Business

లాభాల్లో భారత స్టాక్ మార్కెట్-BusinessNews-Oct 08 2024

లాభాల్లో భారత స్టాక్ మార్కెట్-BusinessNews-Oct 08 2024

* విద్యుత్‌ వాహన తయారీ సంస్థ బీవైడీ ఇండియా (BYD India) దేశీయంగా మరో విద్యుత్‌ కారును లాంచ్‌ చేసింది. గతంలో తీసుకొచ్చిన బీవైడీ ఈ6కి కొనసాగింపుగా ఈమ్యాక్స్ 7 (BYD eMax 7) ఎంపీవీని లాంచ్‌ చేసింది. దీని ధర రూ.26.90 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హై ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.29.90 లక్షలుగా (ఎక్స్‌-షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. ప్రీమియం, సుపీరియర్‌ వేరియంట్లలో లభిస్తుంది. రెండు వేరియంట్లలోనూ 6, 7 సీట్ల ఆప్షన్‌ను అందిస్తోంది. ప్రీమియం వేరియంట్‌లో 55.4 కిలో వాట్‌అవర్‌ బ్యాటరీని అమర్చారు. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 420 కిలోమీటర్లు దూరం వెళుతుంది. సుపీరియర్‌ వేరియంట్‌ 71.8 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో వస్తోంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రీమియం వేరియంట్‌ 163 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.6 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. రెండు మోడళ్ల టాప్‌ స్పీడ్‌ 180 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది.

* జాతీయ రహదారుల వెంబడి మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. హైవేలపై ప్రయాణించే వారికి స్వచ్ఛమైన టాయిలెట్లు, బేబీ కేర్‌ రూమ్స్‌ వంటి సౌకర్యాలు లభించనున్నాయి. దీనికోసం ఉద్దేశించిన హంసఫర్‌ పాలసీని (Humsafar Policy) కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభించారు. ఈ పాలసీ ప్రకారం పెట్రోల్‌ పంపుల వద్ద టాయిలెట్లతో పాటు వీల్‌ఛైర్లు, ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, పార్కింగ్‌, డార్మిటరీ, ఫుడ్‌ కోర్టు, ఏటీఎం, వాహనాల రిపేరింగ్‌ షాప్‌, ఫార్మసీ వంటివి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయంటూ ఆ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, క్రూడాయిల్‌ ధరలు, చైనా ఉద్దీపన చర్యల వంటి పరిణామాలతో ఆరు రోజులగా వరుస నష్టాలు చవిచూసిన సూచీలు.. తిరిగి లాభాల బాటపట్టాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ వంటి ప్రధాన స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 600 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 25 వేల మార్కును అందుకుంది. రేపటి ఆర్‌బీఐ పరపతి విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెన్సెక్స్‌ ఉదయం 80,826.56 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,050.00) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభాల బాట పట్టింది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 81,763.28 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 584.81 పాయింట్ల లాభంతో 81,634.81 వద్ద ముగిసింది. నిఫ్టీ 217.40 పాయింట్ల లాభంతో 25,013.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.96గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79.33 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2660 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI)లో కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. మొన్నటి వరకు కంపెనీ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించిన మిరా మురాటి (Mira Murati) రాజీనామా చేయగా.. తాజాగా ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తిస్తున్న టిమ్‌ బ్రూక్స్‌ (Tim Brooks) తన పదవినుంచి వైదొలిగారు. ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించి గూగుల్‌ డీప్‌మైండ్‌లో చేరారు. ఓపెన్‌ఏఐ నుంచి వైదొలగుతున్నట్లు టిమ్‌ బ్రూక్స్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. వీడియో జనరేషన్‌ సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకు గూగుల్‌ డీప్‌మైండ్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. గూగుల్‌లో పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు. ‘‘సోరాను తీసుకురావడం కోసం ఓపెన్‌ఏఐలో రెండేళ్లు విధులు నిర్వహించాను. అది చాలా అద్భుతమైన అనుభవం. నాతో పనిచేసిన వారందికీ ధన్యవాదాలు’’ అంటూ టిమ్‌ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. డీప్‌మైండ్‌ సీఈఓ డెమిస్‌ హస్సాబిస్‌.. టిమ్‌ను సంస్థలోకి స్వాగతించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z