* సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఒక మహిళా మంత్రిగా ఉండి, మరో మహిళ పేరు ప్రస్తావించడం, రాజకీయాలతో సంబంధం లేని అక్కినేని కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరైనది కాదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వరుస పోస్టులతో అసహనం వ్యక్తం చేశారు.
* భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని తమపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. ‘‘తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ (KTR) ప్రశ్నిస్తున్నారు. పదవీ కాంక్షతో కేసీఆర్‌ని కేటీఆరే ఏదో చేశారన్న ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సీఎం అనుకుని పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. భారాస ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయనే. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదు. ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారో తెలియదు. గజ్వేల్‌లో కేసీఆర్ కనిపించడంలేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో భాజపా, భారాస మధ్య చీకటి ఒప్పందం జరిగింది. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని.. భారాస నుంచి భాజపాకు క్రాస్ ఓటింగ్ జరిగింది’’ అని కొండా సురేఖ ఆరోపించారు.
* మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సినీ రంగంలోని వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. అనుకోకుండా తాను ఆ వ్యాఖ్యలు చేశాననని.. వాటిని ఉపసంహరించుకున్నట్లు సురేఖ చెప్పారన్నారు. ఈ ఘటనపై ఆమె ‘ఎక్స్’లో పోస్టు చేయడంతో పాటు మీడియాతోనూ చెప్పారని తెలిపారు. అందుకే సినీ ప్రముఖులు ఈ అంశానికి ముగింపు పలకాలని కోరారు. ఇరువైపులా మహిళలున్న విషయాన్ని గ్రహించాలని కోరారు. మహిళల పట్ల కేటీఆర్ అహంకార ధోరణిని ప్రశ్నించడమే కానీ.. ఎవరి మనోభావాల్నీ దెబ్బతీయడం ఉద్దేశం కాదని సురేఖ పేర్కొన్నట్లు చెప్పారు.
* ‘రోజా’,‘బొంబాయ్’ వంటి సినిమాలతో తెలుగులోనూ విశేష ప్రేక్షకాదరణ పొందిన తమిళ నటుడు అరవింద్ స్వామి (Arvind Swami). వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న ఆయన కెరీర్‌కు ఆరోగ్య సమస్యల కారణంగా బ్రేక్ పడింది. ఆ కష్టకాలాన్ని.. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘‘వెన్నెముకకు గాయం కావడంతో రెండేళ్లు బెడ్ రెస్ట్ తీసుకున్నా. తీవ్రమైన నొప్పితో బాధపడ్డా. అదే సమయంలో నా కాలికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. అరోగ్య సమస్యల రీత్యా 13 ఏళ్లపాటు ఒక్క సినిమాలో నటించలేదు. మళ్లీ నటించేందుకు ఎలాంటి ప్లానింగ్ చేసుకోలేదు. కానీ, దర్శకుడు మణిరత్నం నాకు అవకాశం ఇచ్చారు. అలా ‘కడల్’ (తెలుగులో కడలి)లో నటించా. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక నా సంతృప్తి కోసం రెండు హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నా’’ అని తెలిపారు.
* అక్కినేని కుటుంబం, నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె (Samantha) ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యధా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు.
* ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలను నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ. రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని ప్రారంభించి క్రీడాకారులందరికీ శిక్షణ ఇస్తామని తెలిపారు. చదువే కాదు.. క్రీడల్లో రాణించినా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. మతాలకు అతీతంగా దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడాకారులేనని సీఎం అన్నారు.
* మూసీలో ఆక్రమణల తొలగింపు అంశం రాజకీయ పార్టీల మధ్య కాక పుట్టిస్తోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అధికార.. విపక్ష నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. గురువారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. భద్రత లేకుండా మూసీ పరివాహక ప్రజల వద్దకు వెళదామని సవాల్ విసిరారు.
* ‘బొమ్మరిల్లు’తో తెలుగువారికి బాగా చేరువైన నటి జెనీలియా (Genelia). బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ (Riteish Deshmukh)తో వివాహం అనంతరం ఆమె ముంబయిలో సెటిలైన విషయం తెలిసిందే. ఈ జంటకు సినీ ప్రియుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తరచూ సరదా వీడియోలు చూస్తూ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా.. తన భర్త రితేశ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రితేశ్ చాలా సింపుల్, లవ్లీ పర్సన్ అన్నారు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఒకటన్నారు. డేటింగ్‌లో ఉన్నప్పుడు ఊహించని చర్యలతో ఆయన షాక్‌కు గురిచేసేవాడన్నారు. ‘‘మేము డేటింగ్‌లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. దానిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. రితేశ్‌కు ఆలస్యంగా నిద్రపోవడం అలవాటు. నేనేమో చాలా త్వరగా నిద్రలోకి జారుకుంటా. ఓరోజు ఏమైందో ఏమో తెలియదు.. అర్ధరాత్రి 1 గంటకు రితేశ్ నాకొక సందేశం పంపారు. ‘‘ఇక, అంతా అయిపోయింది’’ అంటూ అదొక బ్రేకప్ సందేశం. తెల్లవారుజామున ఆ సందేశం చూసి నేను షాకయ్యా. చాలా బాధగా అనిపించింది. ఏం జరిగిందో? ఆయన ఎందుకు ఇలా చెప్పారో? అర్థం కాక సతమతమయ్యా. నిద్రలేచిన తర్వాత తాను పంపిన సందేశం గురించి రితేశ్ పూర్తిగా మర్చిపోయారు. ఫోన్ చేసి ‘‘ఏం చేస్తున్నావు?’’ అని అడిగారు. నాకు కోపం వచ్చేసింది. ‘‘ఇకపై మనం మాట్లాడుకోకపోవడం మంచిది. నువ్వేం అనుకుంటున్నావు. ఏం జరగనట్లు అలా, ఎలా మాట్లాడుతున్నావు?’’ అని కేకలు వేశా. రాత్రి జరిగింది గుర్తు చేసుకుని.. తాను కేవలం జోక్‌గా ఆ సందేశం పంపినట్లు చెప్పారు’’ అని జెనీలియా తెలిపారు.
* నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. 15శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవలరంగంలో వృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
* పశ్చిమాసియాలో మొదలైన తీవ్ర ఘర్షణలు ఏస్థాయికి చేరతాయోనని ప్రపంచమంతా తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇరాన్ (Iran) కీలక నేతలనూ అంతమొందించాలన్న అంశంపై ఇజ్రాయెల్ (Israel) భద్రతా క్యాబినెట్‌లో చర్చ జరిగిందని, ఆ జాబితాలో సుప్రీం నేత అయాతుల్లా ఖమేనీతో పాటు రివల్యూషనరీ దళంలోని కీలక కమాండర్ల పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
* తిరుమల లడ్డూ (Tirumala Laddu) వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది. ధర్మాసనం మరో కేసులో బిజీగా ఉన్నందున ఇవాళ జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు తీసుకోవాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ..ధర్మాసనాన్ని కోరారు.
* అమెరికా (USA) ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) భర్త డగ్లస్ ఎమ్‌హోఫ్ (Douglas Emhoff).. తన మాజీ ప్రియురాలిని నాడు చెంపదెబ్బ కొట్టినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. మరో వ్యక్తిని ఆకర్షించేందుకు ఆమె ప్రయత్నించడమే అందుకు కారణంగా తెలుస్తోంది. సదరు మహిళా స్నేహితురాలు ఒకరిని ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z