NRI-NRT

సింగపూర్‌లో సిలికానాంధ్ర “మనబడి” స్నాతకోత్సవం

సింగపూర్‌లో సిలికానాంధ్ర “మనబడి” స్నాతకోత్సవం

సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సిలికానాంధ్ర “మనబడి” తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 29న సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్‌ ఎగ్జిబిషన్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి మా తెలుగు తల్లికి గీతాలాపనతో ప్రారంభించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రారంభోన్యాసం చేశారు. ఈతరం వారికి తెలుగు భాష అవసరాన్ని వివరిస్తూ సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.

2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో ప్రవేశం, ప్రసూనం తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తెల్లటి కండువా కప్పి మెడల్‌తో పాటు సిలికానాంధ్ర, సింగపూర్ తెలుగు సమాజం స్నాతకోత్సవ ధ్రువపత్రాలను బహుకరించినట్లు కార్యక్రమ నిర్వాహకులు స్వామి గోపి కిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ..మంచి అభిరుచితో తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులను అభినందించారు. మనబడి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అంతర్జాతీయ పాఠశాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ మాతృభాష ఉన్నతికి కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని, నిస్వార్ధంగా సేవ చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. భవిష్యత్తులో మనబడి కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. సాంబశివరావు, శేఖర్‌కు నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం తెలుగు బడి విద్యార్థులు ప్రదర్శించిన పద్య పఠనం, తెలుగు పాటలు, శాస్త్రీయ సంగీతం, నాట్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి చాణక్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి వందన సమర్పణ చేస్తూ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఎన్‌ఆర్‌ఐ వన్‌, జీఐజీ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మనబడి కార్యక్రమాలను మరింత మంది ఉపయోగించుకుని తద్వారా మాతృభాష అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు. ఉపాధ్యక్షులు పాలెపు మల్లికార్జున్‌, కురిచేటి జ్యోతీశ్వర్‌ కార్యక్రమానికి మొదటి నుంచి సహకారం అందించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z