* సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను హీరో ప్రభాస్ పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మరణించిన సమయంలో తాను అందుబాటులో లేకపోవడంతో.. బుధవారం కూకట్‌పల్లి ఇందు ఫార్చున్ విల్లాలోని రాజేంద్రప్రసాద్ నివాసానికి ప్రభాస్ వెళ్లారు. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. రాజేంద్రప్రసాద్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ప్రభాస్ పరామర్శించారు.
* జమిలి ఎన్నికలకు దేశమంతా సంపూర్ణ మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో సుస్థిర పాలన ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. రాష్ట్రానికి అతిపెద్ద అరిష్టం జగన్ అని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరంకాకుండా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది. అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై దృష్టిసారించవచ్చు. ఇతర దేశాల్లో వృద్ధుల సమస్య పెరుగుతోంది. యువత.. మన దేశానికి గొప్ప బలం. విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం ఎలా ధ్వంసమైందో గత ఐదేళ్లలో చూశాం. సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు గనకే హరియాణాలో మూడోసారి భాజపా అధికారంలోకి వచ్చింది. భాజపా అగ్రనాయకత్వం పనిచేసే విధానం వల్ల హరియాణాలో గెలిచారు’’ అన్నారు.
* రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’ (Vettaiyan). దసరా కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకూ రానున్న ఈ సినిమాకి తెలుగు పేరు పెట్టకపోవడంపై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేసింది. ‘‘తెలుగులో ‘వేటగాడు’ టైటిల్ రిజిస్టర్ చేయించాలనుకున్నాం. ఆ పేరు అందుబాటులో లేకపోవడంతో ఒరిజినల్ పేరుతోనే రిలీజ్ చేయబోతున్నాం. ఇతర డబ్బింగ్ వెర్షన్లకూ ‘వేట్టయన్: ది హంటర్’ పేరే పెట్టాం. ఎప్పటిలానే తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమందితో మేం కలిసి పని చేశాం. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘సీతారామం’ వంటి తెలుగు సినిమాలను తమిళ ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చాం. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. తెలుగు భాష, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, తెలుగు మీడియా, తెలుగు ప్రేక్షకులపై లైకా ప్రొడక్షన్స్‌కు గౌరవం ఉంది’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
* బుధవారం మధ్యాహ్నం ఆయన ఎక్స్ (ట్విటర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. ఆయన ఖాతాను హ్యాక్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. బిట్ కాయిన్ గురించి పోల్ పెట్టారు. ‘‘కొన్నేళ్ల క్రితం 5 డాలర్లతో 100 బిట్ కాయిన్లు కొనుగోలు చేశా. ఇప్పుడు వాటి ధర 6 మిలియన్ డాలర్లు. కాబట్టి వాటిని ఇతరులకు పంచడంపై మీ అభిప్రాయం ఏమిటి? ఓటు చేయండి’’ అని పోస్ట్ పెట్టారు. దీనిని చూసిన పలువురు ఆయన ఖాతా హ్యాక్ అయిందని భావించారు. మరి కొంతమంది మాత్రం పోల్‌లో పాల్గొన్నారు. తమకు కావాలని కామెంట్స్ పెట్టారు. విషయం తెలుసుకున్న చైతన్య టీమ్ సమస్యను పరిష్కరించింది. పోస్ట్‌ను తొలగించింది.
* సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపైనా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
* మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరికాసేపట్లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ టీమ్ఇండియాకు చాలా కీలకం. సెమీస్ చేరాలంటే శ్రీలంకపై భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవాలి. అంతేకాకుండా చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించి నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోకుంటే సెమీస్ చేరడం కష్టమవుతుంది.
భారత్ తుది జట్టు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజీవన్ సజన, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా సింగ్.
శ్రీలంక తుది జట్టు: విష్మి గుణరత్నె, చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవీషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్‌కీపర్), అమ కాంచన, సుగంధిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రణవీర.
