* ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ (Boeing).. పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కార్మికులు సమ్మె చేయడంతో వాటిల్లిన నష్టం కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఏకంగా 17వేల మంది సిబ్బందిపై వేటు వేయనుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు 10శాతం మందిని తొలగించనుంది.
* దేశవ్యాప్తంగా డీమార్ట్ (Dmart) పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో(Q2 Results) స్టాండలోన్ పద్ధతిలో రూ.710.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.658.54 కోట్లతో పోలిస్తే లాభంలో 8 శాతం వృద్ధిచెందింది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ లాభం 5.6 శాతం పెరిగి రూ.659 కోట్లకు చేరుకుంది.
* బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో దేశీయంగా ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం తులం బంగారం ధర రూ.1,150 ఎగబాకి రూ.78,500 పలికింది. ఆభరణాల కొనుగోళ్లు పుంజుకోవడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో ధరలు పెరిగాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. బంగారంతోపాటు వెండి కూడా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి రూ.1,500 అధికమై రూ.93 వేలు పలికింది. వరుసగా రెండోరోజు కూడా ధరలు పెరగడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 30 డాలర్లు పెరిగి 2,670 డాలర్లకు చేరుకున్నది.
* దేశీయ కరెన్సీ విలవిలలాడుతున్నది. డాలర్ దెబ్బకు కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారిగా 84 స్థాయిని అధిగమించింది. శుక్రవారం ఒకేరోజు 12 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 84.10 స్థాయికి జారుకున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉండటం, డాలర్‌కు డిమాండ్ ఉండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటు అంతర్జాతీయంగా ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనడంతో చమురు ధరలు భగ్గుమనే అవకాశం ఉండటంతో కరెన్సీ విలువ బలహీన పడటానికి ప్రధాన కారణాలని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.
* స్టాక్ మార్కెట్లో దివీస్ లేబొరేటరీస్ షేరు ధర దూసుకుపోతోంది. ఈ కంపెనీ భవిష్యత్తు వృద్ధి అవకాశాలపై మదుపరుల్లో విశ్వాసం పెరగడమే ఇందుకు కారణం. శుక్రవారం బీఎస్‌ఈలో జీవనకాల గరిష్ఠమైన రూ.6,159కు చేరిన ఈ షేరు, చివరకు రూ.6,141.15 వద్ద స్థిరపడింది. ఇది కూడా రికార్డు ముగింపే. దీనివల్ల కంపెనీ మార్కెట్ విలువ రూ.1.63 లక్షల కోట్లను మించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి విలువ సాధించిన తొలి కంపెనీగా దివీస్ గుర్తింపు సాధించింది. కొంతకాలం క్రితం రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువను చేరుకున్నప్పుడు, దివీస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z