Devotional

భక్తజనులతో పోటెత్తిన తిరుమల-NewsRoundup-Oct 08 2024

భక్తజనులతో పోటెత్తిన తిరుమల-NewsRoundup-Oct 08 2024

* ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టడుకుతుంది. ఈ ఘర్షణలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఈక్రమంలో ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ ఓల్మెర్ట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముంగించాలనే పిలుపునకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇస్తారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

* రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు వరుస సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయిన చంద్రబాబు.. తాజాగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు.

* పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం డంపింగ్‌ యార్డు దగ్గర జరిగిన అఘాయిత్యం గురించి తెలిసి చాలా బాధ కలిగిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని, లేదంటే నిందితుడుఇ తప్పించుకోవడానికి ఆస్కారం కలిగేదని అన్నారు.

* తన కుటుంబంతో పాటు, కుమారుడు నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున (Nagarjuna) నాంపల్లి కోర్టుకు తెలిపారు. రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావించారు.

* భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ బహుమతి లభించింది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఆర్టిఫిషియల్‌ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్‌ ఆవిష్కరణలకు గానూ ఈ అత్యున్నత పురస్కారం వరించింది. స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది.

* హరియాణా (Haryana)లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. ఎన్నికల ఫలితాల్లో భాజపా (BJP) దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసిన కాషాయ పార్టీ.. ముఖ్యమంత్రి (CM) ఎవరనే అంశంపై కసరత్తు మెదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సారి కూడా నాయబ్‌ సింగ్‌ సైనీనే (Nayab Singh Saini) హరియాణా సీఎంగా కొనసాగనున్నట్లు సమాచారం. ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలుండగా.. ఇప్పటివరకు జరిగిన లెక్కింపుల్లో భాజపా మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. 49 చోట్ల కాషాయ పార్టీ విజయం సాధించగా.. 36 స్థానాలను మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకుంది. సీఎం నాయబ్‌ సింగ్‌ నేతృత్వంలో హరియాణాలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు భాజపా సిద్ధమైంది.

* హరియాణా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని అంశాలు స్పష్టంగా తెలిశాయన్నారు. 2029లో భాజపా, కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌కు దూరంగా ఉంటాయని.. తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దశాబ్దం, అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగొచ్చు అంటూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు.

* 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల (70th National Film Awards) ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరుగుతోంది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. పురస్కారాలు అందజేస్తున్నారు. 2022కి గానూ కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి (కాంతార), ఉత్తమ నటిగా నిత్యా మేనన్‌ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌) సత్తా చాటారు. ఉత్తమ చిత్రంగా ‘ఆట్టమ్‌’ (మలయాళం), తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ నిలిచిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’ దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు.

* అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2: The Rule). బన్ని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ను చిత్ర బృందం పంచుకుంది. ‘‘పుష్ప2’ ప్రథమార్ధం ఫుల్‌ ఫైర్‌తో పూర్తయింది. ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద తుపాను సృష్టించి చరిత్రను లిఖించడానికి పుష్ప వస్తున్నాడు. భారతీయ సినిమాకు ఇదొక కొత్త అధ్యాయం. డిసెంబరు 6, 2024 పుష్ప: ది రూల్‌’’ అంటూ పేర్కొంది.

* కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ నేపథ్యంలో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిశాయి. గరుడ వాహన సేవను వీక్షించేందుకు భక్త జనం భారీగా తరలివస్తున్నారు. మాడ వీధుల్లోని 231 గ్యాలరీలు నిండిపోయాయి. దీంతో శిలా తోరణం కూడలి నుంచి క్యూలైన్‌లోకి ప్రవేశించాలని తితిదే అధికారులు కోరుతున్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తజనం గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి. గరుడోత్సవంలో భాగంగా సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీమలయప్పస్వామి మాడవీధుల్లో విహరించనున్నారు. సుమారు 3.5 లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు ఆస్కారం ఉంది. గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, గరుడ వాహన సేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. గరుడ సేవకు 400లకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిన అధికారులు.. 3వేల ట్రిప్పులు నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z