, వైద్య, హై ఎనర్జీ భౌతికశాస్త్ర రంగాల్లో పరిశోధనలు ఊపందుకోనున్నాయి. ఇంతకీ ఏంటీ పరమ్‌ రుద్ర? నేషనల్‌ సూపర్‌కంప్యూటింగ్‌ కార్యక్రమం కింద సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) దేశీయంగా పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటర్లను రూపొందించింది. అధునాతన శాస్త్ర పరిశోధనల కోసం వీటిని దిల్లీ, పుణె, కోల్‌కతాలోని ప్రముఖ సంస్థల్లో నెలకొల్పారు.

* పుణెలోని జెయింట్‌ మెట్రో రేడియో టెలిస్కోప్‌ (జీఎంఆర్‌టీ)లో నెలకొల్పిన సూపర్‌కంప్యూటర్‌ను రేడియో తరంగ పౌనఃపున్యాల్లో ప్రకాశంగా, అతి తక్కువ వ్యవధిలో కనిపించే విద్యుదయస్కాంత, రేడియేషన్‌ ప్రచోదనాలు (ఎఫ్‌ఆర్‌బీస్‌), ఖగోళ దృగ్విషయాల మీద అధ్యయనం కోసం వినియోగిస్తారు.

* దిల్లీలోని ఇంటర్‌-యూనివర్సిటీ యాక్సిలరేటర్‌ సెంటర్‌ (ఐయూఏసీ)లో ఏర్పాటు చేసిన సూపర్‌కంప్యూటర్‌ పదార్థ విజ్ఞానం, అణు భౌతికశాస్త్ర రంగాల్లో అధునాతన పరిశోధనలకు వీలు కల్పిస్తుంది.

* కోల్‌కతాలోని ఎస్‌.ఎన్‌.బోస్‌ సెంటర్‌లో నెలకొల్పినదేమో భౌతికశాస్త్రం, ఖగోళం, భూ విజ్ఞాన రంగాల పరిశోధనలకు తోడ్పడుతుంది.

* వీటిల్లో అన్నింటికన్నా శక్తిమంతమైంది ఏయూఏసీలో నెలకొల్పిన సూపర్‌ కంప్యూటర్‌. ఇది 3 పెటాఫ్లాప్‌ సామర్థ్యం కలిగుంది. జీఎంఆర్‌టీలో ఏర్పాటు చేసినది ఒక పెటాఫ్లాప్, ఎస్‌.ఎన్‌. బోస్‌ సెంటర్‌లో నెలకొల్పినది 838 టెరాఫ్లాప్స్‌ సామర్థ్యాన్ని కలిగున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z