ScienceAndTech

విజయవంతమైన స్పేస్‌ఎక్స్‌ అయిదో ప్రయోగం-NewsRoundup-Oct 13 2024

విజయవంతమైన స్పేస్‌ఎక్స్‌ అయిదో ప్రయోగం-NewsRoundup-Oct 13 2024

* ‘స్పేస్‌ఎక్స్‌’ (SpaceX) చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘స్టార్‌షిప్‌ (Starship)’ ఐదో ప్రయోగం విజయవంతమైంది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం టెక్సాస్‌ దక్షిణ తీరం నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు దశల (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌) ఈ భారీ రాకెట్‌లో తొలుత బూస్టర్‌ విజయవంతంగా భూమికి చేరుకుంది. లాంచ్‌ప్యాడ్‌ వద్దకే అది తిరిగి చేరుకోవడం విశేషం. మరోవైపు.. స్పేస్‌క్రాఫ్ట్‌ తన ప్రయాణాన్ని కొనసాగించి, హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది.

* కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వైకాపాను వీడేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీలో ఉండబోనని స్పష్టం చేశారు. కత్తిమండలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనను వైకాపా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ రాజోలులో కష్టపడి పనిచేసినా నాకు టికెట్ ఇవ్వలేదు. నాపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు టికెట్‌ ఇచ్చారు. ఇష్టం లేకపోయినా పెద్దల సలహా మేరకు ఎంపీగా పోటీ చేశా. వైకాపాతో తెగదెంపులు చేసుకున్నా.. త్వరలో మరో పార్టీలో చేరతా’’అని రాపాక తెలిపారు.

* హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. దసరా సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు పయనమవ్వడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. చౌటుప్పల్‌ నుంచి దాదాపు కొయ్యలగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చాలా మంది సొంతవాహనాల్లోనే వస్తుండటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రద్దీని క్రమబద్ధీకరించేందు పోలీసులు రంగంలోకి దిగారు.

* ‘‘జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వాన్ని నడపడంలో సంపూర్ణ మద్దతు అందిస్తాం. ఆయన నాయకత్వంలో జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రికి పరిమిత అధికారాలు ఉన్న కారణంగా దిల్లీని ‘హాఫ్‌ స్టేట్‌’ అని పిలుస్తారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌నూ ఇలాగే మార్చేశారు. ఎన్నికైన ప్రభుత్వానికంటే లెఫ్టినెంట్ గవర్నర్‌కే అధికారాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో పాలనాపరంగా ఏదైనా సమస్య ఎదురైతే నన్ను సంప్రదించండి. దిల్లీ సీఎంగా పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపాను’’ అని దిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

* అనారోగ్యంతో మరణించిన తండ్రి అంత్యక్రియలను అశ్రునయనాలతో కుమార్తె నిర్వహించిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. గోరంట్లకు చెందిన మేరావత్ బాబ్జీ విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్నారు. ఈనెల 11న ఆయన అనారోగ్యంతో మరణించారు. బాబ్జీకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బంధుమిత్రుల సూచనతో పెద్ద కుమార్తె జాహ్నవి తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చింది. కన్నీటితోనే తండ్రి అంతిమయాత్రలో పాల్గొని చితికి నిప్పంటించింది.

* కర్ణాటక (Karnataka)లో ముడా స్కాం(MUDA scam) ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (కేఐఏడీబీ) కేటాయించిన ఐదు ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖర్గే కుటుంబం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.రాహుల్‌ ఖర్గే నేతృత్వంలోని సిద్ధార్థ విహార్ ట్రస్ట్‌కు గతంలో కర్ణాటక ప్రభుత్వం బగలూరులోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ హార్డ్‌వేర్ సెక్టార్‌లో ఐదుకరాల భూమిని మంజూరు చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని భాజపా నేత అమిత్‌ మాలవీయ విమర్శించారు.

* సినీనటి తాప్సి తనకు ఎదురైన ఓ చేదు ఘటనను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ 24 గంటలు ఆలస్యమైందని, మరోవైపు కస్టమర్‌ కేర్‌ సర్వీసు కూడా అందుబాటులో లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్‌ 24 గంటలు ఆలస్యం అనేది మీ సమస్య. ఇది ప్రయాణికుల సమస్య కాదు అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. విమానం ఆలస్యంపై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌ అయ్యింది.

* ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌పై ఏపీ ప్రభుత్వ దాడిని ఖండిస్తున్నానని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ట్విట్టర్‌లో పెట్టిన పోస్టులో తప్పేముందంటూ ప్రశ్నించారు. సునీల్‌పై చంద్రబాబు ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అనడం సర్వీసు రూల్‌ ఉల్లంఘన ఎట్లయితది? రాజ్యాంగం ఆర్టికల్ 19 మళ్లీ మళ్లీ చదవండి. అప్పుడయినా విషయం అర్థం అయితదేమో!’’ అంటూ ట్వీట్‌ చేశారు.

* బతుకమ్మ వేడుకల(Bhatukamma festival) సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్‌(DJ Sounds) ఉపయోగించిన ఘటనలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో(Mayor Vijayalakshmi) పాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 10న సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని ఎన్‌బీనగర్‌లో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z