Health

అమెరికాదే వైద్యశాస్త్ర నోబెల్-NewsRoundup-Oct 07 2024

అమెరికాదే వైద్యశాస్త్ర నోబెల్-NewsRoundup-Oct 07 2024

* హిమాచల్‌లోని భారత్‌-చైనా సరిహద్దులో డ్రోన్లు కలకలం రేపాయి. రాష్ట్రంలోని కిన్నూర్‌ జిల్లాలో ఇటీవల కనిపించిన డ్రోన్లు చైనాకు చెందినవిగా ప్రభుత్వం భావిస్తోంది. నిఘా, గూఢచర్యం కోసమే చైనా వీటిని ఉపయోగిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జగత్‌సింగ్‌ నేగీ అనుమానం వ్యక్తం చేశారు. సరిహద్దు వెంబడి ఉన్న షిప్కీ లా, రిషి డోగ్రీ గ్రామాల్లో డ్రోన్ల కదలికలు ఇటీవల ఎక్కువైనట్లు మంత్రి జగత్‌సింగ్‌ పేర్కొన్నారు. గత వారం రోజులుగా ఇటువంటి డ్రోన్లు గుర్తించామని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. వాస్తవాధీన రేఖ (LAC) వెంట రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఈ క్రమంలో నిఘా, గూఢచర్యాన్ని తోసిపుచ్చలేమన్నారు. వీటి కదలికలను పోలీసులతో పాటు సైన్యం కూడా గుర్తించిందన్నారు.

* క్వాంటాస్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ QF59 ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడాకు బయల్దేరింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు చాలా మందే ఉన్నారు. వారందరి కోసం ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఓ చిత్రాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. అది ‘అడల్ట్‌ కంటెంట్’ కావడంతో ప్రయాణికుల్లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బ్రాడ్‌కాస్ట్‌ను తమకు అవసరం లేదని ఆపేద్దామని ప్రయత్నించినా కుదరలేదు. దీనికి సాంకేతిక సమస్యే కారణమని గుర్తించిన ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది కొంతసేపటి తర్వాత దాన్ని నిలిపివేశారు.

* వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం (The Nobel Prize 2024) వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్ర్కిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం లభించింది.

* వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగాను విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌లకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం (The Nobel Prize 2024) వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్ర్కిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం లభించింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. వీరిద్దరూ అమెరికాకు చెందినవారే కావడం విశేషం.

* కర్ణాటకలో అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్‌ అలీ (52) శవమై తేలారు. నిన్నటినుంచి దాదాపు 12 గంటల పాటు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులు.. సోమవారం అతడి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్‌ బవ సోదరుడు కావడం గమనార్హం. బీఎం ముంతాజ్‌ అలీ ఆదివారం ఉదయం అదృశ్యమైన ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ధ్వంసమైన అతడి కారును కుల్లూరు వంతెన సమీపంలో వదిలివెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తంచేశారు. అయితే, అతడి ఆచూకీ కోసం 12 గంటలుగా శ్రమించి చివరకు ఫాల్గుణి నది ముఖద్వారం వద్ద అతడి మృతదేహాన్ని గుర్తించారు. ప్రముఖ వ్యాపారిగానే కాకుండా అతడు మిస్బా గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌ ఛైర్మన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

* మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై (konda surekha comments on nagarjuna family) సినీ నటుడు నాగార్జున (Nagarjuna) వేసిన క్రిమినల్‌ పరువునష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

* త్వరలో తెదేపాలో చేరతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తెలిపారు. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో తీగల కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, తెదేపా వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో తెదేపా అభిమానులు చాలా మంది ఉన్నారని చెప్పారు.

* అలయ్-బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమమని.. అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దసరా సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే ‘అలయ్‍-బలయ్‍’ (Alai Balai) కార్యక్రమానికి సంబంధించి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే అలయ్‌-బలయ్‌ ఏర్పాట్లపైన కమిటీతో చర్చించి పలు సూచనలు చేశారు.

* గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన పసికందు కిడ్నాపర్ల నుంచి సురక్షితంగా బయటపడింది. మగశిశవును అపహరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గోరంట్లకు చెందిన నసీమా అనే మహిళ ఆదివారం రాత్రి కాన్పుకోసం ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి 1 గంటకు మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును అపహరించుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.

* భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ఎంతో ఆలోచించిన తర్వాత జిమ్నాస్టిక్స్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, కానీ వీడ్కోలు కెరీర్‌కు ముగింపు పలకడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది.

* పారిస్‌ ఒలింపిక్స్‌లో డబుల్‌ పతకాలతో అదరగొట్టిన యువ షూటర్‌ మను బాకర్‌ (Manu bhaker)తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను అసలు షూటర్‌ అవుతానని అనుకోలేదని పేర్కొంది. తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన మను.. టోక్యో ఒలింపిక్స్‌లో పలు సందర్భాల్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. ‘మొదట్లో కెరీర్‌పై స్పష్టత ఉండేది కాదు. ఎప్పుడూ విభిన్నమైన వాటిని ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని, భిన్నమైన క్రీడలపై ఆసక్తి చూపించేదాన్ని. కానీ జీవితంలో నేను కోరుకునేది ఒక్కటే.. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకోవడం. ఏదైనా మంచి పని చేయాలనుకోవడం. పోటీని ఎదుర్కోవడం అంటే నాకు ఇష్టం. అలా షూటింగ్‌పై ఆసక్తి పెంచుకొని.. దాన్నే నేర్చుకున్నా’’ అని చెప్పుకొచ్చింది. మిగతా వారి కంటే ఎప్పుడూ ఉత్తమంగా రాణించాలనుకోవడం, గెలుపు కోసం కాకుండా.. మెరుగైన ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టేదాన్నని ఈ సందర్భంగా తెలిపింది.

* రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అపోహలు సృష్టిస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే తప్ప.. తమకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. 2014 నుంచి 2023 మధ్య కాలంలో హైదరాబాద్‌, చుట్టు పక్క ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులతో కలిసి భట్టి వివరించారు.

* అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth)పై దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ (KS Ravikumar) ఆరోపణలు చేశారు. తమ కాంబోలో వచ్చిన ‘లింగ’ (linga) ఎడిటింగ్‌లో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారని అన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్‌ ఆ సినిమా పరాజయం గురించి మాట్లాడారు. ‘‘ఎడిటింగ్‌ విషయంలో రజనీకాంత్‌ జోక్యం చేసుకున్నారు. సీజేఐ (కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌)కు నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని ఆయన మార్చేశారు. అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తొలగించేశారు. కృతిమంగా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ యాడ్‌ చేశారు. ‘లింగ’ను గందరగోళం చేశారు’’ అని రవికుమార్‌ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

* శ్రీవేంకటేశ్వర స్వామివారి గరుడ సేవకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8న మలయప్పస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల కొండపైకి ఎక్కువ వాహనాలు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గరుడ సేవకు ఏపీఎస్‌ఆర్టీసీ 400కిపైగా బస్సులు ఏర్పాటు చేసిందని.. 3 వేల ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

* రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. దిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. దాదాపు గంటపాటు ప్రధాని, చంద్రబాబు మధ్య చర్చలు జరిగాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z