Business

బెంగుళూరులో ₹1కే ఆటో సర్వీసు-BusinessNews-Oct 02 2024

బెంగుళూరులో ₹1కే ఆటో సర్వీసు-BusinessNews-Oct 02 2024

* విద్యుత్‌ ద్విచక్ర వాహన రంగంలో దిగ్గజ కంపెనీల మధ్య పోటీ క్రమంగా పెరుగుతోంది. ఈవీల విక్రయాల్లో క్రమంగా తమ మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా టీవీఎస్‌, బజాజ్‌ మధ్య ఈ విషయంలో గట్టి పోటీ నెలకొంది. ఇన్నాళ్లు ఓలా తర్వాత టీవీఎస్‌ రెండో స్థానంలో ఉండగా.. సెప్టెంబర్‌లో బజాజ్‌ చేతక్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మరోవైపు అత్యధిక విక్రయాలతో ఓలా ఎలక్ట్రిక్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నా.. మార్కెట్‌ వాటా మాత్రం క్షీణించడం గమనార్హం. సెప్టెంబర్‌ నెలకు సంబంధించి వాహన విక్రయాల్లో ఓలా 23,965 యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఒకప్పడు నెలకు సగటున 30 వేల వాహనాలు విక్రయించే ఈ సంస్థ.. మార్కెట్‌ వాటా తాజాగా 27 శాతానికి పడిపోయింది. అదే సమయంలో బజాజ్‌ ఆటో తన విక్రయాలను పెంచుకుంటోంది. 18,933 చేతక్‌లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. టీవీఎస్‌ సైతం 17,865 యూనిట్ల ఐక్యూబ్‌లను విక్రయించింది. ఈవీ స్టార్టప్‌ ఏథర్‌, హీరో మోటోకార్ప్‌ బ్రాండ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

* ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా కొత్తగా మరో 600 శాఖలను ప్రారంభించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వీటిని తెరవనున్నట్లు బ్యాంక్‌ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి (challa srinivasulu shetty) తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, పెద్ద రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్పుల్లో వీటిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐకి 22,542 బ్రాంచులు ఉన్నాయి. ఇవి కాకుండా 65 వేల ఏటీఎంలు, 85 వేల బిజినెస్‌ కరస్పాండెట్లు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 137 శాఖలను ఎస్‌బీఐ తెరిచింది. గ్రామీణ స్థాయిలో 58 శాఖలను ప్రారంభించింది. ప్రస్తుతం 50 కోట్ల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నామని ఎస్‌బీఐ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు తెలిపారు. ప్రతి భారతీయ కుటుంబానికి చేరువ అవ్వాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. అలాగే, షేర్‌ హోల్డర్ దృష్టిలోనే కాకుండా ఎస్‌బీఐతో అనుబంధం ఉన్న వారందరి దృష్టిలోనూ ఉత్తమ బ్యాంక్‌గా, అత్యంత విలువైన బ్యాంక్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

* యాపిల్‌ ఐఫోన్లకే కాదు.. ఆ కంపెనీ తయారుచేసే ఎస్‌ఈ (SE) మోడళ్లకూ క్రేజ్‌ అంతాఇంతా కాదు. తక్కువ ధరలో కాంపాక్ట్‌ సైజ్‌లో వచ్చే స్పెషల్‌ ఎడిషన్లకు సెపరేట్‌ ఫ్యాన్‌బేస్‌ కూడా ఉంది. సాధారణంగా ఐఫోన్‌లు పెద్దమొత్తం పెట్టి కొనలేని వారికోసం ఎస్‌ఈ మోడళ్లను యాపిల్‌ తీసుకొస్తూ ఉంటుంది. 2016, 2020, 2022లో మూడు ఎస్‌ఈ మోడళ్లను యాపిల్‌ తీసుకొచ్చింది. తర్వాత ఎస్‌ఈ మోడల్‌ గురించి ఇప్పటివరకు యాపిల్‌ ఏ ప్రకటనా చేయలేదు. అయితే, తదుపరి తరం ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్‌ సిద్ధమవుతోందని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్‌’ ఓ కథనం ప్రచురించింది.

* బెంగళూరు వాసులకు ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. రూ.1 కే ఆటో రైడ్‌ను ఇటీవల ప్రవేశపెట్టింది. ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’సేల్‌ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్‌ ప్రమోషన్‌లో భాగంగా ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం స్థానిక ఆటో డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్క రూపాయికే ఆటో రైడ్‌ కావడంతో దీనికి భారీఎత్తున స్పందన లభిస్తోంది. కేవలం రూపాయి చెల్లించి ఆటో బుక్‌ చేసుకొని నగరంలో ఎంచక్కా తిరుగుతున్నారు. పీక్‌ అవర్స్‌లో రద్దీని దృష్టిలోఉంచుకొని కంపెనీ పలు ముఖ్య ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటుచేసింది. ‘‘ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఉత్సాహాన్ని నింపడానికి బెంగళూరులో రద్దీ సమయాల్లో రూ.1కే ఆటో రైడ్‌లను అందిస్తోంది’’ అని ఆ కంపెనీ వెల్లడించింది. ఆటో రైడ్‌ల కోసం భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో తమ ప్రచారానికి అద్భుత స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. రద్దీ సమయాల్లో సులభతర ప్రయాణం కోసం, అలాగే క్యాష్‌లెస్‌ సేవలను ప్రమోట్‌ చేసేందుకు దీన్ని తీసుకొచ్చామని తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z