* భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక స్కోరు 183. పాకిస్థాన్‌పై 2012 ఆసియా కప్‌లో విరాట్ భారీ శతకం సాధించాడు. ఆ మ్యాచ్‌లో సచిన్, రోహిత్ హాఫ్ సెంచరీలు సాధించారు. పాక్ బౌలింగ్ ఎటాక్ అత్యంత బలంగా ఉండే రోజుల్లో విరాట్ విజృంభించాడు. తొలి ఓవర్‌లోనే కీలక వికెట్‌ను తీసిన తమను ఆ తర్వాత ముగ్గురు బ్యాటర్లు ఓడించారని పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ వ్యాఖ్యానించాడు. ‘‘తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన భారత్‌ను అభినందించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 329 లక్ష్యమంటే తేలికైన విషయం కాదు. కానీ, ఎలాంటి ఇబ్బంది పడకుండా టీమ్‌ఇండియ బ్యాటర్లు ఆడిన తీరు బాగుంది. ఒకవేళ 350కిపైగా పరుగులు చేసినా ఒక్కోసారి అవి కూడా సరిపోవు. మా బౌలింగ్ సత్తాను బట్టి 320 పరుగులు అనేవి ఎక్కువ అని నా అభిప్రాయం. కానీ, భారత బ్యాటర్ల దూకుడు ముందు తక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీని ఆపడం మా వల్ల కాలేదు. కోహ్లీ బ్యాటింగ్ దెబ్బకు మా వద్ద సమాధానం లేదు’’ అని మిస్బా తెలిపాడు.
* కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. తన పేరు, కార్యాలయం పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
* ఇటీవలే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్ అల్ హసన్ యూఎస్‌ఏకు వెళ్లిపోయాడు. భారత్ పర్యటన నుంచి నేరుగా అమెరికాకు చేరాడు. బంగ్లాలో అతడిపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ దేశంలో తలెత్తిన సంఘర్షణల నేపథ్యంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దానికి కారణం షేక్ హసీనా ప్రభుత్వమేనని ఆ యువకుడి తండ్రి కేసు పెట్టాడు. హసీనా పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన షకిబ్‌పైనా కేసు నమోదైంది. దీంతో అతడు స్వదేశానికి వెళ్లకుండా యూఎస్‌కి చేరాడు. కెనడాలో టీ20 లీగ్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాలో చెలరేగిన పరిస్థితులపై తొలిసారి షకిబ్ స్పందించాడు. తాను నిశ్శబ్దంగా ఉన్నందుకు క్షమించాలని కోరాడు.
* తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కి అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు బోర్డు తెలిపింది. గత నెలలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు ఇప్పుడు అదనంగా మరో 272 పోస్టులను జతచేసింది. దీనితో మొత్తం భర్తీ చేయనున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2,322కి చేరాయి. ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాని బోర్డు సూచించింది. నవంబర్ 17న కంప్యూటర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.
* ప్రముఖ నటుడు షాయాజీ షిండే (Sayaji Shinde) రాజకీయ అరంగేట్రం చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో చేరారు. ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికల్లో షిండే పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినబడుతున్నాయి.
* మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్.విజయ్‌పాల్ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. గుంటూరు పశ్చిమ డీఎస్పీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. కొన్నాళ్లుగా పరారీలో ఉన్న విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ గత నెల 24న ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం.. విజయ్‌పాల్ విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
* ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ(317), జో రూట్ డబుల్ సెంచరీ(262)తో అద్భుత ప్రదర్శన చేశారు. వీరిద్దరూ 454 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 67 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ఆతిథ్య పాకిస్థాన్‌కు ఘోర పరాజయం రుచి చూపించారు. ఒక సమయంలో ముల్తాన్ పిచ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంటే ఆట ఆసక్తిగా ఉండదంటూ సీనియర్ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రిపుల్ సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్ స్పందించాడు. బ్యాటింగ్ చేయడానికి ఆ పిచ్ ‘అన్ రియల్’గా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
* ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్‌గా మున్సిపాలిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్‌గా ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఇద్దరు ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనసాగనున్న ఈ కమిటీలు.. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.
* అర్టికల్ 370 విషయంలో పునరాలోచన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. పదేళ్ల భాజపా పాలనలో భారతదేశం అంతర్జాతీయంగా బలపడుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయని.. 40ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
* పాలనలో వేగం పెంచేలా AP రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్థిక, ఆర్థికేతర అంశాలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మొత్తంగా 49 అంశాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. ఆర్థిక పురోగతిలో భాగంగా 24 పాలసీలు రూపొందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రాభివృద్ధి, విజన్ డాక్యుమెంట్లు, గ్రోత్ పాలసీలో భాగంగా విధాన పత్రాల రూపకల్పన చేయనుంది. ఈ మేరకు ఆర్థికేతర అంశాల పరిష్కారం, పాలసీల రూపకల్పనపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30లోగా తీసుకున్న చర్యలు, పాలసీల రూపకల్పన వివరాలను సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. వచ్చే కేబినెట్ భేటీలో ఆర్థికేతర అంశాల పరిష్కారం, విధానాల రూపకల్పనపై చర్చ ఉంటుందని సీఎస్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
* తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వైద్య సదుపాయాలను మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఒక్కో స్కూల్ భవనాన్ని రూ.25 కోట్లతో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా కొందుర్గులో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. చదువుకున్న విద్యార్థుల కొలువుల గురిచి కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పేదలంతా గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలని కేసీఆర్ భావించారని విమర్శించారు.
* నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీపై ఉన్న డీజిల్ ట్యాంకర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
* ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి -2024 జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంక్యో (Nihon Hidankyo) సంస్థను వరించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల (Hibakusha) పక్షాన ఈ సంస్థ పోరాడుతోంది.
* ‘మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఆయనకు అన్నీ మంచే చేశా.. ఎక్కడా తక్కువ చేయలేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీని చేసి..మంత్రి పదవినీ ఇచ్చా.. మండలిని రద్దు చేద్దామనుకున్నప్పుడు తన పదవి పోతుందని ఆయన అడగ్గానే రాజ్యసభకు పంపా..అయినా మోపిదేవి పార్టీని వీడి వెళ్లారు. ఇది బాధాకరం’ అని వైకాపా అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ అన్నారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రేపల్లె నియోజకవర్గ నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇప్పుడు రేపల్లె ప్రస్తుత వైకాపా సమన్వయకర్త గణేష్‌కు మీ మద్దతు చాలా అవసరం’ అని నేతలకు చెప్పారు. ‘ఓట్లు అడగడానికి వెళ్లిన ప్రతి చోటా అబద్ధాలు చెప్పి అందరినీ చంద్రబాబు మోసం చేశారు. వాలంటీర్లను తీసేయను, వేతనం కూడా రూ.10వేలకు పెంచి ఇస్తా అని చెప్పి వారందరినీ దగా చేశారు. ఇంట్లో ఏ వయసు వారికైనా రకరకాల పథకాల కింద సొమ్మునిస్తామని చెప్పారు. నేను కూడా చంద్రబాబు అబద్ధాలతో పోటీ పడి ఉంటే, బహుశా ముఖ్యమంత్రి స్థానంలోనే ఉండేవాడినేమో… కానీ, మీలో ఎవరికైనా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండేదా?..ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ, ఆయన పార్టీ కార్యకర్తలు ఎవరూ ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z