* ట్రూడో సర్కారు ఓటు బ్యాంక్ రాజకీయాలతో భారత్-కెనడా సంబంధాలు మరింత దిగజారాయి. ఇటీవల భారత హైకమిషనర్ సహా పలువురు దౌత్యవేత్తలను దర్యాప్తులో భాగంగా ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్’లుగా (అనుమానితులుగా) పేర్కొంటూ కెనడా నుంచి మన విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ ఆరోపణలపై న్యూదిల్లీ తీవ్రంగా స్పందించింది. ఇవి పూర్తి అసంబద్ధమైనవని పేర్కొంది. ఓటు బ్యాంక్ రాజకీయాలతో నడిచే ట్రూడో సర్కారు అజెండాకు అనుకూలంగా ఉన్నాయని మండిపడింది. కెనడా చర్యతో.. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చినట్లైంది. 2023లో ఆ దేశ ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన నాటి నుంచి వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలను భారత్‌తో పంచుకోలేదని విదేశాంగశాఖ వెల్లడించింది. ఇప్పటికే తాము పలు మార్లు ఆ దేశ సర్కారును అభ్యర్థించామని వెల్లడించింది. రాజకీయ లబ్ధికోసమే తాజాగా ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌పై విమర్శలు చేస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
* సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. తనకు భద్రత కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. తాజాగా తీర్పును వెలువరించింది. సుధాకర్‌రెడ్డికి భద్రత కల్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు. ఆయన వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో తెదేపా కార్యాలయంపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చైతన్య.. వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు.
* తొలిసారి పోలీస్ పాత్ర పోషించడం ఎలా ఉందన్న ప్రశ్నకు కాజోల్ సమాధానమిస్తూ.. ‘మీరు యూనిఫాం ధరిస్తే, తెలియకుండానే గౌరవభావం కలుగుతుంది. నా సినిమాల విడుదల సమయంలో నేనెప్పుడూ ఆందోళనపడను. ఎందుకంటే వందశాతం మనసు పెట్టి పనిచేస్తా. నాపై నాకు నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికీ ఒక్కో దృష్టి కోణం ఉంటుంది. కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చకపోవచ్చు. ప్రేక్షకుల ప్రేమ కోసమే మేము పనిచేస్తాం’ అని అన్నారు. ‘సింగమ్’ చిత్రాల్లో పోలీస్‌గా ప్రేక్షకులను మెప్పించే ఉండే భర్త అజయ్ దేవ్‌గణ్ నుంచి ఏమైనా సలహాలు తీసుకున్నారా? అని అడగ్గా, ‘ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. ఇంట్లో నేనే సింహం. ఈ పాత్ర కోసం అజయ్ నుంచి ఎలాంటి సలహాలు తీసుకోలేదు’ అని కాజోల్ చెప్పడంతో కార్యక్రమంలో నవ్వులు వెల్లివెరిశాయి.
* ‘‘ప్రభాస్ (Prabhas) సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను దిల్లీలో చదువుకుంటున్నా. దీంతో షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి దిల్లీ వెళ్లిపోయా. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్ కోసం ఎన్నిరోజులైనా ఫోన్ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ సినిమా నుంచి తొలగించేశారు. అప్పటికే ప్రభాస్- కాజల్‌ల (Kajal Aggarwal) కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో మరోసారి ఆ జోడి రిపీట్ అయితే బాగుంటుందని భావించిన చిత్రబృందం నన్ను తొలగించి తనను తీసుకుంది. సినిమా అనేది ఓ వ్యాపారం.. ఇందులో కొత్తగా పరిశ్రమకు వచ్చిన అమ్మాయిలకు ఇలా జరగడం సహజమే. నాకు ఎన్నోసార్లు ఇలా జరిగింది. ఒక అవకాశం పోయినా.. దానికి మించింది మన కోసం ఎదురుచూస్తుంటుందని నేను భావిస్తా’’ అని రకుల్ చెప్పారు.
* కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలతో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఓపీటీ కార్యదర్శి ఆదేశాలు సైతం జారీ చేశారు. అయితే డీఓపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన క్యాట్‌లో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి కోరారు. ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ అధికారిణి సృజన కోరారు. వారి పిటిషన్లపై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టనుంది.
* వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. అతడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా న్యాయస్థానం కొట్టి వేసింది. వైకాపా అధికారంలో ఉండగా చంద్రబాబు ఇంటిపై దాడి, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు ఆయన్ను తరలించిన విషయం తెలిసిందే.
* ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్’లుగా (అనుమానితులుగా) కెనడా (Canada) పేర్కొనడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అవి అసంబద్ధ చర్యలుగా మండిపడింది. ఈ క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చర్యలను వ్యతిరేకిస్తూ భారత్‌లోని కెనడా దౌత్యవేత్తకు తాజాగా సమన్లు జారీ చేసింది.
* ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని హోం మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ఘటాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూమ్‌ను మంత్రి పరిశీలించారు. సిరిమానోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. హోం మంత్రి వెంట ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితరులు ఉన్నారు.
* ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి వెళ్లిన రేవంత్.. సంస్థ పురోగతిపై అక్కడి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
* అక్టోబరు 22, 23 తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో రెండు రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. వ్యవసాయం, వైద్యారోగ్యం, అర్బన్ ప్లానింగ్, శాంతి భద్రతలు, వస్తు ఉత్పత్తి రంగాల్లో డ్రోన్ల వినియోగంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనుంది. వాణిజ్య పరంగా డ్రోన్ల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌కు ఈ సమ్మిట్‌లో రూపకల్పన చేయనున్నారు.
* దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకం పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఆలయాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. భద్రాచలం, రామప్ప, జోగులాంబ, బల్కంపేట ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వెయ్యి స్తంభాల మండపంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z