Business

అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్-BusinessNews-Oct 04 2024

అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్-BusinessNews-Oct 04 2024

* గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్ తెలిపారు. ద.మ.రైల్వే పరిధిలో ప్రస్తుతం రూ.21 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయన్నారు. విజయవాడలోని రైల్వే ఈటీటీసీ కేంద్రంలో ఏపీలో రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులపై కేంద్రమంత్రి పెమ్మసాని, తెదేపా ఎంపీలు కేశినేని శివనాథ్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పంచలింగాల నాగరాజుతో అరుణ్‌కుమార్‌ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. విజయవాడ రైల్వే స్టేషన్‌ను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటివరకు 257 ఆర్‌యూబీలను తొలగించాం. రైళ్లు ఢీ కొట్టకుండా ఏపీలో నిర్ణీత కిలోమీటర్ల మేర కవచ్‌ను అమలు చేస్తున్నాం. గతేడాది 35 రైళ్లు ప్రవేశపెట్టగా, వాటిలో 6 వందేభారత్ రైళ్లున్నాయి. 2024-25 రైల్వే బడ్జెట్‌లో ద.మ.రైల్వేకి రూ.9,154 కోట్లు మంజూరయ్యాయి. రాజధాని అమరావతి కోసం ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు – రైల్వే లైన్ సర్వే పూర్తైంది. రైల్వే బోర్డు ఆమోదం తెలిపి, నిధులు కేటాయించగానే కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తాం.

* ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందిపెడుతున్న స్విగ్గీపై హోటల్‌, రెస్టరంట్‌ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ‘‘స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టరంట్లకు నష్టం జరుగుతోంది. ఈ రెండు సంస్థల యాజమాన్యాలతో గతంలో చర్చలు జరిపాం. మా అభ్యంతరాలను జొమాటో మాత్రమే అంగీకరించింది’’ అని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్‌వీ స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు తెలిపారు.

* ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ (Apple) భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. త్వరలోనే మరో నాలుగు యాపిల్‌ రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించింది. భారత్‌లో ఐఫోన్‌16 సిరీస్‌ తయారీ గురించి ఈసందర్భంగా ప్రస్తావించింది. భారత్‌లో తమ స్టోర్లను పెంచడంపై యాపిల్‌ రిటైల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డీర్‌డ్రే ఓబ్రియన్‌ ఆనందం వ్యక్తంచేశారు. బెంగళూరు, పుణె, దిల్లీ-ఎన్సీఆర్‌, ముంబయిలో కొత్త స్టోర్లు తీసుకొస్తున్నట్లు ఈసందర్భంగా ఆయన వెల్లడించారు. ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్ల ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించినట్లు యాపిల్‌ వెల్లడించింది. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఐఫోన్‌ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్‌ మోడళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఎగుమతులు చేయనున్నట్లు పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో 25శాతం ఐఫోన్ల ఉత్పత్తి భారత్‌లోనే చేయాలని యాపిల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

* భారత్‌లో జావా, యెజ్డీ, బీఎస్‌ఏ మోటార్‌ సైకిళ్లను 4 ఏళ్ల క్రితం పునఃప్రారంభించిన క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..ప్రీమియం మోటార్‌ సైకిల్‌ విభాగంలో తన విక్రయాలను గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ‘అనుపమ్‌ థరేజా’ తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ భారత్‌లో నెలవారీగా 4-5 వేల మోటార్‌ సైకిళ్లను విక్రయిస్తోంది. రాబోయే 12 నెలల్లో ఒక లక్ష మోటార్‌ సైకిళ్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

* ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల వల్ల సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. దిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్‌ సదస్సుల్లో పాల్గొన్న ఆమె.. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అసమానతలు తగ్గడంతో పాటు గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. కనిష్ఠాల వద్ద కొనుగోళ్లతో సూచీలు రాణించాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో వరసగా ఐదో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధ భయాలు, చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, విదేశీ మదుపర్ల సంపద తరలిపోవడం వంటివి సూచీల పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రిలయన్స్‌తో పాటు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడేశాయి. ఐటీ స్టాక్స్‌ రాణించాయి. సెన్సెక్స్‌ ఉదయం 82,244.25 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,497.10) నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే కోలుకుంది. ఓ దశలో దాదాపు 800 పాయింట్ల లాభపడి 83,368.32 వద్ద గరిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ పతనం మొదలైంది. ఇంట్రాడేలో 81,532.68 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 808.65 పాయింట్లు నష్టపోయి 81,688 వద్ద సెన్సెక్స్‌ ముగిసింది. నిఫ్టీ సైతం ఓ దశలో 25వేల పాయింట్లకు దిగువకు చేరింది. చివరికి 200.25 పాయింట్ల నష్టంతో 25,049.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.97గా ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z