* నగరంలో బుధవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు బ్బందులు పడ్డారు. భారీ వర్షం కారణంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పనులకు అంతరాయమేర్పడింది. ప్రధాన రహదారుల్లోని లోతట్టు ప్రాతాల్లోకి చేరిన వర్షపునీటిని తొలగించేందుకు వీఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు.
* ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ‘జన్ సురాజ్ పార్టీ’ (Jan Suraj Party) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచీ ఆమోదం పొందిందని వెల్లడించారు. దీంతో బిహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు. ‘‘కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించాం. అయితే.. ఈ పార్టీకి నాయకత్వం మాత్రం నా చేతుల్లో లేదు. రెండేళ్లుగా దీని కోసం శ్రమించిన వారే ఈ నిర్ణయం తీసుకుంటారు’’ అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
* భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. ‘‘మంత్రి సీతక్క, మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు భారాసలో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు’’ అని సురేఖ హితవు పలికారు.
* బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్(IND vs BAN)ను భారత్ (Team India) క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంలో అటు బంతితో, ఇటు బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (Player Of The Series) అవార్డు లభించింది. ఈ క్రమంలో అతడి ఖాతాలో ఎన్నో రికార్డులూ చేరాయి. ఎక్కువసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్న శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ సరసన అతడు చేరాడు. అశ్విన్‌కిది 11వ అవార్డు.
* గత కొన్ని రోజులుగా సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ఎక్స్ వేదికగా వరుసగా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను (KTR) ఉద్దేశిస్తూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ అసహనం వ్యక్త చేశారు. ‘‘సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా..?’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
* ఇరాన్ దాడి వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. దీనిలో ఆయన వేగంగా ఓ గదిలోకి పరుగెడుతున్న దృశ్యాలున్నాయి. మంగళవారం రాత్రి ఇరాన్ హైపర్‌సొనిక్ క్షిపణి ఇజ్రాయెల్ గగనతలంలోకి ప్రవేశించడంతో ఆయన రక్షణ కోసం బంకర్లోకి పరుగెడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఇరాన్ మద్దతుదారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ వీడియోపై కొన్ని సంస్థలు ఫ్యాక్ట్ చెకింగ్ చేయగా.. మూడేళ్ల క్రితం వీడియోగా తేలింది. 2021లో ఇజ్రాయెల్ పార్లమెంట్ భవనలోని కారిడార్లలో ఆయన హడావుడిగా పరుగెడుతున్న దృశ్యమది. నాడు సమావేశంలో హాజరయ్యేందుకు ఆయన ఆ విధంగా వెళ్లినట్లు తెలుస్తోంది.
* ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. తితిదే ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
* న్యూజిలాండ్ వీసా (New Zealand visa) మరింత ప్రియం అయ్యింది. అన్ని రకాల వీసా రుసుములను పెంచుతూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఉన్న ఛార్జీలతో పోలిస్తే దాదాపు 60శాతం పెరిగినట్లు అంచనా. దీంతో విద్య, ఉపాధి, పర్యటన కోసం వెళ్లాలనుకునే వారికి వీసా ప్రాసెసింగ్ ఛార్జీల్లో భారీ పెరుగుదల కనిపించనుంది. భారత్ నుంచి న్యూజిలాండ్ వెళ్లే విద్యార్థులు, నిపుణులు, పర్యటకులపై ఈ భారం పడనుంది.
* తెలంగాణలో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
* డిసెంబరు 2025 నాటికి బందరు పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
* సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. సాధారణ ప్రజల నుంచి అధికారుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా చేజర్ల మండల తహసీల్దార్ (ఎంఆర్వో)కు టోకరా వేసి ఏకంగా రూ.3.50 లక్షలు కాజేశారు.
* సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని హెచ్చరించారు
* దేశ రాజధాని నగరం దిల్లీలో భారీగా డ్రగ్స్ బయటపడటం కలకలం రేపుతోంది. దాదాపు 500 కిలోలకు పైగా కొకైన్‌ను దిల్లీ పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ రూ.2వేల కోట్లు ఉంటుందని అంచనా.
* భారాస అధినేత కేసీఆర్ ఎక్కడున్నారో కేటీఆర్ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారాస, ఆ పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారు. కబ్జా చేశారు కాబట్టే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. రాహుల్ గాంధీకి.. హైడ్రాకు ఏంటి సంబంధం? ఇంకా డీపీఆర్ రూపొందించలేదు. అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది? మూసీ ప్రక్షాళన చేసి ఆదుకుంటామని గతంలో కేసీఆరే అన్నారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలనే హైడ్రా కూల్చుతోంది. హైడ్రా, కూల్చివేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌లో చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తాం’’ అని వెల్లడించారు.
* రంజీ ట్రోఫీ ఛాంపియన్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ముంబయి మధ్య ఇరానీ కప్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ట్రోఫీలో ముంబయి తరఫున ఆడుతున్న టీమ్ఇండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) అదరగొడుతున్నాడు. 253 బంతుల్లోనే 23 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. 150 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న సర్ఫరాజ్.. మరో 103 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఇరానీ కప్‌లో ముంబయి తరఫున ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇరానీ కప్‌లో అతి పిన్న వయసు (26 ఏళ్ల 346 రోజులు)లో ద్విశతకం సాధించిన నాలుగో ఆటగాడిగానూ సర్ఫరాజ్ ఘనత సాధించాడు. యశస్వి జైస్వాల్ (21 ఏళ్ల 63 రోజులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రవీణ్ ఆమ్రే (22 ఏళ్ల 80 రోజులు), గుండప్ప విశ్వనాథ్ (25 ఏళ్ల 255 రోజులు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z