Business

రూపాయి విలువ ఢమాల్…ఒక డాలరుకి రికార్డు మారకం-BusinessNews-Oct 11 2024

రూపాయి విలువ ఢమాల్…ఒక డాలరుకి రికార్డు మారకం-BusinessNews-Oct 11 2024

* ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు సంబంధించి దరఖాస్తు గడువు శుక్రవారం రాత్రి 7గంటలకు ముగిసింది. మద్యం దుకాణాల కోసం దాదాపు 90వేల వరకు దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ, రాత్రి 12గంటల్లోపు ధరావత్తు సొమ్ము చెల్లించేందుకు అబ్కారీశాఖ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించిన ఎక్సైజ్‌శాఖ ఈ నెల 14న లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించనుంది. అక్టోబరు 15వ తేదీ నాటికి దుకాణాలను లాటరీలో దక్కించుకున్న ప్రైవేటు వారికి అబ్కారీశాఖ అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.

* రిలయన్స్‌ జియో (Jio) కొత్తగా రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను తీసుకొచ్చింది. దీర్ఘకాలం పాటు వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతో పాటు స్విగ్గీ వన్, అమెజాన్‌ ప్రైమ్‌లైట్ మెంబర్‌ షిప్‌లతో రూ.1028, రూ.1029 ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. జియో తీసుకొచ్చిన 1028 ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అపరిమిత కాల్స్‌, 2జీబీ రోజువారీ డేటా పరిమితితో ఈ ప్లాన్ వస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ ఉన్నచోట అపరిమిత డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు స్విగ్గీవన్ లైట్‌ మెంబర్‌ షిప్‌ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి.

* ప్రముఖ నటి శ్రుతిహాసన్‌ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సేవలపై అసహనం వ్యక్తం చేశారు. విమానం ఆలస్యంపై ప్రయాణికులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో తనతో పాటు తోటి ప్రయాణికులు ఎంతగానో ఇబ్బంది పడ్డారని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఇండిగో స్పందించింది. విమానం ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని వివరించింది. ‘‘ నేను సాధారణంగా ఫిర్యాదు చేయను. కానీ ఈరోజు మీరు చాలా ఇబ్బంది కలిగించారు. విమానం ఆలస్యంపై మాకు ఎటువంటి సమాచారం అందించలేదు. నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చింది’’ అని ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. ఈ విషయంపై ప్రయాణికులకు కనీసం సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేస్తూ ఇండిగోని ట్యాగ్‌ చేశారు. ఈ పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై ఎయిర్‌లైన్స్‌ స్పందించింది. తమ విమానం ఆలస్యానికి గల కారణాన్ని ఇండిగో వివరించింది. ‘‘విమాన ఆలస్యంగా రావడం వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. ముంబయిలోని వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది’’ అని ఇండిగో సమాధానం ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఎయిర్‌లైన్స్‌ కృషి చేస్తోందని పేర్కొంది.

* దేశీయ కరెన్సీ రూపాయి విలువ (Rupee value) జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరింది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం తొలిసారి 84 స్థాయికి చేరింది. పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలు, ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ మదుపరులు తమ నిధులు తరలిస్తుండటం రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో నేడు ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి అయిన 84.05 స్థాయికి చేరింది.

* రిలయన్స్‌కు చెందిన ఆర్థికసేవల విభాగం జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (Jio Financial Services) బీమా రంగంలో అడుగుపెట్టింది. ‘జియో ఫైనాన్స్‌’ పేరిట యాప్‌ను ప్రవేశపెట్టినట్లు శుక్రవారం ప్రకటించింది. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ స్టోర్‌ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మై జియోలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌), డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘జియో ఫైనాన్స్‌’ బీటా/ పైలట్‌ వెర్షన్‌ యాప్‌ను ఈ ఏడాది మే 30నే లాంచ్‌ చేసింది. వినియోగదారుల నుంచి సూచనలు, సలహాల మేరకు నేడు పూర్తిస్థాయి యాప్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ స్టాక్ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కేవలం 5 నిమిషాల్లో ఈ డిజిట్‌ సేవింగ్‌ ఖాతా తెరవచ్చని కంపెనీ తెలిపింది. బయోమెట్రిక్‌, ఫిజికల్ డెబిట్‌ కార్డ్‌తో సురక్షితమైన బ్యాంకు ఖాతాను పొందొచ్చని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ యాప్‌తో డిజిటల్‌ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, బిల్లుల చెల్లింపు, బీమా సలహాదారు వంటి సేవలు పొందొచ్చని జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తెలిపింది. మొబైల్‌ రీఛార్జ్‌, క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించే సదుపాయం కూడా ఉంటుందని ప్రకటించింది. జియో ఫైనాన్స్‌ యాప్‌ వినియోగదారులు వివిధ బ్యాంకు ఖాతాల్లో హోల్డింగ్స్‌, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు వీక్షించే అవకాశం కూడా కల్పిస్తోంది. అంతేకాదు 24 బీమా ప్లాన్‌లను అందిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z