Business

మరో గరిష్ఠానికి బంగారం ధర-BusinessNews-Oct 03 2024

మరో గరిష్ఠానికి బంగారం ధర-BusinessNews-Oct 03 2024

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) హవా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో అన్ని సంస్థలూ దీనిపై దృష్టి సారించాయి. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొనే పనిలో పడ్డాయి. అందులో భాగంగా పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నాయి. ఇలా ఖర్చు చేయడం పట్ల మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆర్థికవేత్త (MIT economist) డారన్‌ అసిమోగ్లూ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో ఆయా సంస్థలు ఖర్చు చేస్తున్న సొమ్మంతా వృథా కాబోతోందన్నారు. బ్లూమ్‌బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న డారన్‌ ఏఐ హవా గురించి ప్రస్తావించారు. ఏఐ సదుపాయాలు తీసుకురావడం కోసం కంపెనీలు వెచ్చిస్తున్న డబ్బు వృథా కాబోతోందన్నారు. రానున్న దశాబ్దంలో కేవలం 5 శాతం ఉద్యోగాలపై మాత్రమే దీని ప్రభావం ఉండబోతోందని అభిప్రాయపడ్డారు. ఏఐపై చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ఉత్పాదకతలో పెరుగుదల, సామర్థ్యం పెరుగుతుందనన్న అంచనాలు ఫలించకపోవచ్చన్నారు. దీర్ఘకాలంలో కూడా అది సాధ్యం కాదన్నారు. 5 శాతం మార్పుతో ఆర్థిక విప్లవం ఏమీ సంభవించబోదని చెప్పారు.

* దలాల్‌ స్ట్రీట్‌లో యుద్ధ భయాలు అలముకొన్నాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య ముదురుతున్న ఘర్షణ వాతావరణం స్ట్రీట్‌ను కుదిపేసింది. దీంతో సూచీలు కకావికలమయ్యాయి. దీనికి ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌పై సెబీ తీసుకున్న కఠిన నిర్ణయాలూ తోడయ్యాయి. ముఖ్యంగా రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్‌ 1750కి పైగా పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 25,250 స్థాయికి చేరింది. మదుపర్ల సంపద దాదాపు రూ.11 లక్షల కోట్లు ఆవిరైంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.464.3 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి. ఉదయం 83,002.09 వద్ద నష్టాల్లో ప్రారంభమైన (క్రితం ముగింపు 84,266) సెన్సెక్స్‌ రోజంతా పడుతూనే ఉంది. ఇంట్రాడేలో 82,434.02 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 1769.19 పాయింట్ల నష్టంతో 82,497.10 వద్ద ముగిసింది. నిఫ్టీ 546.80 పాయింట్ల నష్టంతో 25,250.10 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.97 వద్ద ముగిసింది.

* దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా మోటార్స్‌ (Kia motors) భారత్‌లో రెండు విలాసవంతమైన కార్లను విడుదల చేసింది. వీటిల్లో విద్యుత్తు ఆధారంగా పనిచేసే ఈవీ9 ఎస్‌యూవీని (EV9 Electric SUV) మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.3 కోట్లుగా నిర్ణయించింది. ఇక ఇప్పటికే భారత మార్కెట్‌కు సుపరిచితమైన కియా కార్నివాల్‌ (Kia Carnival) లగ్జరీ ఎంపీవీ సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. పలు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ కారు ధర రూ.63.90 లక్షలుగా నిర్ణయించింది.

* జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బునంతా జాగ్రత్తగా ఉంటుందని బ్యాంకులో వేస్తే.. మన ఖాతాల్లో నిల్వలన్నీ జీరో అని చూపిస్తే.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది బ్యాంక్ ఆఫ్ అమెరికా(Bank of America) వినియోగదారులకు. దాంతో వారంతా గగ్గోలు పెట్టేశారు. కొద్దిగంటల క్రితం బ్యాంక్‌ ఆఫ్‌ ఆమెరికా (Bank of America)లో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో వేలాదిమంది వినియోగదారులు తమ ఆన్‌లైన్‌ ఖాతాలను ఉపయోగించుకోలేకపోయారు. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకునే వీలు లేకపోయింది. మరికొంతమందికి తమ ఖాతాను యాక్సెస్‌ చేసుకునే వీలు కలిగినప్పటికీ.. అకౌంట్ నిల్వలు మాత్రం జీరో అని కనిపించాయి. దాంతో వారంతా కంగుతిన్నారు. దాంతో ఈ పరిస్థితి తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ సాంకేతిక అంతరాయాలను ట్రాక్‌ చేసే డౌన్‌డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ కొద్దిగంటల క్రితం న్యూయార్క్‌, లాస్‌ఏంజెలెస్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో, సియాటెల్, డాలస్‌, హూస్టన్, చికాగోలో ఈ సమస్య ఉన్నట్లు పేర్కొంది.

* పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెండ్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల మార్క్‌ను దాటింది. బెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ సైతం 72 డాలర్లకు చేరింది. వాస్తవానికి ఇటీవల క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పతనమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిసైల్స్‌తో విరుచుకుపడింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆయిల్‌ సరఫరాపై పెను ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరింది. గత రెండుమూడు రోజుల్లో చమురు ధరలు 5శాతం వరకు పెరిగాయి. ఇరాన్‌ రోజుకు 1.5 మిలియన్‌ బ్యారెల్స్‌ ఉత్పత్తి చేస్తున్నది.

* ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో గిరాకీ పెరగడంతో బంగారం, వెండి ధరలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో గురువారం తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.200 వృద్ధి చెంది తిరిగి జీవిత కాల గరిష్టం రూ.78,300లకు చేరుకున్నది. మంగళవారం పది గ్రాముల బంగారం రూ.78,100 వద్ద ముగిసింది. మరోవైపు గురువారం కిలో వెండి ధర రూ.665 వృద్ధి చెంది రూ.93,165 వద్ద నిలిచింది. మంగళవారం కిలో వెండి ధర రూ.92,500 వద్ద స్థిర పడింది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.200 పుంజుకుని రూ.77,900 వద్ద ముగిస్తే మంగళవారం రూ.77,700 వద్ద స్థిర పడింది. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం బులియన్ మార్కెట్లకు సెలవు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ తులం బంగారం ధర రూ.440 తగ్గి రూ.75,950 వద్ద నిలిచింది. కిలో వెండి రూ.225 పెరిగి రూ.91,600 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 0.17 శాతం పతనమై 2665.20 డాలర్లు, ఔన్స్ వెండి 0.36 శాతం క్షీణించి 31.81 డాలర్లకు చేరుకున్నది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z