పర్యావరణ మార్పులు ఆహార భద్రతకు ముప్పు కలిగించడంతో పాటు పౌష్టికాహార లోపానికీ దారి తీసి చిన్నారుల ఎదుగుదలపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అందులోనూ ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు గర్భస్థ శిశువులు మొదలు రెండేళ్ల చిన్నారుల వరకు నేరుగా వారి ఎదుగుదలలో లోపానికి కారణమవుతున్నాయని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ (ఎల్‌ఎస్‌హెచ్‌టీఎం) పరిశోధకులు వెల్లడించారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 668 మంది చిన్నారులపై వీరు కొనసాగించిన అధ్యయనం వివరాలను లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ప్రచురించింది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం మహిళలు గర్భం దాల్చిన తొలి త్రైమాసికం నుంచే మొదలై చిన్నారులకు రెండేళ్ల వయసు వచ్చే వరకూ ఉంటోందని పరిశోధకులు వెల్లడించారు. పొట్టిగా, తక్కువ బరువుతో పుట్టడంతో పాటు నెలలు నిండకుండానే కాన్పుకావడం వంటి సమస్యలను వీరు గుర్తించారు. అధిక ఉష్ణోగ్రత ఒత్తిడిని తల్లి శరీరం నియంత్రించుకునే స్థాయిని బట్టి గర్భస్థ శిశువుపై ప్రభావం ఉంటుందన్నారు. ఉష్ణోగ్రతల వల్ల కలిగే దుష్ఫలితాల ప్రభావం గర్భస్థ శిశువుల కన్నా 6 నుంచి 18 నెలల వయసు చిన్నారులపై ఎక్కువగా ఉంటుందని అధ్యయన నివేదికను రచించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అనా బోనెల్ తెలిపారు. ఉష్ణోగ్రతల ప్రభావం గాంబియాలో మాదిరిగా ఇతర ప్రాంతాల్లోనూ ఇదే విధమైన దుష్ఫలితాలకు దారితీస్తుందా లేదా అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z