* విశాఖ డెయిరీలో అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరపాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రైతుల పేరిట కొనుగోలు చేసిన భూమిని, డెయిరీ పేరిట కొన్న భూములను కూడా బడాబాబులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. విశాఖ డెయిరీ సంస్థ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబం.. తమ ఆస్తిగా విశాఖ డెయిరీని మలుచుకుని అన్ని రకాలుగా పాడి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
* గత ఐదేళ్లలో అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడింది తానేనని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 53 రోజులు జైల్లో ఉన్నది తానేనని, తనని చంపాలని చూశారనే ప్రచారమూ జరిగిందన్నారు. తాను ఉన్న జైలుపై డ్రోన్లు కూడా ఎగురవేశారన్నారు. బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన ప్రతీ కదలికను గమనించడానికి జైలు గదిలో సీసీ కెమెరా కూడా పెట్టారన్నారు. కనీసం వేడి నీళ్లు ఇవ్వకపోగా.. దోమలు కుడుతుంటే కనీసం దోమ తెర లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడ్డానన్నారు. ఇంత అనుభవించిన తాను బయటకు రాగానే ముందు కక్ష తీర్చుకోవాలి కదా అన్న చంద్రబాబు.. తనది ఆ స్వభావం కాదన్నారు. గత ఐదేళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు తనకు తెలుసునన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరనీ.. సరైన సమయంలో చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.
* హరియాణా ఎన్నికల ఫలితాల(Haryana Poll loss) ఎఫెక్ట్ మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో కనిపించింది. కాంగ్రెస్‌కు దక్కిన అనూహ్య ఓటమి.. మహా మిత్రపక్షాల్లో మాటామాటా అనుకునేదాకా వచ్చింది. హస్తం పార్టీ పరాజయంపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడే భాజపా ఓడిపోయింది(జమ్మూకశ్మీర్‌ను ఉద్దేశించి). ఇక హరియాణాలో ఇండియా కూటమి విజయం సాధించలేకపోయింది. ఒంటరిపోరులో గెలుస్తామని కాంగ్రెస్ భావించింది. వారు ఆప్ లేక సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపెట్టుకొని ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఎన్నికల్లో భాజపా పోరాడిన తీరు బాగుంది. ప్రతిఒక్కరు కాంగ్రెస్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ జరగలేదు. సులభమైన పోటీలో ఓడింది. తగిన వ్యవస్థ ఉండటం వల్లే కమలం పార్టీకి గెలుపు సాధ్యమైంది. మహారాష్ట్రలో అలాజరగదు. ఎందుకంటే ఇక్కడ సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ప్రాంతీయ పార్టీ మద్దతులేకుండా ఏమీ జరగదు. ఆ పార్టీలు లేకుండా మోదీ ప్రధాని కాగలిగేవారు కాదు’’ అని వ్యాఖ్యలు చేశారు.
* డీఎస్సీ విజేతలను చూస్తే దసరా పండుగ ముందే వచ్చినట్లు అనిపిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీచర్లే తెలంగాణ వారధులు.. నిర్మాతలని, పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత వారిపైనే ఉందని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ కొత్త టీచర్లకు కీలక సూచనలు చేశారు.
* ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ల అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లాగానే హర్యానా ఎన్నికల ఫలితాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు వైఎస్ జగన్. ఇప్పటికైనా ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏపీలోలాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. మనలాంటి ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలెట్‌లనే వాడుతున్నారు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నాయి. అలాంటప్పుడు మనం కూడా బ్యాలెట్లకే వెళ్లటం మంచిది. అప్పుడే ఓటర్లలో కూడా విశ్వాసం పెరుగుతుంది. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’ అని కోరారు.
* తిరుమల లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చింత సచ్చిన పులుపు చావలేదు ఆన్న సామెత చంద్రబాబు కోసమే పుట్టినట్టు ఉందంటూ సెటైర్లు వేశారు. కల్తీ రాజకీయాలు చేస్తారు కాబట్టే కల్తీ రాజకీయాలను నమ్ముకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘చింత సచ్చిన పులుపు చావలేదన్న సామెత మన ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమే పుట్టినట్లు ఉన్నది. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలపై విచారణ, ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో కల్తీ ఆరోపణలు చేసి కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. సుప్రీం కోర్టు చంద్రబాబు సిట్‌ను కాకుండా సీబీఐ సారథ్యంలో నూతన సిట్ ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ విమర్శలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా తన కలుషిత బుద్ధి మానుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీకి శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేసిన సందర్భాన్ని కూడా తన మీడియాతో స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డు అని ముఖ్యమంత్రి అంటే ప్రధాని సంతోషించారంటూ కల్తీ వార్తలు ప్రచారంలో పెట్టారు. తాను మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుంది కనుక తన మీడియాతో కల్తీ కథనాలు ప్రచారంలో పెట్టారు. కల్తీ రాజకీయాలను చెసే వారు గనుక కల్తీ ప్రచారాన్ని నమ్ముకున్నట్లున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z