Business

ఇండియాలో బోయింగ్ 737 విమానాలకు హెచ్చరిక-BusinessNews-Oct 07 2024

ఇండియాలో బోయింగ్ 737 విమానాలకు హెచ్చరిక-BusinessNews-Oct 07 2024

* విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు (Ola Electric shares) మరోసారి పతనమయ్యాయి. ఇటీవల స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన ఈ కంపెనీ.. గరిష్ఠ స్థాయిల నుంచి దాదాపు 43 శాతం క్షీణించింది. కంపెనీ సేవలపై ఇటీవల సోషల్‌మీడియాలో వస్తున్న ఫిర్యాదులు దీనికి కారణమయ్యాయి. సోమవారం సైతం ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేరు 8 శాతం మేర క్షీణించి రూ.90.37 వద్ద ట్రేడవుతున్నాయి. తాజా పతనానికి కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌, ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా మధ్య సోషల్‌మీడియాలో నడిచిన వివాదమే కారణమని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

* విధుల్లో ఉండగా తన డెలివరీ ఏజెంట్లకు ఎదురవుతోన్న ఇబ్బందులను తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగిన జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ (Zomato CEO Deepinder Goyal)కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకోవడానికి ఆయన స్వయంగా గురుగ్రామ్‌లోని ఒక మాల్‌లోకి వెళ్లగా.. లిఫ్ట్‌ కాకుండా మెట్లు ఎక్కాలంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది సూచించారు. దాంతో ఆయన మూడు అంతస్తులు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆర్డర్ కలెక్ట్ చేసుకునేప్పుడు కూడా మెట్ల ద్వారం వద్దే ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురైందంటూ తన అనుభవాన్ని గోయల్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు సదరు మాల్‌ స్పందించింది. డెలివరీ సిబ్బంది కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పికప్ పాయింట్‌ ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

* హీరో గ్రూపునకు చెందిన విడిభాగాల తయారీ సంస్థ హీరో మోటార్స్‌ (Hero Motors) ఐపీఓ (IPO) ఆలోచనను విరమించుకుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.900 కోట్లు సమీకరించాలని తొలుత నిర్ణయించుకున్న ఆ కంపెనీ.. ఐపీఓ పత్రాలను ఉపసంహరించుకుంటున్నట్లు సెబీకి వెల్లడించింది. ఇందుకు గల కారణం ఏంటన్నది మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఆగస్టులో సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం.. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా కొత్తగా రూ.500 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయాలనుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. మరో రూ.400 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయానికి ఉంచాలని నిర్ణయించారు. ప్రమోటర్లు ఓపీ ముంజల్‌ రూ.250 కోట్ల విలువైన షేర్లను, ఇతర ప్రమోటర్లయిన భాగ్యోదయ్‌, హీరో సైకిల్స్‌ రూ.75 కోట్ల విలువైన షేర్లను విక్రయించాలని నిర్ణయించారు.

* ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) తన వీడియో స్ట్రీమింగ్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ను (MX player) కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీన్ని తమ ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మినీటీవీలో (Amazon miniTV) విలీనం చేసి అమెజాన్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌గా తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రీమియం కంటెంట్‌ను అందించనున్నట్లు అమెజాన్‌ ఈ సందర్భంగా తెలిపింది.

* భారత్‌లోని కొన్ని వైమానిక సంస్థలు వాడుతున్న బోయింగ్‌ 737 మోడల్‌ విమానాల్లో రడ్డర్‌ వ్యవస్థ (వెనకభాగంలో ఉండే ఓ పరికరం) మొరాయిస్తున్నట్లు డీజీసీఏ హెచ్చరించింది. ఇది బోయింగ్‌లోని అన్నిరకాల 737 మోడల్స్‌కు వర్తిస్తుందని పేర్కొంది. భారత్‌లో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌ జెట్‌, ఆకాశా ఎయిర్‌ ఈ సిరీస్‌ విమానాలను వినియోగిస్తున్నాయి. అంతేకాదు.. ప్రభుత్వంలోని వీఐపీలు కూడా వీటిని వినియోగిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ విమానయాన సంస్థలు కచ్చితంగా సేఫ్టీ రిస్క్‌ పరీక్షలు నిర్వహించుకోవాలని డీజీసీఏ సూచించింది. ‘‘రడ్డర్‌ కంట్రోల్‌ వ్యవస్థ జామవుతున్న విషయాన్ని అన్ని విమానాల సిబ్బందికి సర్క్యూలర్‌ ద్వారా తెలియజేయాలి. వీటికోసం తీసుకోవాల్సిన చర్యలను కచ్చితంగా వెల్లడించాలి’’ అని డీజీసీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. విమానాలను గాల్లో స్థిరంగా ఉంచేందుకు రడ్డర్‌ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది తోకభాగంలో నిలువుగా ఉంటుంది. భారత వాయుసేన కూడా 737 శ్రేణి విమానాలను వినియోగిస్తున్నాయి. దాని వీఐపీ స్క్వాడ్రన్‌లోను ఇవి ఉన్నాయి. ప్రధాని వినియోగించే విమానం కూడా 737 రకమే.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఐటీ స్టాక్స్‌ అండతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. తీవ్ర ఒడుదొడుకుల మధ్య ఆరంభ లాభాలు కోల్పోయి వరుసగా ఆరో రోజూ నష్టపోయాయి. ముఖ్యంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పతనమయ్యాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడే సెన్సెక్స్‌ 900 పాయింట్ల మేర పతనం కాగా.. నిఫ్టీ 24,800 స్థాయికి చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 81,926.99 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,688.45) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,137.77 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 80,726.06 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 638.45 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 218.85 పాయింట్ల నష్టంతో 24,795.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.99గా ఉంది.

* దేశంలో తమ సిమెంట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు అదానీ గ్రూప్‌ (Adani group) సిద్ధమైంది. జర్మనీకి చెందిన హైడెల్‌బర్గ్‌ మెటీరియల్స్‌ ఇండియన్‌ యూనిట్‌ హైడెల్‌బెర్గ్‌ సిమెంట్‌ ఇండియాను (HeidelbergCement India) కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్‌ కంపెనీ అయిన అంబుజా సిమెంట్‌ ద్వారా రూ.10వేల కోట్లకు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z