* ఎస్‌బీఐ కార్డ్ తమ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నియమాలలో రెండు పెద్ద మార్పులను చేసింది. నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎక్కువైంది. చాలా మంది ఇప్పుడు విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నయితే ఇది త్వరలో కొంచెం ఖరీదైనది కావచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లించడం కొంతమంది కస్టమర్లకు ఖరీదైనదిగా మారనుంది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. శౌర్య/డిఫెన్స్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌ల ఫైనాన్స్ ఛార్జీలో కూడా ఎస్‌బీఐ కార్డ్ కొన్ని మార్పులు చేసింది. ఆయా కార్డులపై 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జీ విధించనుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఇక్కడ అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్‌లు అంటే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదా పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేనివి.
* దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ప్రారంభ లాభాలను కోల్పోయి ప్రతికూలంగా తిరోగమించాయి. సెన్సెక్స్ 167.71 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టపోయి 81,467.10 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 82,319.21 – 81,342.89 స్థాయిల శ్రేణిలో ట్రేడైంది. సెన్సెక్స్‌ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ కూడా 31.20 పాయింట్లు లేదా 0.12 శాతం తగ్గి 24,981.95 వద్దకు పడిపోయింది. బుధవారం ఇది 25,234.05 – 24,947.70 రేంజ్‌లో చలించింది. నిఫ్టీ50 ఇండెక్స్‌లోని 50 స్టాక్స్‌లో సిప్లా, ట్రెంట్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , టెక్ మహీంద్రా నేతృత్వంలోని 31 స్టాక్స్ గ్రీన్‌లో ముగిసి 2.58 శాతం వరకు పెరిగాయి. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఒఎన్‌జీసీ, హిందుస్తాన్ యూనిలీవర్ 19 స్టాక్‌లలో దిగువన ముగిశాయి.
* దసరా నవరాత్రలు, దీపావళి పండుగ వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు భారీ శుభవార్త. దేశంలో పసిడి, వెండి ధరలు ఈరోజు (అక్టోబర్ 9) భారీగా తగ్గాయి. నిన్నటి రోజున నిలకడగా అంతకుక్రితం రోజున స్వల్పంగా తగ్గిన బంగారం నేడు గణనీయంగా దిగొచ్చింది. హైదరాబాద్ , విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఈరోజు రూ.700 తగ్గి రూ.70,300 వద్దకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.760 మేర క్షీణించి రూ. 76,690 వద్దకు తరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు క్షీణించాయి. ఇక దేశ రాజధాని ఢిల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.700 చొప్పున తగ్గి రూ.70,450 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం రూ.760 మేర కరిగి రూ.76,840 దగ్గరకు దిగివచ్చింది.
* దేశంలో అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ అనుబంధ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఐపీఓ (Hyundai IPO) అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కాబోతోంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించినట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. ఇప్పటి వరకు ఎల్‌ఐసీనే (రూ.21వవేల కోట్లు) అతిపెద్ద ఐపీఓగా ఉండగా.. హ్యుందాయ్ మోటార్ దాన్ని అధిగమించనుంది. గరిష్ఠ ధరల శ్రేణి వద్ద రూ.27,870 కోట్లు సమీకరించనుంది.
* జర్మన్ లగ్జరీ కార్ల సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ విక్రయాలు భారత్‌లో గణనీయంగా పెరిగాయి. 2024 సంవత్సరంలో మొదటి 9 నెలల(జనవరి-సెప్టెంబర్) కాలవ్యవధిలో 13% వృద్ధితో 14,379 కార్లను విక్రయించింది. కంపెనీ, సెప్టెంబర్ త్రైమాసికంలో 5,117 అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ అమ్మకాలు 21% ఎక్కువ. జనవరి-ఏప్రిల్ సమయంలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా 800 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల(BEV)ను విక్రయించింది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో 84 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో టాప్ ఎండ్ వాహన విక్రయాలు 18 శాతం పెరిగాయని సంస్థ పేర్కొంది.
* RTGS, NEFT చెల్లింపుల విషయంలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త సదుపాయం ప్రతిపాదించింది. ఇకపై ఆయా చెల్లింపుల వ్యవస్థల ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు అవతలి వ్యక్తి పేరు కనిపించనుంది. ప్రస్తుతం యూపీఐ (UPI), ఐఎంపీఎస్‌లో (IMPS) ఇటువంటి సదుపాయం ఉంది. కొత్తగా దీన్ని విస్తరించనున్నారు. పొరపాటు చెల్లింపులను తగ్గించేందుకు ఈ సదుపాయం ఉయోగపడనుంది. ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొత్త సదుపాయాన్ని ప్రకటించారు. యూపీఐ, ఐఎంపీఎస్ తరహాలో నేమ్ లుక్-అప్ సదుపాయం రాబోతోందని శక్తికాంత దాస్ చెప్పారు. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) సిస్టమ్‌లోనూ ఈ సదుపాయాన్ని తీసుకురావాలన్న వినతుల నేపథ్యంలో నేమ్ లుకప్ ఫెసిలిటీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల పేమెంట్ చేసేటప్పుడు అకౌంట్ నంబర్, బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్ కోడ్ ఎంటర్ చేసేటప్పుడు అవతలి వ్యక్తి పేరు కనిపిస్తుందని, చెల్లింపుల్లో పొరపాట్లకు ఆస్కారం తగ్గుతుందని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z