చర్లలో ఇటీవల జీపీఎస్ ట్రాకర్ ద్వారా సంచరించిన పక్షి ఎట్టకేలకు అటవీశాఖాధికారులకు గురువారం చిక్కింది. చర్లలోని నాయకకాలనీలోని ఏకలవ్య విద్యాలయం ప్రాంతంలోని గుట్ట సమీపంలోకి వచ్చిన పక్షి ఎటూ కదలకుండా ఉండటాన్ని గమనించిన స్థానికులు దానికి కోడి మాంసం పెట్టారు. తర్వాత ఎగిరి వెళ్లిపోయింది. అరుదైన రాబందు సంతతికి చెందిన ఈ పక్షికి జీపీఎస్ ట్రాకర్, కెమెరా ఉన్నట్లు భావించడంతో స్థానికంగా దీని సంచారం కలకలం రేపింది. ఈ పక్షి సంచారంపై నిఘా వర్గాలతో పాటు పోలీసులు కూపీ లాగారు. జీపీఎస్ ట్రాకర్‌తో ఉన్న ఈ పక్షి ఆచూకీ కోసం చర్ల, ములుగు జిల్లా వెంకటాపురం అటవీశాఖ బృందాలు అన్వేషించాయి. జీపీఎస్ ఆధారంగా ఈ పక్షి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. చర్ల మండలం తాలిపేరు పరీవాహక చినమిడిసిలేరు ప్రాంతంలో దీనిని పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది చర్లలోని కార్యాలయానికి తరలించారు. అత్యధిక దూరం ప్రయాణించి నీరసంగా ఉండటంతో ఈ పక్షికి తగిన ఫీడింగ్ ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతరించిపోతున్న ఈ రకం పక్షులు ఎక్కడ ఉన్నాయనే దాంతోనే ఈ పక్షికి జీపీఎస్ ట్రాకర్ ద్వారా పంపించి ఉంటారని అటవీక్షేత్రాధికారి ద్వాలియా తెలిపారు. ప్రస్తుతం ఈ పక్షి తమ సంరక్షణలోనే ఉందన్నారు. ఈ పక్షికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ పక్షిని అడవిలో వదిలేయాలా? లేక ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేర్చాలనేది ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z