ScienceAndTech

చైనాపైనే ఎదురు సైబర్‌దాడులు

చైనాపైనే ఎదురు సైబర్‌దాడులు

ఇంతవరకు భారత్, అమెరికా, ఐరోపా దేశాల ప్రభుత్వ యంత్రాంగాల్లోకి, రక్షణ, విద్యుత్తు కేంద్రాలు, ఓడ రేవులు, వైద్య, వాణిజ్య సంస్థల నెట్‌వర్కులలోకీ చైనా హ్యాకర్లు చొరబడి కీలక రహస్యాలను చోరీచేస్తున్నారని వార్తలు వింటూ వచ్చాం. ఇప్పుడు సైబర్‌ చౌర్యానికి గురికావడం చైనా వంతయింది. చైనా ప్రభుత్వం, కంపెనీలు తమ కంప్యూటర్‌ యంత్రాంగాలను ఆధునికీకరిస్తున్నందున పాత నెట్‌వర్క్‌ సాధనాలను, సర్వర్లు, సీసీటీవీ కెమేరాలను మూలన పడేస్తున్నాయి. విదేశీ గూఢచారి సంస్థలు సరిగ్గా ఈ పాత సాధనాలు, సర్వర్ల ద్వారా చైనా జాతీయ, వాణిజ్య రహస్యాలను చోరీచేస్తున్నాయని ఆ దేశ జాతీయ భద్రతా శాఖ (ఎంఎస్‌ఎస్‌) హెచ్చరించింది. ఒక చైనా కంపెనీ పక్కనపడేసిన సర్వర్‌ను ఇటీవల ఒక విదేశీ గూఢచారి సంస్థ తన అదుపులోకి తీసుకుని సైబర్‌ దాడి చేసిందని చైనీస్‌ మెసేజింగ్‌ యాప్‌ వియ్‌ చాట్‌ వేదికగా శుక్రవారం ఎంఎస్‌ఎస్‌ వెల్లడించింది. మరోసారి ఒక కెమేరా మానిటరింగ్‌ సంస్థ సర్వర్‌ను అదుపులోకి తీసుకుని యూజర్‌ పేర్లు, పాస్‌వర్డ్‌లను కాజేసి ముఖ్యమైన సమాచారాన్ని, చిత్రాలను దొంగిలించారని వెల్లడించింది. ‘‘విదేశీ గూఢచారులు డేటింగ్‌ పేరిట చైనీయులకు వల వేస్తున్నారు. విద్యాపరమైన కన్సల్టెంట్లుగా నటిస్తున్నారు, అధిక వేతనాలపై పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు ఇస్తున్నట్లు చైనా విద్యార్థులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫొటోగ్రఫీ ప్రాజెక్టుల పేరుతో కీలక సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ-మెయిల్స్‌ పంపి వ్యక్తిగత మెయిల్‌ బాక్స్‌లలో సమాచారాన్నీ సంగ్రహిస్తున్నారు’’ అని చైనా జాతీయ భద్రతా శాఖ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z