* ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు సిట్రోన్ (Citroen), జీప్ (Jeep) దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు స్పెషల్ ఆఫర్లు ప్రకటించాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి 31 వరకూ ఫెస్టివ్ క్యాంపెయిన్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లలో స్పెషల్ సర్వీసులు, డిస్కౌంట్లు, సేల్స్ తర్వాత సర్వీసులపై ఎక్స్ క్లూజివ్ డిస్కౌంట్లు ఉన్నాయి. సిట్రోన్ ఇండియా ఫ్రీ ఫెస్టివ్ చెకప్స్ ఆఫర్ చేసింది. ఫెస్టివ్ కేర్ కార్నివాల్‌లో భాగంగా కార్ కేర్ ట్రీట్ మెంట్‌పై లేబర్ చార్జీల్లో 15 శాతం రాయితీ, సెలెక్టెడ్ యాక్సెసరీలపై 50 శాతం, సెలెక్టెడ్ మర్చండైజ్ పై 30 శాతం వరకూ రాయితీ అందిస్తుంది. నాలుగు టైర్ల రీప్లేస్ మెంట్ తోపాటు ప్రతి కొనుగోలుపై రూ.1000 మర్చండైజ్ యాక్సెసరీస్ కూపన్ అందిస్తోంది.
* ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి షేర్ మార్కెట్ సెగ తగిలింది. భారత్‌లో అత్యంత విలువైన సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని షేర్లు భారీగా పతనమవడంతో భారీ నష్టాన్ని చవిచూసింది. షేర్ మార్కెట్‌లో అమ్మకాల జోరుతో కేవలం నాలుగు రోజుల్లోనే కంపెనీ రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. కొద్ది రోజుల క్రితం రూ. 20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ అక్టోబర్ 4 నాటికి రూ.18.76 లక్షల కోట్లకు తగ్గింది. శుక్రవారం కంపెనీ షేరు ధర రూ.42.45(1.51%) తగ్గింది.
* 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సిమెంట్ డిమాండ్ 5 శాతం పెరుగుతుందని, రాబోయే నెలల్లో కంపెనీలు మరికొన్ని సార్లు సిమెంట్ ధరలను పెంచే అవకాశముందని Centrum నివేదిక తెలిపింది. సాధారణ ఎన్నికల తర్వాత ప్రభుత్వ వ్యయం ఆలస్యం కావడం, రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం అధికంగా ఉండడం, దీనివల్ల దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు రావడంతో పాటు అనేక అంశాలు డిమాండ్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. వార్షిక ప్రాతిపదికన సిమెంట్ డిమాండ్ 5-6 శాతం తగ్గింది. అయితే, ఇటీవల సిమెంట్ కంపెనీల సామర్థ్య విస్తరణతో, ఈ నివేదిక 2.70 శాతం వృద్ధిని అంచనా వేసింది. దక్షిణ భారతదేశంలో డిమాండ్‌లో ఏకీకరణ, ఉత్తర భారతంలో అధిక వినియోగం వల్ల 2024-25 ఆర్థిక సంవత్సరం 3,4 త్రైమాసికాల్లో సిమెంట్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని నివేదిక పేర్కొంది. డిమాండ్ పునరుద్ధరణ, ధరల పెంపుతో సిమెంట్ కంపెనీలు మిగిలిన అర్ధ సంవత్సరం మెరుగైన ఆదాయ వృద్ధి చూపుతాయని Centrum నివేదిక తెలిపింది.
* దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో సాంకేతిక సమస్య తలెత్తింది (massive system slowdown). దీంతో దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. చెక్-ఇన్ ప్రక్రియలు (slower check-ins) నెమ్మదిగా సాగడంతో పాటు, టికెట్ బుకింగ్‌లలో సైతం సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో చెక్-ఇన్ కోసం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది. ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపంపై ఇండిగో స్పందించింది. తమ నెట్‌వర్క్‌లు అన్నింటిలోనూ తాత్కాలికంగా వ్యవస్థలు నెమ్మదించాయని తెలిపింది. దీని ప్రభావం వెబ్‌సైట్, బుకింగ్ సిస్టమ్‌పై పడిందని పేర్కొంది. చెక్-ఇన్‌లు ఆలస్యంగా జరుగుతున్నట్లు తెలిపింది. దీంతో రద్దీ పెరిగే అవకాశం ఉందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను అందించేందుకు తమ ఎయిర్‌పోర్ట్ బృందం కృషి చేస్తోందని వెల్లడించింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇండిగో స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. మరోవైపు ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న సమస్య నేపథ్యంలో తమకు కలిగిన అసౌకర్యాన్ని పలువురు కస్టమర్ల సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు.
* భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గత నెల 27తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 12.5 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 704.89 బిలియన్ డాలర్లకు చేరాయి. ఒకవైపు మధ్య ప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పెరగడం గమనార్హం. సెప్టెంబర్ 27తో ముగిసిన వారానికి గత ఏడాది కాలంలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 113 బిలియన్ డాలర్లు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. ఒకవారంలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 12.5 బిలియన్ డాలర్లు వృద్ధి చెందడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ జీడీపీ కంటే భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు మూడు రెట్లు.
* ఇటీవల కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తున్న స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్‌కు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు తమ ముందు హాజరు కావాలని పేర్కొంది. సెబీ చైర్ పర్సన్ తోపాటు టెలికం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీకి సమన్లు జారీ చేసింది. కేంద్ర ఆర్థికశాఖలోని ఎకనమిక్ ఎఫైర్స్ విభాగం, టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఉన్నతాధికారులను విచారణకు హాజరు కావాలని పీఏసీ ఆదేశించింది. అయితే సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్, ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ ప్రతినిధులు మాత్రమే పీఏసీ ముందు విచారణకు హాజరవుతారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ కమిటీలు సమన్లు జారీ చేసినప్పుడు నియంత్రణ సంస్థల అధిపతులు హాజరు కావాలని పార్లమెంటరీ వ్యవహారాల్లో సంప్రదాయం గురించి పేర్కొనలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
* అందమైన కరేబియన్ ద్వీప దేశం డొమినికా తమ దేశ పాస్‌పోర్ట్‌లను అమ్మకానికి పెట్టింది. ఏడేళ్ల క్రితం మారియా హరికేన్ విధ్వంసంతో దెబ్బతిన్న ఈ ఐలాండ్ పునర్నిర్మాణానికి విభిన్న రీతిలో నిధుల సమీకరణ చేపడుతోందని ‘వాషింగ్‌టన్ పోస్ట్’ పేర్కొంది. ప్రపంచంలోనే వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచిన అత్యంత దృఢమైన ద్వీపంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కరేబియన్ దేశం.. ఇందుకోసం భారీ అప్పులు చేయకుండా, సంపన్న దేశాల సహాయం కోసం ఎదురుచూడకుండా నిధులు సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని సంపన్నులకు పాస్‌పోర్ట్‌ల ద్వారా తమ దేశ పౌరసత్వాన్ని విక్రయిస్తోంది. ఆ దేశ పౌరసత్వ ప్రదాన కార్యక్రమం 90ల నాటి నుంచే ఉన్నప్పటికీ హరికేన్ తర్వాత వేగంగా విస్తరించింది. ఇదే దేశ ఆదాయానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నిధులను కొత్త మెడికల్ క్లినిక్‌లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వినియోగిస్తున్నారు. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిన్ బారన్ ఈ చొరవను ఆపద్బాంధవిగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఈ కార్యక్రమం తమకు “స్వయం-స్వతంత్ర ఫైనాన్సింగ్”గా ఉపయోగపడుతోందని ఆర్థిక మంత్రి ఇర్వింగ్ మెక్‌ఇన్‌టైర్ చెబుతున్నారు. ఈ పౌరసత్వ కార్యక్రమం విజయవంతం అయినప్పటికీ, పారదర్శకత, భద్రతా సమస్యలపై ఆందోళనలను పెంచింది. ఈ దేశ పౌరసత్వ కనీస ధర ఇటీవలే 2 లక్షల డాలర్లకు (రూ. 1.68 కోట్లు) పెరిగింది. అయినప్పటికీ ఇదే ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన ఎంపికలలో ఒకటిగా ఉంది. 71,000 జనాభా కలిగిన ఒక చిన్న ద్వీపంలో పౌరసత్వాన్ని పొందినవారిలో కొంతమంది ఇక్కడ నివసిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z